తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనతో, ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటీమణుల్లో నివేదా పేతురాజ్ ఒకరు. 'మెంటల్ మదిలో' చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ తమిళ బ్యూటీ, ఆ తర్వాత 'బ్రోచేవారెవరురా' వంటి విలక్షణమైన విజయవంతమైన చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.

గత కొంతకాలంగా వ్యక్తిగత కారణాల వల్ల దాదాపు మూడేళ్లుగా ఆమె సినిమాలకు, వెండితెరకు దూరంగా ఉంటున్నారు. నివేదా స్క్రీన్ పై కనిపించకపోవడంతో ఆమె అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కానీ, ఇప్పుడు తను  అభిమానులను మళ్లీ అలరించేందుకు ఈ టాలెంటెడ్ హీరోయిన్ సరికొత్త ఉత్సాహంతో సిద్ధమవుతోంది.

నివేదా పేతురాజ్ రీ-ఎంట్రీ కేవలం ఒక సాధారణ సినిమాతో కాకుండా, టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల క్రేజీ ప్రాజెక్టులతో జరుగుతుండటం విశేషం. అందులో మొదటిది విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం. వెంకటేష్ కథానాయకుడిగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' అనే చిత్రంలో నివేదా ఒక కీలకమైన, ప్రాధాన్యమున్న పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వెంకటేష్ సరసన, ఈ వైవిధ్యమైన పాత్రలో నివేదా నటించడం ఆమె సెకండ్ ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌లో ఆమె పాల్గొంటున్నట్లు సమాచారం.

నివేదా పేతురాజ్ ఖాతాలో మరో భారీ క్రేజీ ప్రాజెక్ట్ వచ్చి చేరినట్లు సరికొత్త టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఒక భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ  చిత్రాన్ని నిర్మాణ సంస్థ కేపీఎన్ ప్రొడక్షన్స్ భారీగా నిర్మిస్తోంది.

ఈ సినిమాలో మలయాళీ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ ఒక ముఖ్య పాత్రను పోషిస్తోంది. కాగా, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ ఒక అత్యంత కీలకమైన, కథను మలుపు తిప్పే పాత్రలో నటిస్తోందని వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా ప్రారంభం కాగా, నివేదా  రీసెంట్‌గానే ఈ చిత్ర యూనిట్‌తో చేరి, సెట్స్‌లోకి అడుగుపెట్టినట్లు సినీ వర్గాల్లో గట్టి ప్రచారం జరుగుతోంది.

ఇలా ఒకేసారి అటు విక్టరీ వెంకటేష్, ఇటు మెగాస్టార్ చిరంజీవి వంటి టాలీవుడ్ అగ్ర హీరోల చిత్రాలతో నివేదా పేతురాజ్ తిరిగి టాలీవుడ్‌లోకి అడుగుపెడుతుండటంతో ఆమె కెరీర్ మళ్లీ ఊపందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

మూడేళ్ల విరామం తర్వాత వస్తున్నప్పటికీ, ఇలాంటి భారీ వైవిధ్యమైన ప్రాజెక్టులను ఎంచుకోవడం ద్వారా నివేదా తన సెకండ్ ఛాన్స్‌ను చాలా ప్లాన్డ్‌గా డిజైన్ చేసుకున్నట్లు అర్థమవుతోంది. మరి ఈ సినిమాలతో నివేదా పేతురాజ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాలను అందుకుంటుందో, ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి!