దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ అయింది. భారత్ గ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ (eKYC) పూర్తి చేయాలని ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు సూచిస్తున్నాయి. నిర్ణీత గడువు అయిన 2026 జూన్ 30లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయని వినియోగదారులకు గ్యాస్ సబ్సిడీ నిలిపివేస్తారు.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ సబ్సిడీ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు చర్యలు వేగవంతం చేసింది. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా నిజమైన లబ్ధిదారులకే సబ్సిడీ అందేలా చూడాలని భావిస్తోంది.
గతంలో నకిలీ కనెక్షన్లు, డూప్లికేట్ వినియోగదారుల కారణంగా ప్రభుత్వానికి భారీ నష్టం జరిగినట్లు గుర్తించిన అధికారులు, ఇప్పుడు డిజిటల్ వెరిఫికేషన్ ప్రక్రియను కఠినతరం చేస్తున్నారు.
ఎల్పీజీ సబ్సిడీ ప్రస్తుతం కోట్లాది కుటుంబాలకు కీలక ఆర్థిక ఉపశమనంగా ఉంది. ముఖ్యంగా మధ్యతరగతి, పేద కుటుంబాలు సబ్సిడీపై ఆధారపడుతున్నాయి.
సైబర్ మోసాల ప్రమాదం కూడా పెరుగుతున్న నేపథ్యంలో అధికారిక యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారానే ఈ-కేవైసీ పూర్తి చేయాలని కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. తెలియని లింకులు, థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దని సూచిస్తున్నాయి. ఒకసారి ఈ-కేవైసీ పూర్తి అయితే సబ్సిడీ పొందడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు .
ఎల్పీజీ పంపిణీ వ్యవస్థను పూర్తిగా డిజిటల్ ఆధారితంగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాబోయే రోజుల్లో ఇతర సంక్షేమ పథకాల మాదిరిగానే గ్యాస్ సబ్సిడీ కూడా పూర్తిగా ఆధార్ ధృవీకరణ ఆధారంగానే కొనసాగనున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.