బయట నుంచి చూసేవాళ్లకు ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచంలా కనిపిస్తుంది. వాళ్లకేంట్రా కోట్లల్లో రెమ్యూనరేషన్‌లు, లగ్జరీ లైఫ్ అని అనుకుంటుంటాం. కానీ వాళ్లు ఎన్ని కష్టాలు పడ్డారో వాళ్లకే తెలుసు. ఇండస్ట్రీలో అందరి జీవితాలు పూలపాన్పులు కావు. కొందరు ముళ్ల కిరీటాలు కూడా. అలా ముళ్ల కిరీటంను వజ్రాల కిరీటంలా మార్చుకున్న నటుడు గురించి తెలుసుకుందాం.

ఆయన మరెవరో కాదు నవాజుద్దీన్ సిద్దిఖీ. వెంకీమామ హీరోగా సైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన సైంధవ్ సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు నవాజుద్దీన్ సిద్దిఖీ. నిజానికి హిందీ సినిమాలు చూసేవాళ్లకు ఈయన గరించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.

 బాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ వర్సటైల్ యాక్టర్‌లలో నవాజుద్దీన్ సిద్దిఖీ ఒకరు.  ఉత్తరప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామంలో జన్మించిన నవాజుద్దీన్ సిద్దీకి.. నటుడు అవుదామని కేవలం రూ.2500 జేబులో పెట్టుకుని ముంబై వచ్చేశాడు. ఇక్కడ అవకాశాలు వెతుక్కునే క్రమంలో బ్రతకడానికి సెక్యూరిటీ గార్డుగా కూడా పనిచేశాడు.

అమీర్ ఖాన్ హీరోగా నటించిన సర్ఫరోష్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నవాజుద్దీన్ సిద్దిఖీ. ఈ సినిమాలో టెర్రరిస్ట్‌గా చిన్న రోల్ ప్లే చేశాడు. ఆ తర్వాత జంగల్, మున్నాభాయ్ MBBS, ఫ్యామిలీ ఇలా వరుసగా సినిమాలు చేశాడు కానీ.. ఏది కూడా నవాజుద్దీన్ కెరీర్‌కు ప్లస్ కాలేకపోయింది.

 కట్ చేస్తే, 2012లో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన 'గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్' సినిమా నవాజుద్దీన్ కెరీర్‌నే మార్చేసింది. ఈ సినిమాలో ఫైజల్ ఖాన్‌గా టెర్రిఫిక్ రోల్ ప్లే చేశాడు. అంతేకాదు ఈ సినిమాలో ఆయన నటనకు నేషనల్ అవార్డు సైతం వరించింది.

ఆ తర్వాత మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో చూస్తుండగానే బాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయాడు. ఇక ఈ నటుడు ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో యాక్టింగ్ నేర్చుకొని ముంబైకి వచ్చాడు.

ఆ టైమ్‌లో తనలో ఆత్మవిశ్వాసం బలంగా ఉండేదని.. తనకు వెంటనే సినిమా ఛాన్స్‌లు వస్తాయని అనుకున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే చాలా మంది తనను రిజెక్ట్ చేయడంతో మానసికంగా కుంగిపోయాడట.

అంతేకాదు నవాజ్‌కు సినిమాలో అవకాశం వచ్చినప్పుడల్లా అందరికీ ఆ విషయాన్ని ఎంతో సంతోషంగా చెప్పేవాడట. కానీ సినిమా షూటింగ్ మొదలయ్యాక మేకర్స్ తనను రిజెక్ట్ చేేసేవాళ్లట. ఈ పరిస్థితి వల్ల నవాజ్ ఎంతగానో కుంగిపోయి, అతని మానసిక స్థితి క్షీణించిందట.  

ఒకానొక సమయంలో తన దగ్గర కనీసం తినడానికి కూడా డబ్బులు లేవని నవాజ్ చెప్పాడు. నాకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అంతా పార్లేజీ బిస్కెట్లే అని పేర్కొన్నాడు.

ఇక టైమ్స్ నౌ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం నవాజుద్దీన్ సిద్దిఖీ మొత్తం ఆస్తులు అక్షరాల రూ. 124 కోట్లు అని తెలిపింది. అంతేకాదు   ఆయన ప్రస్తుతం ఒక్కో సినిమాకు సుమారు రూ. 10 కోట్ల పారితోషికం తీసుకుంటాడట.