Budget 2024 | ఆంధ్రప్రదేశ్‌కు బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఏపీ అభివృద్ధికి రూ.15వేలకోట్ల ప్రత్యేక సాయాన్ని ప్రకటించింది. ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా రాజధాని అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని పేర్కొంది. అవసరాన్ని బట్టి అమరావతికి మరిన్ని అదనపు నిధులు కేటాయిస్తామని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రైతులకు జీవనాడి పోలవరమని.. భారత ఆహారభద్రతకు పోలవరం ఎంతో కీలకమైందని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సాయం అందిస్తామని.. పోలవరానికి కావాల్సిన నిధుల కేటాయింపు ఇస్తామన్నారు.
హైదరాబాద్ – బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. విభజన చట్టం ప్రకారం పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక సహకారం, విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్‌లోని నోడ్‌లకు ప్రత్యేక సాయం ప్రకటించారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, నిధులు, రోడ్లు, హైవేల అభివృద్ధికి.. విశాఖ – చెన్నై కారిడార్లో కొప్పర్తికి, హైదరాబాద్ బెంగలూరు కారిడాల్‌లో ఓర్వకల్లుకు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇస్తామన్నారు. ఇక బిహార్‌కు బహుపాక్షిక అభివృద్ధి ఏజెన్సీల ద్వారా కేంద్రం ఆర్థిక సాయం అందిస్తుందన్నారు.
15000 కోట్లు కేటాయింపులు కావు.. ష్యూరిటీ.. కేంద్ర బడ్జెట్‌పై ప్రతిపక్ష వైసీపీ విమర్శ..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చింది గుండు సున్నాయేనని ప్రతిపక్ష వైసీపీ పేర్కొన్నది. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో తెలుగులో ఒక పోస్టును పెట్టింది. ‘ఏపీకి కేంద్రం ఇచ్చింది గుండు సున్న! కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి రూ.15,000 కోట్లు కేటాయించిందంటూ ఉదయం నుంచి ఊదరగొడుతున్న ఎల్లో మీడియా, టీడీపీ. కానీ.. వివిధ సంస్థల ద్వారా ఏపీ రూ.15,000 కోట్లు అప్పు తెచ్చుకోవడానికి కేవలం ష్యూరిటీ మాత్రమే ఇస్తానన్న కేంద్రం. అసలు విషయం అర్థమై తేలు కుట్టిన దొంగలా కిక్కురమనని టీడీపీ’ అని ఆ పోస్టులో పేర్కొన్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.15,000 కోట్లతో అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడంతోపాటు భవిష్యత్తులో అదనపు మొత్తాలను ఏర్పాటు చేసేందుకు వివిధ అభివృద్ధి సంస్థల ద్వారా కేంద్రం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.