Operation Sindoor | USSR పతనమై ‘ఏకధ్రువ ప్రపంచ క్రమం’ (యూని పోలార్ వరల్డ్ ఆర్డర్) 1991 లో ఉనికిలోకి రాక ముందు రెండున్నర దశాబ్దాలు మన విదేశాంగ విధానం ప్రధానంగా USSR మీద ఆధారపడి కొనసాగింది. అది 1960 దశకం చివర USSR కి మన విదేశాంగ విధానం దగ్గరై 1971లో USSR-భారత్ సైనిక ఒప్పందంతో బలపడింది. USSR అంతర్జాతీయ రంగంలో ఉచ్చదశలో ఉన్నంత కాలం ఆ బంధం కొనసాగింది. ఆ తర్వాత మన విదేశాంగ విధానం అమెరికా వైపు మొగ్గింది. అయితే అదేదో ఆకస్మిక పరిణామంగా జరగలేదు.
అధికారికంగా USSR పతనం 1991 లో జరిగినా, అది 1988 లో ఆఫఘనిస్తాన్ లో సైనిక ఓటమి నుండే పతన క్రమం మొదలై క్రమంగా కొనసాగింది. ఆ క్రమం సాగిన దశ (1988-91) అంతర్జాతీయ రంగంలో ఓ పరివర్తనా కాలం. ఆ కాలంలోనే మన దేశ విదేశాంగ విధానంతో పాటు, అంతరంగిక విధానంలో కూడా పరివర్తన జరిగింది. అంతకు ముందున్న ‘USSR అనుకూల భారత్’ ని తన వైపు మార్చుకోవడానికి అమెరికా నుండి తీవ్ర ప్రయత్నాలు సాగాయి. ఫలితంగా మన దేశ రాజకీయ వ్యవస్థ తీవ్ర అస్థిరతకి గురై అంతకు ముందున్న ‘ద్విధ్రువ రాజకీయ వ్యవస్థ’ (బై పోలార్ పొలిటికల్ సిస్టమ్) స్థానంలో కొంత కాలం తృతీయ ఫ్రంట్ ముందుకు వచ్చి ‘సంకీర్ణ రాజకీయ వ్యవస్థ’గా పరివర్తన చెందింది. ఆ దశలో దేశంలో తరచుగా ప్రభుత్వాల మార్పిళ్ళు జరిగాయి. అదే బీజేపీ రాజకీయ పునరుజ్జీవనం పొందడానికి పరివర్తనా దశగా కూడా మారింది.
గాంధీ హత్యతో దేశ ప్రజలలో అప్రతిష్టపాలై బలహీనపడ్డ జనసంఘ్ 1948 నుండి 1980 వరకు తిరిగి కోలుకోలేదు. తానే చంపిన గాంధీ పేర ‘గాంధీయన్ సోషలిజం’ లక్ష్యంగా జనసంఘ్ తన పేరు సైతం మార్చుకొని, 1980లో బీజేపీగా పేరు మార్చుకోవాల్సిన తీవ్ర ఆత్మరక్షణ స్థితిలో పడింది. ఐనా దేశ ప్రజలు క్షమించలేదు. 1989 లోకసభ ఎన్నికల్లో కూడా చతికిల పడింది. సరిగ్గా ఆ స్థితిలో అంతర్జాతీయ రంగంలో USSR పతన క్రమం సాగింది. అది మన దేశంలో అమెరికా జోక్యం ముమ్మరం చేయడానికి అవకాశం కల్పించింది. మన భారతదేశ ఆర్ధిక, రాజకీయ వ్యవస్థలో అమెరికా లోతుగా పాగా వేయడానికి అనుకూల పరిస్థితిని ఏర్పరిచింది. అది కుట్రలు (COUPS) పన్నడానికి కూడా తగిన అవకాశాన్ని కల్పించింది. అది బీజేపీకి రాజకీయ సువర్ణావకాశంగా మారి అనూహ్య స్థాయిలో బలపడడానికి పునాది వేసింది.
‘గాంధీయన్ సోషలిజం’ ఎత్తుగడ సైతం బెడిసి, చతికిలపడ్డ బీజేపీ ని ఆలంబనగా చేసుకొని, మత ప్రాతిపదికన మన దేశంలో పాగా వేసేందుకు అమెరికా వ్యూహ రచన చేసింది. మొదట కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసిన విపి సింగ్ కూటమిని చేరదీసే ఓ ఆలోచనను అమెరికా చేసింది. అయితే అది ప్రధానంగా లౌకిక పక్షాల ఫ్రంట్ కావడంతో మత ఎజెండా ద్వారా దేశంలో చొరబడే తన వ్యూహం అమలు కాదని అమెరికా అంచనా వేసింది. సరిగ్గా ఆ స్థితిలో బీజేపీ విధానం ఒక మలుపు తిరిగింది. ‘గాంధీయన్ సోషలిజం’ వదిలేసి తిరిగి మతాన్ని ఎజెండాగా చేసుకుంది.
ఇక్కడొక విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మత సమైక్యతతో సాగే స్వాతంత్ర్య పోరాటాన్ని దెబ్బతీయడానికి బ్రిటీష్ పాలకులు ఒకవైపు ముస్లిం లీగ్, మరోవైపు ఆర్.ఎస్.ఎస్ సంస్థల్ని స్థాపించారు. 1947 లో ఇండియా నుండి వైలిగిన తర్వాత భారత పై పూర్తి నియంత్రణ కోసం గాంధీ హత్యకి ఆర్.ఎస్.ఎస్. ని బ్రిటీష్ సామ్రాజ్యవాద శక్తులు ప్రోత్సాహించడం ఓ చేదు నిజం. అమెరికా సామ్రాజ్యవాదులు 40 ఏండ్ల తర్వాత అదే మత ఎజెండా ఆర్.ఎస్.ఎస్. చేతికిచ్చి వెన్నుదన్నుగా నిలబడ్డారు. ఐతే బ్రిటీష్ సామ్రాజ్యవాదుల నుండి గుణపాఠం తీసుకుంది. మత సామరస్యానికి కట్టుబడ్డ సాత్విక హిందు మత ప్రతినిధి గాంధీని చంపితే తీవ్ర హిందుత్వ వాదం బలపడుతుందని బ్రిటీష్ సామ్రాజ్యవాద అంచనా బెడిసికొట్టింది. సాఫ్ట్ హిందూ మతాన్ని దెబ్బతీస్తే, హార్డ్ హిందూ మత రాజకీయ పునాది ఓ ప్రత్యామ్నాయ శక్తిగా బలపడుతుందనే బ్రిటీష్ అంచనా విఫలమైనది. ఆ చరిత్ర నుండి అమెరికా గుణపాఠం తీసుకుంది.
‘సాఫ్ట్ హిందూ’ వర్సెస్ ‘హార్డ్ హిందూ’ కాకుండా, ‘ముస్లిం వర్సెస్ హిందూ’ గా వైరుధ్యాన్ని తీవ్రతరం చేయాలని అమెరికా కొత్త వ్యూహరచన చేసింది. ఫలితమే పైన పేర్కొన్న బాబ్రీ మసీద్ వివాదం! నిజానికి ఆర్.ఎస్.ఎస్. స్థాపన నుండే అయోధ్య వంటి అంశాలు ఎజెండా కలిగివున్నా, తీవ్ర ఎదురు దెబ్బలు తిన్న నేపథ్యంలో వదిలేసింది. అమెరికా ఊతం లభించడంతో 1989 నుండి అయోధ్య అంశాన్ని బీజేపీ తిరిగి భుజానికి ఎత్తుకుంది. అది ప్రధానంగా దేశీయ పరిణామంగా కాకుండా, అంతర్జాతీయ పరిస్థితి కారణంగా సంభవించిన పరిణామంగా చూడాలి. ఏదైనా నాటి నుండి తిరిగి బీజేపీ కి అదో ప్రత్యేక ఎజెండాగా మారింది.
అంతర్జాతీయ రంగంలో ‘USSR పతన క్రమం’ సాగిన పరివర్తనా దశలో దేశీయ రంగంలో బాబ్రీ మసీద్ ఆందోళనా క్రమం కూడా సమాంతంరంగా కొనసాగింది. ఒకవైపు ప్రపంచ యవనిక మీద USSR పతన క్రమం, మరోవైపు దేశీయ రంగంలో బాబ్రీ మసీద్ పతనం క్రమం మధ్య అంతస్సంబంధం వుంది. ప్రపంచ పరిణామాలకూ, దేశీయ పరిణామాలకూ మధ్య పరస్పర బంధం ఉండడం గమనార్హం!
గత బ్రిటీష్ అనుకూల ఆర్.ఎస్.ఎస్. మతతత్వ విధానాన్ని జయించడం లౌకిక, ప్రజాతంత్ర, వామపక్ష, విప్లవ శక్తులకు పెద్ద కష్టమైనది కాదు. అది సాఫ్ట్ హిందూ వర్సెస్ హార్డ్ హిందూ కావడం వల్ల! అమెరికా అనుకూల ఆర్.ఎస్.ఎస్. విధానం ‘హిందూ వర్సెస్ ముస్లిం’ కావడం వల్ల జయించడం కష్టమైనది. ‘హార్డ్ హిందు’ ‘సాఫ్ట్ హిందూ’ ల మధ్య ఐక్యత సాధించకుండా ఈ కొత్త ఆర్.ఎస్.ఎస్. ప్రమాదకర విధానాన్ని త్రిప్పికొట్టడం సాధ్యం కాదు.
బాబ్రీ మసీద్ ఘటనతో వాజపేయి సారథ్యంలో ‘సాఫ్ట్ హిందుత్వ సర్కార్’ అధికారంలోకి వచ్చింది. గోద్రా ఘటన వల్ల మోడీ సారథ్యంలో ‘హార్డ్ హిందుత్వ’ సర్కార్ అధికారం పొందింది. ఈ రెండింటి వెనక అమెరికా హస్తం వుంది. అంతకంటే మించి వ్యూహం వుంది.
పుల్వమా, ఫహల్గామ్ “ఉగ్రవాద” ఘటనలు కేవలం నిన్న, మొన్నటివే! అంతకుముందే దేశంలో జరిగిన అనేక “ఉగ్రవాద” ఘటనల వెలుగులో వాటిని చూడాలి. వీటిని “విడిఘటనలు” (ISOLATED INCIDENTS) గా పరిశీలన చేస్తే వాస్తవాలు ఎన్నటికీ వెలుగులోకి రావు. తాజా “ఉగ్రవాద” మారణ హోమాలకు గల మూలకారణాలను భిన్న దృక్కోణంలో పరిశీలన చేస్తే తప్ప వాస్తవాల్ని గ్రహించలేము. దేశీయ రంగానికి పరిమితమై విశ్లేషణ చేస్తే ఎప్పుటికీ వాటి మూల కారణాల్ని కనుగొనలేము.
‘ఏకధ్రువ ప్రపంచ క్రమం’ ఏర్పడ్డ తర్వాత భారత్ లో అమెరికా వ్యూహం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లింది. భారత్ లో మరో ‘చీకటి భారత్” ని, రాజ్యంలో మరో చీకటి రాజ్యాన్ని సృష్టించడానికి దారి చూపించింది. ఆ చీకటి రాజ్యంలో భాగంగా పలు కుట్రలు జరిగాయి. (ఇవి ‘ఒక దళారీ పశ్చాత్తాపం’ పుస్తకం చదివిన వారికి తేలిగ్గా అర్ధమౌతుంది.) వాటి నేపధ్యాన్ని అర్ధం చేసుకోకుండా పుల్వమా నుండి ఫహల్గం “ఉగ్రవాద ఘటనల” వెనక గల మూల కారణాల్ని కూడా అర్ధం చేసుకోలేము.
ఇంతకూ ఏకధ్రువ ప్రపంచ వ్యవస్థ ఏర్పడ్డ తర్వాత మన దేశంలోనే మరో చీకటి దేశం ఏర్పడ్డ ఆ పరిణామం ఏమిటో తరువాయి భాగంలో క్లుప్తంగా అవలోకిద్దాం.
(ఇంకా వుంది)
– ఇఫ్టూ ప్రసాద్ (పిపి)