- ప్రజలకు నేరుగా లబ్ధి కలిగే సంక్షేమ పథకాలు
- వాటి అమల్లో ప్రభుత్వం నుంచి తీవ్ర జాప్యం
- ఆనాడు వైఎస్.. కేసీఆర్.. నేడు రేవంత్‌రెడ్డి
- పథకాల అమలుపై పోల్చుకుంటున్న ప్రజలు
- సంక్షేమ పథకాలపై వైఎస్, కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ
- రేవంత్ సర్కార్‌లో ఆ శ్రద్ధ కొరవడిందన్న చర్చ
- ప్రజల్లో విశ్వాసం క్రమంగా సడలుతున్నదా?
- గ్రామాల్లో నలుగురు కూడిన చోట ఇవే కబుర్లు
Revanth Reddy Govt | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచిపోయింది. కానీ.. ఇచ్చిన హామీల అమలు మాత్రం అలానే పడి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వానికి వెంటనే ఖర్చులేని ఆరోగ్య శ్రీ పెంపు లేదా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వంటివాటికంటే.. నగదు రూపంలో లభించాల్సిన సహాయాల కోసం రాష్ట్రంలోని పేదలు ప్రజలు ఎదురు చూస్తున్నారు. సహజంగానే ఇదే అంశం ఏ నలుగురు రచ్చబండ మీదకు చేరినా చర్చనీయాంశం అయిపోతున్నది. ఈ చర్చల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపిస్తున్నదనే అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా మూడున్నరేళ్లు అధికారంలో ఉండనున్నది. అయినా.. అప్పుడే వ్యతిరేక సంకేతాలు ఎందుకు వస్తున్నాయన్న విషయంలో రాజకీయ పరిశీలకులు తలో విధంగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా వివిధ రంగాలకు చెందిన వారంతా ఊపిరి పీల్చుకున్నారు. తమకు స్వేచ్ఛ వచ్చిందని చెప్పుకొన్నారు. స్వేచ్ఛ వచ్చింది.. ఏదైనా అడిగే శక్తిని రేవంత్ సర్కారు ఇచ్చింది కానీ.. ఇచ్చిన వాగ్దానాలను సకాలంలో ఎందుకు అమలు చేయడం లేదన్న చర్చ బలంగా వినిపిస్తున్నది.
పథకాలే డేంజర్ బెల్స్
బీఆరెస్ 2023 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడానికి ధరణి ఏ విధంగా కారణం అయిందో.. ఇప్పుడు రేవంత్‌కు అదే ప్రమాదం పథకాల అమలులో జాప్యంతో ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలు ఇంకా అమల్లోకి రాలేదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కరెంటు, ఆసరా పెన్షన్లు, తాగునీరు, సాగునీరు, రైతుబంధు, రైతు బీమా, అన్నింటికి మించి ధాన్యం కొనుగోళ్లలో ప్రజలు నూటికి నూరు మార్కులు ఇచ్చారు. ఇవన్నీ సకాలంలో సక్రమంగా సాగిపోయేవని గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ ఎక్కడి నుంచి వాటికి డబ్బు తెచ్చారనేది తమకు అనవసరమని, కానీ వాటిని మాత్రం ఠంచన్‌గా అమలు చేసేవాడన్న చర్చల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నది. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. మాట ఇస్తే మడమ తిప్పలేదన్న అభిప్రాయం సర్వత్రా ఉండేది. ఉచిత కరెంటు, ఆరోగ్య శ్రీ .. ఈ రెండు పథకాల అమలు వైఎస్‌కు అపారమైన పేరు తెచ్చిపెట్టాయి. కానీ.. పథకాల అమల్లో రేవంత్ సర్కార్ మాత్రం విఫలమైనట్టే కనిపిస్తున్నదని ప్రజలు పోల్చుకుంటున్నారు. ప్రజలకు నేరుగా కనెక్ట్ అయిన వాగ్దానాలను అమలు చేయడంలో రేవంత్ సర్కారు ఫెయిల్ అయిందన్న విమర్శలు గ్రామ స్థాయిలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇది అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పెరుగుతున్న వ్యతిరేకతగా పరిశీలకులు భావిస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల ముందు రైతు బంధు కింద జమచేసేందుకు సుమారు ఏడువేల కోట్ల రూపాయలను నాటి బీఆరెస్ ప్రభుత్వం సిద్ధం చేసిన నిధులు.. కోడ్ కారణంగా చెల్లింపుల దాకా వెళ్లలేదు. ఫలితాలు వచ్చిన వెంటనే ఆ డబ్బు జమ చేస్తానని రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ తొలిరోజుల్లోనే తేలిపోయింది. ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆ సొమ్మును కాంట్రాక్టర్లు తమ ఖాతాల్లోకి వేయించుకున్నారన్న చర్చల అప్పట్లో నడిచింది. ఆ తర్వాత కూడా రైతు భరోసా పేరిట నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయక పోవడంతో ఆనాడే రైతాంగం నుంచి కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత వచ్చింది. రైతు బీమా కూడా అమలవట్లేదన్న ఆరోపణలు ఉన్నాయి. రైతు రుణమాఫీ చేసి కూడా రేవంత్ సర్కారు విమర్శల పాలైంది. అధికారుల రాంగ్ గైడెన్స్ ఉందా? లేక బ్యాంకర్లు తప్పు దారి పట్టించారా? అనేది పక్కన బెడితే రెండు లక్షల రుణమాఫీ కుటుంబంలో ఒక్కరికి అనేదే రాంగ్ అన్న చర్చ రాష్ట్ర రైతాంగంలో జరుగుతోంది. వివిధ టెక్నికల్ కారణాలు చూపి ఈ పథకాన్ని సరిగ్గా అమలు చేయలేదన్న విమర్శలూ ఉన్నాయి. గ్రామాలలో ఒక పథకంలో ఒకరికి లబ్ది జరిగితే లబ్ది జరిగిన వాడు బయటకు చెప్పడు కానీ.. వివిధ కారణాల చేత లబ్ది పొందని వ్యక్తి దానిని మొత్తం గ్రామ సమస్యగా మార్చుతాడు. సరిగ్గా రేవంత్ సర్కార్ విషయంలోనూ ఇదే జరిగిందని అంటున్నారు.
నాడు నీళ్లొచ్చాయి.. మరి నేడు?
తాగునీరు. సాగు నీరుకు సంబంధించిన చర్చ కూడా జోరుగానే సాగుతున్నది. కేసీఆర్ ఏం చేసిండో తెలియదు కానీ కాలువ చివరి తూము వరకు నీళ్లు ఇచ్చాడని పలువురు రైతులు చెబుతున్నారు. ఇదంతా కాళేశ్వరం ఘనతగా కేసీఆర్, నాటి మంత్రులు ప్రచారం చేశారు. కేసీఆర్ ఫామ్ హౌజ్‌లోనే ఉన్నా.. మంత్రులు, ఎమ్మెల్యేలను చెరువు గట్ల వెంట తిప్పేవారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాళేశ్వరం లేకున్నా నీళ్లు ఇచ్చారు కానీ సరిగ్గా మానిటరింగ్ చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగానే.. పంట చేతికి వచ్చే సమయానికి నీళ్లు సరిగ్గా అందక అనేక చోట్ల పంటలు ఎండి పోయాయని అంటున్నారు. ఇది కూడా రైతుల్లో ఆగ్రహం రాజేస్తున్నది.
చెప్పినంత పెంచక..
ఆసరా పెన్షన్లు కూడా ఇచ్చిన హామీ ప్రకారం పెంచలేదన్న చర్చ సర్వత్రా జరుగుతున్నది. సకాలంలో పెన్షన్లు అందక పోవడం ఒక ఎత్తు అయితే.. చెప్పిన మాట ప్రకారం పెంచకపోవంతో కూడా ఈ వర్గాలలో రేవంత్ సర్కారుపై వ్యతిరేకత ప్రబలేందుకు ఒక కారణంగా కనిపిస్తున్నదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
చేసినవి చెప్పుకోలే..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ధరణి స్థానంలో భూ భారతిని తీసుకువచ్చింది. కానీ అమలు మాత్రం నత్తను తలపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అలాగే భారత దేశానికి దిక్చూచిగా మారిన కులగణను రేవంత్ సర్కారు దిగ్విజయంగా చేపట్టి అమలు చేసింది. దీనిని చూసే దేశవ్యాప్త కుల గణనకు ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ నాయకులు చెప్పుకొంటున్నారు. ఇలా దేశానికి ఆదర్శమైన సంస్కరణలు తీసుకొచ్చిన రేవంత్ సర్కార్.. ప్రజలకు నేరుగా కనెక్ట్ అయిన పథకాల అమల్లో మాత్రం తీవ్ర జాప్యం చేస్తుండటం ప్రధాన మైనస్‌గా మారుతున్నదనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇప్పటికైనా రేవంత్ సర్కారు ప్రజలకు నేరుగా కనెక్ట్ అయిన పథకాల అమలుపై కేంద్రీకరించాలని, దీంతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజల వద్దకు వెళ్లేలా చేయాలని రాజకీయ పరిశీలకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులు అంటున్నారు.