Saraswati River Pushkaram: తెలంగాణలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా దక్షిణ ప్రయాగ కాళేశ్వరం త్రివేణి సంగమంలో అంతర్వాహిణి సరస్వతి నది పుష్కరాలను స్వామి మాధవానంద సరస్వతి స్వామి ప్రారంభించారు. పుష్కర స్నానం ఆచరించిన మంత్రి శ్రీధర్‌బాబు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. నేటి నుంచి ఈ నెల 26 వరకు సరస్వతి నది పుష్కరాలు కొనసాగనున్నాయి. పుష్కర స్నానాలకు వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ తొలిసారి సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. రోజుకు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.
పుష్కరాల సందర్భంగా ప్రతిరోజూ సరస్వతి ఘాట్‌లో సాయంత్రం 6.45 నుంచి 7.35 గంటల వరకు సరస్వతి నవరత్న మాల హారతి నిర్వహిస్తారు. కళా, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి. భక్తుల బస కోసం తాత్కాలికంగా టెంట్ సిటీని నిర్మించారు. రుసుము చెల్లించి వాటిని పొందవచ్చు. పుష్కరాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.35 కోట్లు కేటాయించింది. తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య నిర్వహణ, ఘాట్ల నిర్మాణం, రహదారి మరమ్మతులు, పార్కింగ్ తదితర ఏర్పాట్లన్నీ పూర్తిచేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసింది.
గురువారం సాయంత్రం 4.30 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు కాళేశ్వరం చేరుకోనున్నారు. పుష్కర సాన్నం ఆచరించి, శ్రీకాళేశ్వర, ముక్తీశ్వర స్వామి వార్లను దర్శించుకుంటారు. కాళేశ్వర క్షేత్రంలో నిర్వహిస్తున్న పుష్కరాల్లో పాల్గొంటున్న తొలి సీఎం రేవంత్‌రెడ్డే కావడం విశేషం. రేవంత్ రెడ్డి సరస్వతి నదికి ఇచ్చే ప్రత్యేక హారతిలో పాల్గొంటారు. అక్కడే ఏర్పాటు చేసిన 10 అడుగుల సరస్వతిదేవి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. భక్తుల వసతి కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని ప్రారంభిస్తారు.