Operation Sindoor | 22-4-2025 తేదీన పహల్గామ్ పర్యాటకుల పై అనూహ్య స్థాయిలో “ఉగ్రవాద” అమానుష దాడి జరిగింది. ఫలితంగా పాకిస్తాన్, భారతదేశం మధ్య ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అది 19 రోజులు కొనసాగింది. అది ఒక దశలో యుద్ధ వాతావరణంగా కూడా మారింది. ఆ పరిస్థితి 7-5-2025 తేదీన క్రాస్ బోర్డర్ దాడుల వరకూ వెళ్ళింది. 10-5-2025 న ట్రంప్ మధ్యవర్తిత్వంలో భారత పాకిస్తాన్ మధ్య ఆకస్మికంగా కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
22-4-2025 ఘటనతో ప్రజల ఆగ్రహవేశాలతో మన దేశ పరిస్థితి అగ్నిగుండంగా మారింది.
7-5-2025 తేదీన మన దేశ ప్రజలు శాంతించారు.
10-5-2025 న ప్రజల ఆగ్రహం అసహజంగా చల్లార్చబడింది.
22-4-2025 తేదీ పరిణామం భారతదేశ ప్రజల్ని సాపేక్షికంగా ఏకం చేసింది.
10-5-2025 తేదీ పరిణామం దేశ ప్రజల్ని రాజకీయ విభజనకు గురి చేసింది.
ఒకే ఒక్కమాటలో చెప్పాలంటే, మొదటి పరిణామం దాదాపు దేశ ప్రజల్ని ఒకటి చేసింది. రెండవ పరిణామం దేశ ప్రజల్ని నిలువునా చీల్చింది.
అది భ్రమనా భావననా అనే అంశంలోకి మనం వెళ్లకపోతే 22-4-2025 నుండి 19 రోజుల పాటు దేశ ప్రజల దృష్టిలో మోదీ సర్కార్ సర్వ స్వతంత్ర పరిపాలనా వ్యవస్థగా ఆదరణ పొందింది.
10-5-2025 తేదీ నుండి ట్రంప్ చేతుల్లో మన దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టిన సర్కార్ గా విమర్శలకు గురౌతోంది.
ఏప్రిల్ 22 నుండి మే 10 వరకూ19 రోజులలో ఏం జరిగింది?
మే 10 తర్వాత గత ఐదారు రోజులలో ఏం జరిగింది?
ఈ ఐదారు రోజుల్లో భారత్, పాకిస్తాన్ దేశాలలో ఎవరి చర్చ వాళ్లదే. అది సహజమే. ఒక దేశప్రజల దృష్టిలో దేశభక్తి మరో దేశ ప్రజల దృష్టిలో దేశద్రోహం అవుతుంది. కొద్దిసేపు వాటిని పక్కకు పెడదాం.
ఈ రెండు దేశాల ప్రజల్లో చర్చకు పూర్తి విరుద్దంగా అంతర్జాతీయ స్థాయిలో మరో అనూహ్య చర్చ తెరపైకి వచ్చింది. అసలు ఇది ఇండో-పాక్ యుద్ధం కాదనీ, ఇది ఇండో-చైనా యుద్ధమని ఒక చర్చ జరుగుతుంటే, చైనా ఫ్రాంకో యుద్ధమనే మరో చర్చ జరుగుతుంది. అవి కూడా నిజం కాదనీ, ఇది వెస్టర్న్, ఈస్ట్రన్ రాజ్యాల మధ్య వాస్తవ యుద్ధమనే వాదన కూడా వుంది. ఇది అమెరికా చైనా మధ్య ప్రచ్చన్న యుద్ధమనే మరో వాదన కూడా లేకపోలేదు.
ఇది కొత్త ఆయుధాల ప్రయోగశాలాగా నేడు ప్రాచుర్యం పొందుతోంది. ఈ క్రాస్ బోర్డర్ దాడుల్లో ఎఫ్-16, రాఫెల్, మిగ్-21, సుఖోయ్, చివరికి ఎస్-400 వంటి వాటికి కూడా కాలదోషం పట్టి, కొత్తగా ఇప్పుడు చైనా ఆధునిక జె-10సి, పిఎల్-15 వంటి నూతన ఆయుధాలు బహుళ చర్చనీయంశాలుగా మారాయి. అవి యుద్ధ గమనాన్ని ప్రభావితం చేసినట్లు సంచలన చర్చ సాగుతోంది.
మన దేశప్రజల ఇష్టాలు, అయిష్టాలతో నిమిత్తం లేకుండా ఇండో పాక్ వివాదం అంతర్జాతీయ సమస్యగా మారింది. భారత దేశ సార్వభౌమత్వాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎదుట నరేంద్ర మోడీ సర్కార్ తాకట్టు పెట్టడంతో కూడా అంతర్జాతీయ సమస్యగా మారింది. ఫహలగామ్ మారణహోమాన్ని విడి దుర్గటనగా చూడాలా? లేదంటే అంతర్జాతీయ దృష్టితో అంతస్సంబంధ ఘటనగా చూడాలా?
ట్రంప్ సర్కార్ కి ఏప్రిల్ 22 వ తేదీ వరకు ఏమీ తెలియకుండా జరిగి, 7-5-2025 క్రాస్ బోర్డర్ దాడి తర్వాతే కళ్లు తెరిచి పిలవని పేరంటంగా పెద్ద మనిషిగా రంగంలోకి దిగి 10-5-2025న కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేయించిందా? లేదా ముందే వ్యూహాత్మక దారిలో జరిగిందా?
పహల్గం దుర్ఘటన యాద్రుచ్చికంగా జరిగితే, ట్రంప్ ఆయాచితంగా జోక్యం చేసుకున్నాడా?
ఏప్రిల్ 22 దుర్గటన, మే 10 కాల్పుల విరమణ ఒప్పందం మధ్య ఏమైనా అంతస్సంబంధం ఉందా?
పై రెండు సంఘటనలు కాకతాళీయంగా జరిగిన వేర్వేరు పరిణామాలా? లేదంటే అంతర్భాగమైన ఘటనలా? ఇందులో ఏది సత్యం? ఏది అసత్యం?
నేటి అంతర్జాతీయ నిర్ధిష్ట పరిస్థితి పట్ల అవగాహన వుంటే అంతస్సంబంధం గూర్చి స్పష్టంగా విశ్లేషణ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకొక ప్రయత్నం చేద్దాం.
– ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
(ఈ విశ్లేషణల వ్యాస పరంపర కొనసాగుతుంది)
ఇవి కూడా చదవండి..
Srisailam Dam | డేంజర్‌లో శ్రీశైలం డ్యామ్?
Telangana Politics | కాడి ఎత్తేసిన తెలంగాణ మంత్రులు? వ్యతిరేకతను రేవంత్‌పై నెట్టేసే యోచన!
Revanth Reddy Govt | పథకాల అమలులో జాప్యమే కాంగ్రెస్ సర్కార్‌కు డేంజర్ బెల్?