Lokesh | నమో అంటే నాయుడు.. మోదీ : మంత్రి లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పెట్టుబడుల కోసం ఆకర్షణీయ గమ్య స్థానంగా మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. పరిశ్రమలు ఏపీని ఎంచుకోవడానికి మూడు కీలక కారణాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు.

న్యూ ఢిల్లీ :

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పెట్టుబడుల కోసం ఆకర్షణీయ గమ్య స్థానంగా మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. పరిశ్రమలు ఏపీని ఎంచుకోవడానికి మూడు కీలక కారణాలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచి పాలన, వేగవంతమైన సదుపాయాల కల్పన, పెట్టుబడిదారులకు సానుకూల వాతావరణం ఇవే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలను ఆకర్షిస్తున్నాయని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్య ఉన్న మంచి అనుబంధం కూడా పెట్టుబడుల పెరుగుదలకు తోడ్పడుతోందని తెలిపారు. ‘నమో’ అంటే ‘నాయుడు – మోదీ’ మధ్య అనుంబంధం అని చెప్పొచ్చని వ్యాఖ్యానించారు.

ఇప్పటికే టీసీఎస్‌, కాగ్నిజెంట్‌ వంటి ప్రముఖ ఐటీ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ముందుకు వచ్చాయని, రాబోయే నెలల్లో మరిన్ని కంపెనీలు వస్తాయని మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో సీఐఐ (Confederation of Indian Industry) ఆధ్వర్యంలో భారీ పారిశ్రామిక సదస్సు జరగనుందని పేర్కొన్నారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావొచ్చని అంచనా వేశారు. దాదాపు 120 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు రానున్నాయనే అంచనాలు ఉన్నాయన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన సీఐఐకి మంత్రి లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు.