క్యాన్సర్ అనగానే చాలా మంది భయపడిపోతుంటారు. ఏటా కోటి మందికి పైగా ప్రజలు ఈ మహమ్మారితో చనిపోతున్నారు. అత్యధిక మరణాలకు కారణమవుతున్న రెండో అతిపెద్ద వ్యాధి ఇదే. క్యాన్సర్‌లో చాలా టైప్స్ ఉన్నాయి.

వాటిలో బ్లడ్ క్యాన్సర్ ఒకటని, లక్షణాలు ముందుగానే గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చని ఆంకాలజిస్ట్ డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు. ఈయన ప్రస్తుతం మెడికవర్ హాస్పిటల్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ అంశాన్ని సంబంధించి డాక్టర్, న్యూస్18 తెలుగుతో చెప్పిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

బ్లడ్ క్యాన్సర్ అనేది మన శరీరంలో రక్త కణాలు నియంత్రితంగా తయారవుతాయి. కానీ బ్లడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు అసాధారణ రక్త కణాలు అధికంగా పెరిగి, ఆరోగ్యకరమైన కణాల పనితీరును దెబ్బతీస్తాయి. దీని వల్ల శరీర రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, అలసట, ఇన్‌ఫెక్షన్లు వంటి సమస్యలు ఎదురవుతాయి.

బ్లడ్ క్యాన్సర్‌లో ఎక్కువగా కనిపించే లక్షణాల్లో నిరంతర అలసట ఒకటి. రెస్ట్ తీసుకున్నా శరీరం బలహీనంగా అనిపించడం, డైలీ పనులు చేయడంలో ఇబ్బంది కలగడం జరుగుతుంది.

అలాగే తరచూ జ్వరం రావడం, కారణం లేకుండా బరువు తగ్గిపోవడం, రాత్రి సమయంలో ఎక్కువగా చెమటలు పట్టడం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. చిన్న దెబ్బకే గాయాలు ఏర్పడటం, చర్మంపై బ్లూ మచ్చలు కనిపించడం, ముక్కు లేదా చిగుళ్ల నుంచి రక్తస్రావం జరగడం వంటి సమస్యలు ఉంటాయి.

ఇంకా తరచూ ఇన్‌ఫెక్షన్లు రావడం కూడా బ్లడ్ క్యాన్సర్‌కు ఒక ముఖ్యమైన సంకేతం. ఎందుకంటే ఈ వ్యాధి వల్ల శరీరంలోని తెల్ల రక్త కణాల పనితీరు దెబ్బతింటుంది.

ఫలితంగా శరీరం వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని కోల్పోతుంది. మెడ, చంకలు లేదా తొడ భాగాల్లో లింఫ్ గ్రంథులు వాపు రావడం కూడా కొందరిలో కనిపించవచ్చు. బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టేజ్, వయసు, రోగి ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.

ప్రస్తుతం వైద్య రంగంలో అనేక ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కీమోథెరపీ ద్వారా క్యాన్సర్ కణాలను నాశనం చేస్తారు. టార్గెటెడ్ థెరపీ ద్వారా క్యాన్సర్ కణాలపై మాత్రమే ప్రత్యేకంగా ప్రభావం చూపే మందులను ఉపయోగిస్తారు.

ఇమ్యూనోథెరపీ ద్వారా శరీర రోగనిరోధక శక్తిని పెంచి క్యాన్సర్‌తో పోరాడేలా చేస్తారు. కొన్నిసార్లు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ కూడా అవసరం కావచ్చు.

బ్లడ్ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఎంతకాలం జీవించగలరు?" అనే ప్రశ్న అడుగుతుంటారు. దీనికి సమాధానం లేదు. క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌కు శరీరం స్పందించే విధానం, వారి ఏజ్, ఆరోగ్య పరిస్థితి వంటి అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న ఆధునిక చికిత్సల వల్ల చాలా మంది పేషంట్లు బాగానే లైఫ్‌ లీడ్ చేస్తున్నారు.

ఆహారం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు, పాలు, గుడ్లు, పప్పులు, తాజా పండ్లు, ఆకుకూరలు తీసుకోవాలి. తగినంత నీరు తాగాలి. బయట ఆహారం, పరిశుభ్రత లేని పదార్థాలు, ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశమున్న ఆహారాలను వీలైనంత వరకు తగ్గించడం మంచిది.