Srisailam Dam | రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన శ్రీశైలం డ్యాం భద్రతపై ఎన్డీఎస్ఏ తీవ్ర అసంతృప్తి ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవలే డ్యాం ఎగువ, దిగువ ప్రాంతాల్ని పరిశీలించిన ఎన్డీఎస్ఏ శ్రీశైలం డ్యాం భద్రతపై కీలక వ్యాఖ్యలు చేసింది. శ్రీశైలం డ్యామ్ ప్లంజ్ పూల్ కాంక్రీట్ స్టీల్ సిలిండర్ డ్రమ్స్ దెబ్బతిన్నాయని..అత్యవసరంగా శ్రీశైలం డ్యామ్ ప్లంజ్ పూల్ కాంక్రీట్ స్టీల్ మరమ్మతులు చేపట్టాలని ఏపీ ప్రభుత్వానికి అనిల్ జైన్ లేఖ రాశారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు శ్రీశైలం డ్యాంను పట్టించుకోలేదని..గతంలో నిపుణుల నివేదికను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడింది. ఎన్డీఎస్ఏ వెల్లడించిన అంశాలతో శ్రీశైలం డ్యాం భద్రతపై తెలుగు రాష్ట్రాల ప్రజలలో ఆందోళన వ్యక్తమవుతుంది. 2009లో కృష్ణా నదికి వచ్చిన భారీ వరదలతో భారీ గొయ్యి(ప్లంజ్ పూల్) ఏర్పడగా.. ఏటా వచ్చే వరదలతో ఇది మరింత పెద్దదవుతోంది. బ్యారేజీ దిగువన 143 అడుగుల లోతు, 400మీటర్ల వెడల్పుతో గొయ్యి ఏర్పడింది. మరోసారి భారీ వరదలు వస్తే ఏమిటన్న భయం అధికారుల్లో సైతం వినిపిస్తుంది. శ్రీశైలం జలాశయం తెలంగాణ, ఏపీలకు జీవనాడి. వర్షాకాలంలో నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు, వేసవిలో నీళ్లు అడుగంటిన సమయంలో దాదాపు 130 టీఎంసీలు నిల్వ ఉంటాయి. విద్యుత్ సరఫరాలో ఈ ప్రాజెక్టు రెండు రాష్ట్రాలకూ కీలకమైనది. దీనిపై ఏపీ వైపు 770 మెగావాట్లు, తెలంగాణ వైపు 900 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. శ్రీశైలం డ్యాం భద్రత ప్రశ్నార్ధకమైతే డ్యాం..జల విద్యుత్ కేంద్రాలు..దిగువన నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలపై కూడా ఆ ఎఫెక్టు ఉండనుంది.
దిగువన ప్రాజెక్టులకు కూడా ముప్పే!
కృష్ణా నదికి భారీ వరద.. అంటే 14 లక్షల క్యూసెక్కుల స్థాయిలో వచ్చినా దిగువకు నీటిని వదిలేలా శ్రీశైలం డ్యాంను డిజైన్ చేసి నిర్మించారు. 2009లో 25 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. అప్పుడు డ్యాం గేట్ల దిగువన స్పిల్‌వే సమీపంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఈ గొయ్యిపై బాతిమెట్రిక్ సర్వే చేపట్టింది. 143 అడుగుల లోతు, 400 మీటర్ల వెడల్పుతో గొయ్యి పరిధి ఉన్నట్లు నివేదించింది. ఆనకట్ట పునాది కన్నా లోతులో ఈ గొయ్యి ఉన్నట్లు గుర్తించారు. శ్రీశైలం ఆనకట్ట దిగువన ఏర్పడిన ప్లంజ్‌పూల్ ముప్పును రాష్ట్ర డ్యాం సేఫ్టీ కమిటీ అంచనా వేసి ఎన్డీఎస్‌ఏకు నివేదించింది. ఆనకట్టకు ప్రమాదం ఏర్పడితే డ్యాం నుంచి 25లక్షలు క్యూసెక్కుల భారీ ప్రవాహం డ్యాం నుంచి ఒకేసారి దిగువకు విడుదలవుతుంది. దిగువన ఉన్న నాగార్జునసాగర్..పులిచింతల, ప్రకాశం బ్యారేజీల మనుగడ కూడా తీవ్ర ప్రమాదంలో పడుతుంది.
మరమ్మతులు అత్యవసరం
మూడు సంవత్సరాల క్రితం కృష్ణా బోర్డు ఏర్పాటు చేసిన రిజర్వాయర్ల నిర్వహణ కమిటీ (ఆర్‌ఎంసీ) శ్రీశైలం డ్యామ్‌కు మరమ్మతుల అవసరాన్ని, నిధుల కేటాయింపుపై నివేదిక ఇచ్చింది. ఎన్డీఎస్‌ఏ కూడా పలు సిఫార్సులు చేసింది. తాత్కాలిక మరమ్మతులకు టెట్రాపాడ్స్‌ను (ముంబయి సముద్రతీరం కోతకు గురికాకుండా ఏర్పాటు చేసే నిర్మాణాలు) వినియోగించాలని తెలంగాణ డ్యాం సేఫ్టీ కమిటీ సూచించింది. మరోవైపు ఏపీ జలవనరులశాఖ పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్‌కు అధ్యయన బాధ్యతలు అప్పగించింది. ఇటీవల తెలంగాణ డ్యాం సేఫ్టీ కమిటీ చైర్మన్, నీటిపారుదలశాఖ ఈఎన్సీ అనిల్‌కుమార్ సైతం ఎన్డీఎస్‌ఏ, కృష్ణా బోర్డుల దృష్టికి ప్లంజ్ పూల్ సమస్యను వివరించారు. శ్రీశైలం డ్యాం దిగువన భారీ గొయ్యి ఉండటం క్షేమకరం కాదని..ఎన్డీఎస్‌ఏ సిఫార్సులను అమలు చేయాలని కోరారు. తాత్కాలికంగా టెట్రాపాడ్స్‌తో గొయ్యి పూడ్చవచ్చని… డ్యాం నిర్వహణ ఏపీ పరిధిలో ఉన్న నేపథ్యంలో వీలైనంత త్వరగా స్పందించాలి అని తెలంగాణ ఈఎన్సీ, జి.అనిల్‌కుమార్ కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Saraswati River Pushkaram: తెలంగాణలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభం
Lion Skydiving | అన్‌బిలివబుల్ స్టంట్.. సింహంతో స్కైడైవింగ్.. వీడియో
Kanche Gachibowli lands: పర్యావరణం పునరుద్ధరించకపోతే జైలుకు వెళ్లాల్సిందే : సుప్రీంకోర్టు