Site icon vidhaatha

STOLEN Movie | మాబ్ లించింగ్ మీద వెన్నులో వణుకు పుట్టించే సినిమా.. ఓటీటీలో రెడీ!

మిత్రులారా, మీరు ఎప్పుడైనా మాబ్ లించింగ్ కళ్ళతో చూశారా? ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. అలా చూడడం కూడా జరగదు నాకు తెలుసు. కనీసం టీవీల్లోనూ ఆ దృశ్యాలు చూడలేము, చూపకూడదు. పత్రికల్లో ఆ దృశ్యాలు వేయకూడదు. కేవలం వార్తలు చదవడమే. కానీ మాబ్ లించింగ్ ఎలా ఉంటుందో మనకు కళ్ళకు కట్టినట్టు చూపించి వెన్నులో వణుకు పుట్టించాడు కరణ్ తేజ్ పాల్ అనే డైరెక్టర్. సినిమా పేరు STOLEN. 2018 లో అస్సాంలో జరిగిన ఒక బాలిక అపహరణ కేసు, తదనంతరం జరిగిన మూక దాడి ఘటన ఆధారంగా ఈ సినిమా తీశాడు. సినిమా చూస్తున్నంత సేపూ లోపల అంతా భయంకరమైన వణుకు పుట్టింది. కారణం కేవలం సినిమాలోని దృశ్యాలు, కథా మాత్రమే కాదు. ఈ దేశంలో ఏవేవో వదంతులు, కల్పిత వార్తలు, కుట్ర పూరిత అపోహలు ఆధారంగా ఎప్పుడెప్పుడు ఏయే ఘటనలు జరిగాయో, ఆ ఘటనల్లో ఎంతమంది అమాయకులు అత్యంత దారుణంగా బలైపోయారో, వాళ్లను బలి తీసుకున్న వాళ్లు కూడా తాము మానవ మాత్రులమే అన్న విషయాన్ని మరిచిపోవడానికి ఆ వదంతులు ఎలా కారణం అయ్యాయో.. అవన్నీ ఒక్కటొక్కటిగా గుర్తుకు వచ్చి, శరీరమూ మనసూ భయంతో కంపించిపోయాయి.

ఒక ఐదు నెలల పాప అపహరణకు గురైంది. ఇద్దరు అమాయకులైన అన్నదమ్ములు ఆ పాపను కాపాడాలని అమాయకంగా ప్రయత్నించి అన్యాయంగా ఇరుక్కుపోయారు. వారే పసిపాపల దొంగలని పనికిరాని వైరల్ వీడియోలు నమ్మి మనుషులు గుంపులు గుంపులుగా వారిని పట్టి దారుణంగా హింసించారు. మాబ్ లించింగ్ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టించాడు డైరెక్టర్. విశేషం ఏంటంటే, డైరెక్టర్ కరణ్ తేజ్పాల్ ఎక్కడా దేశంలో జరిగిన మూక దాడి ఘటనల గురించి ప్రస్తావించడం కానీ, ఈ సినిమా ఒక మాబ్ లించింగ్ సినిమా అని గాని చెప్పకుండా తెలివిగా తీశాడు. 99% మూక దాడులు వెనక ఉన్న వార్తలన్నీ పుకార్లేనని, వాటిని నమ్మి మామూలు మనుషులు కూడా కిరాతకులుగా ఎలా మారిపోతారో, మానవత్వాన్ని మరిచి ఎలా మరో మనిషిని చంపేస్తారో అదంతా చెప్పకనే ఈ సినిమాలో చెప్పాడు.

వెంటాడి తరిమి తరిమి దారుణంగా క్రూరంగా కొందరిని చంపడానికి ప్రయత్నించే మనుషులు, అలాగే వారి వేటకు గురయ్యే అమాయకులు- వీరి మధ్య ఎలాంటి సంబంధమూ ఉండదు. ఇరుపక్షాలూ అపరిచితులే. కానీ ఒకరు తమకు తెలియకుండానే హంతకులుగా మారిపోతారు. మరొకరు తమకు తెలియకుండానే హతులుగా బలైపోతారు. చేతబడులు చేస్తున్నారని, గోమాంసం అమ్ముతున్నారని, పిల్లల్ని ఎత్తుకుపోతున్నారని.. ఇలా ఏవేవో వదంతులు సృష్టించి సాధారణ జనాలను కూడా యమకింకరులుగా మార్చేసి అమాయకులను పొట్టను పెట్టుకునె దుర్మార్గ వైరల్ సంస్కృతికి అందరూ దూరంగా ఉండాలని, చేతిలో ఫోన్ ఉందని అందులో ఏదో ఒక వైరల్ న్యూస్ వచ్చిందని వెంటనే మనల్ని మనం మనుషులుగా మర్చిపోయి కిరాతకులుగా మారిపోయి అమాయకుల ప్రాణాలు బలి తీసుకోవడం ఎంత అమానుషమో గుర్తించండి అని డైరెక్టర్ మనకు అద్భుతమైన సందేశాన్ని ఈ సినిమా ద్వారా అందించాడు. ఈ సినిమాలో ఇతర విశేషాలు చెప్పడానికి ఉన్నా, నేను కేవలం మాబ్ లించింగ్ విషయానికే పరిమితమై ఈ రెండు మాటలూ రాశాను. మీరు కూడా అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా ఉంది సినిమా పేరు స్టోలెన్. తప్పక చూడండి.

..ప్రసాదమూర్తి

Exit mobile version