- కేంద్రం ఇచ్చే బియ్యంతో సిఎం సొంత ప్రచారంపై భాజపా ఆగ్రహం
- ప్రజలకు వాస్తవాన్ని వివరించేందుకు ఇంటింటికి ప్రచారం
- రేషన్ దుకాణాల్లో మోదీ ఫొటో ఉండాల్సిందే మీడియా సమావేశంలో రావెల వెల్లడి
విధాత:కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ బియ్యాన్ని తను ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు ప్రచారాన్ని ప్రజలకు వివరించేందుకు ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, పార్టీ రాష్ట్ర కోశాధికారి వామరాజు సత్యమూర్తితో కలసి రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కిషోర్ బాబు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చే సబ్సిడీ రేషన్ బియ్యాన్ని తను ఇస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అసత్యప్రచారం చేసుకుంటుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ రేషన్ పంపిణీ వాహనాలపై భారీ సైజులో తన ఫొటోలు ముద్రించి ప్రచారాన్ని మరింత తీవ్రం చేశారన్నారు. దీనిని రాజకీయకుట్రగా అభివర్ణించారు. రాష్ట్రంలో 1.48 లక్షల తెల్లరేషన్ కార్డులున్నాయని వాటిలో 89 లక్షల కార్డులకు మనిషికి 5 కిలోల చొప్పున కేంద్రం 95 శాతం సబ్సిడీ ద్వారా బియ్యాన్ని పంపిణీ చేస్తోందన్నారు. 9.8 లక్షల అంత్యోదయ అన్న యోజన కార్డులకు పూర్తి సబ్సిడీతో 35 కిలోల బియ్యం ఒక రూపాయికి, కిలో పంచదార రూ. 13.50 చొప్పున పంపిణీ చేస్తోందన్నారు. కేవలం 59 లక్షల కార్డులకే రాష్ట్ర ప్రభుత్వం బియ్యం పంపిణి చేస్తోందని, ఆ బియ్యాన్ని కూడా కిలో రూ.33 లకు కేంద్రం, రాష్ట్రానికి సరఫరా చేస్తోందన్నారు. కరోనా సమయంలో ప్రజలకు ఆహారభద్రత కల్పించేందుకు ప్రధాని గరీబ్ అన్న యోజన పథకం ద్వారా మొదటి, రెండో వేవ్లలో 15 నెలల పాటు ఇప్పుడు ఇస్తున్న బియ్యానికి అదనంగా మరో రూ.5 కిలోల చొప్పున కేంద్రం బియ్యాన్ని పేదలకు సరఫరా చేసిందన్నారు. కాని రాష్ట్రం తన సొంత ప్రచారం మానుకోలేదన్నారు.
రేషన్ దుకాణాల్లో పథకం వివరాలు, ప్రధాని చిత్రం ఉండేలా పోస్టర్ అమర్చాలని కేంద్రప్రభుత్వం ఆదేశించిందన్నారు. కాని ఆ పోస్టర్లో ముఖ్యమంత్రి జగన్ పెద్ద ఫొటో పైన ఉంచి, దాని కింద ప్రధాని మోదీ చిన్న ఫొటో వేసి ప్రధాని పదవిని రాష్ట్ర ప్రభుత్వం కించపరిచిందన్నారు. ఇలాంటి నీతిమాలిన చర్యలను భాజపా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం నుంచి బియ్యం తీసుకుని మీరే ఇస్తున్నట్లు చేసే తప్పుడు ప్రచారాన్ని ప్రజలకు వివరించేందుకు భాజపా రాష్ట్ర శాఖ పూనుకుందన్నారు. ఇందులో భాగంగా భాజపా కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రధాని ఇచ్చే బియ్యంపై ప్రజలకు ప్రచారం చేస్తారని, ప్రతి రేషన్ దుకాణంలో పోస్టర్ను అమరుస్తారన్నారు. ప్రచార పోస్టర్ను వామరాజు సత్యమూర్తి, వుల్లూరి గంగాధర్, వెలగలేటి గంగాధర్ లతో కలసి ఆవిష్కరించారు.