Integrated Crop System | రాష్ట్రంలోని రైతులకు మేలు చేసే విధంగా వ్యవసాయ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంభశివరావు రాష్ట్ర ప్రభుత్వాన్నికోరారు. మేరకు మంగళవారం సచివాలయంలో నీలం రాజశేఖర్ రెడ్డి పరిశోధన కేంద్రం డైరెక్టర్ డాక్టర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన “భారతదేశంలో సమకాలీన వ్యవసాయం, వ్యవసాయ-ఆర్థిక శాస్త్ర సవాళ్లు, దృక్పథాలు” అనే సెమినార్‌లో ప్రొఫెసర్ డి. నర్సింహారెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, కామ్రేడ్ ఎస్. మల్లారెడ్డి, వైస్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా కిసాన్ సభ, డాక్టర్ బి. శరత్ బాబు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, డాక్టర్ కె. పూర్ణ చంద్రరావు, పూర్వ శాస్త్రవేత్త , ఇక్రిసాట్, ప్రొఫెసర్ మార్ల సోమ సుందర్, పూర్వ శాస్త్రవేత్త, ఐసిఎఆర్ తదితరులు చేసిన సిఫారసులను మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత వాతవరణ పరిస్థితులు, రైతుల కోసం ఏమి చేయాలన్న అంశాలపై చర్చించారు. సమగ్ర పంటల సాగు విధానం అమలులోకి తేవాలని మంత్రిని కోరారు. మంత్రి మాట్లాడుతూ పరిశోధనా కేంద్రం చేసిన ప్రయత్నాన్ని సమర్థిస్తూ తప్పనిసరిగా వ్యవసాయ రంగంలో ఉన్న రైతులందరికీ న్యాయం చేయడం, వారి ప్రయోజనాలను పరిరక్షించడానికి అందరూ చేసే ప్రయత్నాలను తమ ప్రభుత్వం స్వాగతిస్తుందన్నారు. తప్పనిసరిగా నీలం రాజశేఖర్ రెడ్డి పరిశోధన కేంద్రం సమర్పించిన నివేదికను, సూచనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
నివేదికలోని అంశాలు ఇవే..
- వివిధ నేలల భూసారం, ప్రాంతాల వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం సమగ్రమైన పంటల సాగు విధానాన్ని ప్రతిబింబించే వ్యవసాయ ప్రణాళికను రూపొందించాలి.
- దేశంలో సుసంపన్నంగా ఉన్న వృక్ష, పంటల మూల వంగడాలు (జేర్మోప్లాజమ్)ను వినియోగించి, హాని కలిగించని నూతన బయోటెక్నాలజీ నుంచి నూతన పంట వంగడాలను మరింత వేగంగా రూపొందించటానికి నిధుల నిచ్చి ప్రభుత్వ రంగం వ్యవసాయ పరోశోధనలు జరపాలి.
- విత్తన రంగంలో స్వయం సమృద్ధిని సాదించేటందుకు వెంటనే విత్తన చట్టాన్ని తీసుకురావాలి. అన్ని పంటల విత్తన ఉత్పత్తిని విరివిగా ప్రభుత్వ వ్యవసాయ క్షేత్రాల్లో చేపట్టి చిన్న రైతులకు తక్కువ ధరలను అందుబాటులోకి తేవాలి, బీటీ హైబ్రీడు విత్తనాలను విక్రయిస్తున్న విదేశీ విత్తన కంపెనీలను నిషేధించటం లేదా నియంత్రించటం చేయాలి.
- రిజర్వు బ్యాంకు సూచించిన విధంగా ప్రభుత్వ బ్యాంకుల నిధుల్లో తప్పనిసరిగా 40 శాతం వ్యవసాయ ఋణాలకు కేటాయించాలి. కేటాయించిన ఋణాల్లో విధిగా 70 శాతం చిన్న, కౌలు రైతులకు వితరణ చేసేలా ప్రభుత్వ బ్యాంకులకు కఠినమైన ఆదేశాలు ఇవ్వాలి.
- ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు బీమా మొత్తం నష్టం వాటిల్లిన మూడు వారాల్లోగా చెల్లించాలి. బీమా సౌకర్యాన్ని ప్రైవేటు కంపెనీల ద్వారా కాకుండా ప్రభుత్వ బీమా కంపెనీల ద్వారా చిన్న, కౌలు రైతులకు ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లించే ఏర్పాట్లు చెయ్యాలి. బీమా సౌకర్యాన్ని వాణిజ్య, ఉద్యానవన పంటలకు విస్తరించాలి.
- స్వదేశీ ఉత్పత్తులకు (ఉల్లి, రబ్బరు,వగైరా) మార్కెట్ ధర పొందడానికి విదేశాలనుండి దిగుమతులను నిషేదించాలి. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) తో చర్చించి ఈ అంశాన్ని పరిష్కరించాలి.
- పోషకాహార భద్రతను కల్పించే ఉద్యానవన, కాయగూరల పంటలకు కూడా గ్యారంటి మద్దతు ధరలు కల్పించి, వీటి సాగు విస్తీర్ణాన్ని 6.3 కోట్ల హెక్టార్ల నుండి 12 కోట్ల హెక్టార్లకు పెంచాలి.
- నూనె గింజలు, పప్పుదినిసుల వ్యవసాయ పరిశోధనలు వేగవంతం చేసి అధిక దిగుబడి విత్తన సరఫరా, గ్యారంటి మద్దతు ధరలు కల్పించాలి. దిగుమతులను తగ్గించి విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడానికి ఇది సహాయ పడుతుంది.
- గ్రామాల్లో వివిధ సహకార, కుటీర పరిశ్రమలను, ఆహార శుద్ధి, పుట్టగొడుగులు,కోళ్ళ పెంపకాన్ని విధిగా ప్రోత్సహించి నిధులను కేటాయించి సహకార వ్యవసాయ రంగాన్ని పటిష్టం చెయ్యాలి. గ్రామీణ యువతను, మహిళలను, ప్రోత్సహించేందుకు వారికి అతి తక్కువ వడ్డీపై ప్రభుత్వ బ్యాంకుల నుండి ఋణాలు కల్పించాలి. ఎరువులు, పురుగుల మందుల విక్రయాలను వ్యాపారుల ద్వారా కాక సహకార సంఘాలకు కేటాయించాలి. సహకార సంఘాల ఉత్పత్తులను ప్రభుత్వ చౌక డిపోల ద్వారా విక్రయించే ఏర్పాటు చేయ్యాలి.
- ఆర్ధిక సంక్షోభానికి గురై రైతుల ఆత్మ హత్యలను తగ్గించటానికి సత్వర చర్యలు చేపట్టాలి. మహిళా రైతులకు భూ యాజమాన్య హక్కులు కల్పించాలి.
- పంటల సాగులో నూతన సాంకేతికతను ప్రవేశ పెట్టడానికి గ్రామాలలో విరివిగా శిక్షణ కేంద్రాలను ఏర్పరచాలి. చిన్న రైతుల కోసం అభ్యుదయ వ్యవసాయ పద్దతులను పరిచయం చేసే దేశి, విదేశీ పర్యటనలను చేపట్టాలి.
- చిన్న కమతాలకు అనువైన వ్యవసాయ సాంకేతిక యంత్ర వ్యవస్థను ప్రోత్సహించి గ్రామాల్లో “అద్దెకు వినియోగం’’ పద్దతిలో గ్రామ పంచాయితీల ద్వారా చిన్న, కౌలు రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి.