(విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి)
Gadwal MLA Bandla Krishna Mohan Reddy | బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి… ప్రస్తుతం ఈ పేరు గద్వాల జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. బీఆరెస్ నుంచి గెలిచి, ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్న బండ్ల.. ప్రస్తుతం మాట మార్చి బీఆర్ఎస్‌లోనే ఉన్నానని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన మా పార్టీ ఎమ్మెల్యే కానే కాదంటూ గులాబీ నేతలు చెబుతుంటే.. అటు కాంగ్రెస్ నేతలు కూడా తమ పార్టీతో ఆయనకు ఏమీ సంబంధం లేదని చెబుతుండటం ఆసక్తికరంగా మారింది. రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పరిస్థితి ఎందుకు ఇలా తయారైందనే చర్చలు సాగుతున్నాయి.
బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఓ సామాన్య వ్యక్తి. మాజీ ఎమ్మెల్యే డీకే భరతసింహారెడ్డికి మేనల్లుడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ.. రాజకీయాల్లోకి వచ్చారు. భరతసింహా రెడ్డి వెంట ఉంటూనే ఆయనకు రాజకీయ ప్రత్యర్థిగా మారారు. గద్వాలలో తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి భరతసింహారెడ్డికి ప్రత్యర్థిగా మారారు. ‘ఇక చూసుకుందాం రా..’ అనే స్థాయిలో గద్వాల నియోజకవర్గంలో ఎదిగారు. గద్వాల ప్రాంతంలో భరతసింహా రెడ్డికి ఎదురు వెళ్లాలన్నా భయపడే రోజుల్లోనే ఆయనతోనే రాజకీయ వైరం పెట్టుకున్నారు. కేసీఆర్ అండతో గద్వాల నియోజకవర్గంలో పాగా వేయాలని అనుకున్న బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి 2014లో బీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచారు. ఎప్పటి నుంచో రాజకీయంగా ఎదిగిన డీకే కుటుంబం నుంచి భరతసింహా రెడ్డి భార్య డీకే అరుణ కాంగ్రెస్ నుంచి బండ్లకు పోటీగా దిగారు. రాజకీయ ఉద్ధండులతో తట్టుకోలేక ఆ ఎన్నికల్లో కృష్ణ మోహన్ రెడ్డి.. డీకే అరుణ చేతిలో ఓడిపోయారు. మళ్ళీ 2018లో బీఆర్ఎస్ నుంచి పోటీచేసిన కృష్ణ మోహన్ రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి అరుణను ఓడించి గద్వాల నియోజకవర్గంలో ఎదురు లేని డీకే కుటుంబానికి షాక్ ఇచ్చారు. ఈ ఎన్నికల ఓటమి తట్టుకోలేని డీకే అరుణ బీజేపీలో చేరారు. అనంతరం బీఆర్ఎస్‌కు చెందిన జడ్పీ చైర్ పర్సన్ సరిత ఆ పార్టీ ఎమ్మెల్యేతో విబేధించి బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గద్వాలలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఆమె మారారు. ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డికి పోటీగా బలమైన నాయకురాలిగా సరిత ఎదిగారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కృష్ణ మోహన్ రెడ్డి బరిలో ఉండగా కాంగ్రెస్ నుంచి సరిత నిలిచారు. ఇద్దరి మధ్య హోరాహోరీ పోరులో 7,036 ఓట్ల మెజార్టీతో కృష్ణమోహన్‌రెడ్డి గెలిచారు. కానీ రాష్ట్రంలో అధికారం మాత్రం కాంగ్రెస్‌కు దక్కింది. కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి సీఎం కావడంతో బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరు కాంగ్రెస్ జెండా నీడకు వెళ్లారు. అందులో గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. తొలుత బండ్ల రాకను గద్వాల నేతలు ఒప్పుకోలేదు. రేవంత్ రెడ్డి అందరికీ నచ్చజెప్పి కృష్ణ మోహన్ రెడ్డికీ కాంగ్రెస్ కండువా వేశారు.
ఇంత వరకు బాగానే ఉన్నా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టు ఝలక్ ఇచ్చింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు ఆదేశాలు జారిచేసింది. ప్రస్తుతం స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంజయిషీ నోటీసులు జారీ చేశారు. వాటికి సమాధానంగా పార్టీ మారలేదని, బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నాని కృష్ణ మోహన్ రెడ్డి బదులిచ్చారు. కానీ.. కృష్ణమోహన్‌రెడ్డి తమపార్టీలో లేరని బీఆరెస్ ప్రకటించింది. ఇటీవల గద్వాలలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు హాజరైన సభకు కృష్ణమోహన్‌రెడ్డి రాలేదు. ఆ సభలో కేటీఆర్ మాట్లాడుతూ కృష్ణ మోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా వేసుకుని పార్టీ ఫిరాయించారని, సుప్రీం కోర్టు తీర్పుతో ఉప ఎన్నికలు వస్తే గద్వాలలో ఓటమి తప్పదని భయపడి బీఆర్ఎస్‌లో ఉన్నానని ప్రకటిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి నేతను గద్వాల ప్రజలు చిత్తు గా ఓడించాలని పిలుపునిచ్చారు. మొత్తంగా కృష్ణమోహన్‌రెడ్డి అటు కాంగ్రెస్‌లో, ఇటు బీఆరెస్‌లో లేరన్న విషయం తేలిపోతున్నది. గద్వాలలో ఆయనకు రెండు పార్టీల నుంచి వ్యతిరేకత రావడంతో రెంటికి చెడ్డ రేవడిలా ఆయన రాజకీయ భవిష్యత్తు మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.