విద్యుత్తు రంగం.. ప్రై‘వేటు’ దిశగా!

విద్యుత్తు రంగంలోకి ప్రైవేట్ సంస్థలను తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నదా? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. విద్యుత్తు సంస్కరణల సవరణ చట్టం-2022 పార్లమెంటు సమీక్ష వెళ్లినప్పటికీ కేంద్రం ప్రైవేటీకరణను వేగంవంతం చేస్తున్నదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి

  • Publish Date - June 30, 2024 / 12:59 AM IST

పాతబస్తీలో బిల్లుల వసూలు అదానీ కంపెనీకి
పూర్తిస్థాయి ప్రైవేటీకరణ దిశగా తొలి అడుగా?
లాభాల్లో ఉన్న సర్కిళ్లను కాదని నష్టాల్లోని సర్కిళ్లను అదానీ కంపెనీకి కట్టబెట్టడం వెనుక?
పార్లమెంటు సమీక్షకు విద్యుత్తు సంస్కరణల చట్టం 2022
అయినా అమలు చేస్తున్న కేంద్రపాలిత ప్రాంతాలు
తొమ్మిది రాష్ట్రాలలో అమలు చేస్తున్న ప్రభుత్వాలు
ప్రైవేటీకరణ కోసం నష్టాల బూచి చూపే పాలకులు
పెట్రో, గ్యాస్‌ ధరల మాదిరిగా ఎప్పటికప్పుడు ధరల సవరణకు అవకాశం

(విధాత ప్రత్యేకం):విద్యుత్తు రంగంలోకి ప్రైవేట్ సంస్థలను తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నదా? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. విద్యుత్తు సంస్కరణల సవరణ చట్టం-2022 పార్లమెంటు సమీక్ష వెళ్లినప్పటికీ కేంద్రం ప్రైవేటీకరణను వేగంవంతం చేస్తున్నదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సవరణ చట్టం సమీక్షలో ఉన్నప్పటికీ.. కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలవుతున్నది. అలాగే ఢిల్లీతోపాటు పలు రాష్ట్రాలలో కూడా పంపిణీ వ్యవస్థ ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లింది. తాజాగా రాష్ట్రంలో కూడా విద్యుత్తు పంపిణీ ప్రైవేటీకరణ జరుగనున్నదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ హైదరాబాద్ పాతబస్తీకి చెందిన దక్షిణ విద్యుత్తు సర్కిల్‌ను అదానీ సంస్థకు అప్పగించబోతున్నట్లు చెప్పారు. పాతబస్తీలో ప్రజలు విద్యుత్తు బిల్లులు చెల్లించకపోవడంతో నష్టాలు వస్తున్నాయని, అందుకే అదానీకి అప్పగిస్తామని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ ప్రకటనకు ముందే ఈ మేరకు ఉన్నతస్థాయి సమావేశాలు జరిగినట్లు, అదానీ సంస్థ డిస్కం నుంచి సమాచారం సేకరించినట్టు చెబుతున్నారు. వాస్తవంగా పంపిణీ, బిల్లుల వసూళ్ల బాద్యతను ప్రైవేటుకు అప్పగించాలంటే ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పాతబస్తీ ప్రాంతం వచ్చే సర్కిల్‌ను అదానీ సంస్థకు అప్పగిస్తామన్న ప్రకటనను ప్రైవేటీకరణకు వెళ్లే ప్రక్రియలో భాగంగానే చూడాలని విద్యుత్తు రంగ నిపుణులు చెపుతున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి చేసిన ఒక్క ప్రకటనపైనే ఆ నిర్ణయానికి రాలేమని కొంతమంది అంటున్నారు.

2002లోనే ప్రైవేటీకరణ దిశగా అడుగులు

విద్యుత్తు ప్రైవేటీకరణ దిశగా 2002లోనే అడుగులు పడ్డాయి. ఆనాడు విద్యుత్తు బోర్డును విడదీసి ఉత్పత్తి, సరఫరా, పంపిణీ సంస్థలుగా నాటి ప్రభుత్వం విడగొట్టింది. ఆనాడు విద్యుత్తు సంస్కరణలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాలు చేసినా పాలకులు పట్టించుకోలేదు. పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడానికే విద్యుత్తు బోర్డును విడదీసి సంస్థలుగా విభజించామని చెప్పారు. తాజాగా విద్యుత్తు పంపిణీ నష్టాలను అధిగమించడానికే పంపిణీ, బిల్లు వసూళ్లను ప్రైవేటీకరిస్తామని చెబుతున్నారు. విద్యుత్తు పంపిణీ, బిల్లుల వ్యవస్థ ప్రభుత్వం చేతిలో ఉంటే బిల్లులు చెల్లించడం లేదని, సబ్సీడీలు, రాజకీయ పార్టీల నిర్ణయాలతో నష్టాలు వస్తున్నాయన్న వాదనలు తీసుకొస్తున్నారు. వాస్తవంగా హైదరాబాద్ పాతబస్తీ లాంటి ప్రాంతాల్లో 40 శాతానికిపైగా బిల్లులు వసూలుకావడం లేదంటున్నా.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకంలోకే ఈ ప్రాంత ప్రజలు వచ్చే అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

ఒడిశాలో విఫలం

విద్యుత్తు పంపిణీని ఒడిశాలో ప్రైవేటీకరించినా.. అక్కడ విఫలమైంది. ప్రైవేటు సంస్థలు అక్కడి నుంచి తప్పుకున్నాయి కూడా. ఒక రాష్ట్రంలో విఫలమైన ప్రయోగం హైదరాబాద్ పాతబస్తీలో సక్సెస్ అవుతుందా? అన్న చర్చ జరుగుతోంది. పైగా పంపిణీ, బిల్లుల వసూళ్ల ప్రైవేటీకరణ పాతబస్తీతో మొదలై రాష్ట్రమంతా అమలవుతుందా? ఇక్కడితోనే ఆగుతుందా? అదానీ సంస్థ నష్టాలు వచ్చే సర్కిల్‌ను తీసుకొని లాభాలు వచ్చే సర్కిళ్లను వదిలేస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పంపిణీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్న సంఘాలు

విద్యుత్తు పంపిణీ వ్యవస్థ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మంగళూరులో రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అలాగే విద్యుత్తు పంపిణీ ప్రైవేటీకరణను ఆలిండియా పవర్ ఇంజనీర్స్‌ ఫెడరేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది. పంపిణీ వ్యవస్థలో ప్రైవేటీకరణ కోసం తీసుకు వచ్చిన 2022 విద్యుత్తు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఫెడరేషన్ ప్రతినిధి వీకే గుప్తా పార్లమెంటు స్టాండింగ్ కమిటీకి మెమోరాండం సమర్పించారు. ఈ బిల్లు రాష్ట్ర డిస్కంల ఆర్థిక వ్యవస్థను బలహీన పరుస్తుందని, ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన చెబుతున్నారు. అలాగే సబ్సిడీ వినియోగదారులపై అధిక వ్యయభారాన్ని మోపుతుందన్నారు. ఉదాహరణకు.. రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్తు పథకం అమలవుతున్నది. అలాగే పేదల ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అమలు చేస్తున్నారు. ఇలా సబ్సిడీ పథకాలకు విద్యుత్తు సరఫరా చేయడానికి ప్రైవేట్‌ పంపిణీ వ్యవస్థలకు ఇష్టం ఉండదు. ఇలాంటివన్నింటినీ ప్రభుత్వ వ్యవస్థలే భరించాలి. విద్యుత్తు బిల్లులు చెల్లించే పారిశ్రామిక, వ్యాపార, ఇతర అధిక ఆదాయ వర్గాల ప్రాంతాల పంపిణీ, వసూళ్లకే ప్రైవేట్ సంస్థలు ముందుకు వస్తాయి. అలాంటప్పుడు ప్రభుత్వ వ్యవస్థల మనుగడ ఎలా ఉంటుందన్న సంశయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్నది. ఇది కేవలం ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీలో తప్ప ప్రైవేట్ బస్సులలో అమలు చేయరు కదా? అని అంటున్నారు. విద్యుత్తు పంపిణీ కూడా అంతేనని చెపుతున్నారు. మరోవైపు డిజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను ఏరోజుకారోజు అంతర్జాతీయ మార్కెట్ ధరలను అనుసరించి పెంచుతున్నారో… అదే తీరుగా విద్యుత్తు టారిఫ్ కూడా రోజువారీగా పెంచే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

రాయితీలు, క్రాస్‌ సబ్సిడీలకు మంగళం!

విద్యుత్తు పంపిణీ ప్రైవేటీకరణ చేయడం అంటే రైతులు, ఇరత పేద వర్గాలకు ఇస్తున్న రాయితీలు, క్రాస్ సబ్సిడీలకు మంగళం పాడినట్లేనని పలువురు విద్యుత్తు రంగ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు సంస్కరణల పేరుతో విఫలమైన మోడల్‌ను భారత్‌లో ప్రవేశపెడుతున్నారని వీకే గుప్తా ఆరోపించారు. భారతదేశంలో 80 శాతం మంది పేద ప్రజలకు అందించే రాయితీలపై ప్రైవేటీకరణ ప్రభావం తీవ్రంగా ఉంటుందని గుప్తా ఆందోళన వ్యక్తం చేశారు. సీనియర్ జర్నలిస్ట్, విద్యుత్తు రంగ నిపుణులు వేణుగోపాల్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక్క స్టేట్‌మెంట్‌పై ఆధారపడి నిర్ణయానికి రాలేమన్నారు. పాతబస్తీలో 40 శాతానికి పైగా బిల్లులు వసూలుకావడం లేదన్న మాట వాస్తవమేనని చెప్పారు. అలాగే పంపిణీ ప్రైవేటీకరణ ఒడిశాలో విఫలమైందని తెలిపారు.

Latest News