జగన్ చేస్తున్నవీ తప్పులే..

తెలంగాణలో కేసీఆర్ ఎలా వ్యవహరించారో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహారం కూడా అలాగే ఉన్నది

  • Publish Date - January 17, 2024 / 03:02 AM IST

ఎవరో చెప్పారని జగన్ ఇల్లు పీకి పందిరి వేస్తున్నారు. కష్టకాలంలో తనతో ఉన్న మూల వేళ్లన్నింటినీ తెగ నరుకుతున్నారు. ప్రతిపక్షాలు కూడా చేయనంత డామేజీ చేసుకుంటున్నారు. తెలంగాణాలో బీఆరెస్‌కు 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 97 లక్షల ఓట్లు వస్తే, ఆ తర్వాత అయిదు మాసాలకే- 2019 ఏప్రిల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 76.9 లక్షల ఓట్లే వచ్చాయి. ఇరవై లక్షల ఓట్లు తగ్గాయి. ఏడు లోక్‌సభ సీట్లు పోయాయి. ఎందువల్ల? ఎవరి కారణంగా? ఇది అర్థమైతే చాలా తీర్పులు అర్థమవుతాయి.

మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఏ ప్రజాప్రతినిధులనూ కలవని అధినేతలు, అసెంబ్లీ సచివాలయం, మంత్రివర్గం, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, మీడియా.. ఇవేవీ లెక్క చేయని అధినేతలు, ప్రజలంటే ఇసుమంతయినా భయం లేని అధినేతలు-

ప్రజలకు మాత్రం ఎప్పుడో ఒకప్పుడు కోపం రాదా?

అధినేతలు రాజాధిరాజులు. ఎమ్మెల్యేలు సామంత రాజులు. అధినేతలు చేసే తప్పులు ఎమ్మెల్యేలకు హాని చేయవా? ఎమ్మెల్యేలు చేసే తప్పులు అధినేతకు హాని చేయవా? అధినేతలు తమ తప్పులు ఎప్పుడూ గుర్తించరు. గుర్తిస్తే నామర్దా. అందుకే చిన్నవాళ్లను బలి చేస్తారు. తెలంగాణ ప్రజలు ఓటేసింది రాచరిక పోకడలకు వ్యతిరేకంగా. ఆంధ్రాలో ఓటు వేయబోయేది కూడా ఆ ధోరణులపై తిరుగుబాటుగానే. ‘మేము టిక్కెట్లిస్తాం, డబ్బులిస్తాం, కాళ్ళు మొక్కి తీసుకెళ్లండి, గెలిచి రండి, పడి ఉండండి’- ఇదీ వీరి ప్లాను. జయలలితకు సాగి ఉండవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఎలా? ‘ప్రజలకు అన్నీ ఇస్తున్నాం. మా ఇష్టారాజ్యంగా మేము వ్యవహరిస్తాం’ అంటే జనం ఊరుకోరు. మీకు ఆ అధికారం ఇచ్చిన ప్రజలకు నచ్చే విధంగా మసలుకోవడం కూడా తప్పని సరి. ప్రజలకు అన్నింటినీ మించి ఇష్టమైనది ప్రజాస్వామ్యమని, స్వేచ్ఛ అనీ గుర్తిస్తే మంచిది.

శరత్‌చంద్రారెడ్డి,