విధాత : సంక్రాంతి పండుగ అంటేనే బోగీ మంటలు..ముంగిళ్లలో రంగవల్లులు..గొబ్బెమ్మలు..గాలిపటాల ఎగురవేత..కోడి పందాలు. ముఖ్యంగా ఏపీలో సంక్రాంతి సంబురంలో కోడి పందాల ఘట్టం చాల కీలకం. ఇందుకోసం ఏపీలోని ఉభయగోదావరి జిల్లాల పల్లెలు కోడిపందాల నిర్వహణకు బరులతో సిద్ధమవుతున్నాయి. కోడి పందాలతో వినోదం కంటే ఎక్కువగా భారీ ఎత్తున డబ్బు చేతులు మారడం కొనసాగుతుంది. రాజుల కాలంలో అయితే కోడి పందాలు రేపిన చిచ్చుతో రాజ్యాలే కూలిపోయిన రక్త చరిత్రను జనం ఇప్పటికి కథలుగా చెప్పుకుంటునే ఉంటుంటారు. శతాబ్దాల కిందటే జరిగిన పల్నాటి కోడి పందాలు జనం మదిలో చిరస్మరణీయంగా నిలిచిపోయాయి.
పల్నాటి రక్త చరిత్రకు మూలం కోడి పందాలు
కోడి పందాల కారణంగానే చారిత్రాత్మక పల్నాడు యుద్ధంలో నెత్తురుపారింది. చిత్రంగా పల్నాడు రాజుల కోడిపందాల పోరులో బలైంది మాత్రం తెలంగాణ కోడిపుంజు చిట్టిమల్లు కావడం ఈ చరిత్రలో ఓ ఆసక్తికర ఘట్టం. పల్నాడు ప్రాంతంలోని మాచర్ల ప్రాంతాన్ని మలిదేవరాజు పాలించేవారు. గురజాల ప్రాంతాన్ని నలగామరాజు ఏలేవారు. మలిదేవరాజు వద్ద బ్రహ్మనాయుడు, నలగామరాజు వద్ద నాగమ్మ మంత్రులుగా పని చేసేవారు. రాజ్యాల మధ్య ఆధిపత్య పోరు కుట్రలలో భాగంగా బ్రహ్మనాయుడు, నాగమ్మల రాజకీయ వ్యూహాల మధ్య జరిగిన కోడి పందాల పోరు పల్నాడు చరిత్రనే మలుపుతిప్పిన యుద్దానికి వేదికయ్యాయి. కోడిపందాలలో బ్రహ్మన్న ఓడిపోతే ఏలేశ్వరం (నేటి నాగార్జునసాగర్ ప్రాంతం) దాటి ఏడేండ్లు, నాగమ్మ ఓడితే చిట్యాల రేవు(నల్లగొండ కృష్ణా తీరం) గుండా మూడున్నరేండ్లు రాజ్యం వదిలి వెళ్లిపోవాలన్నది నాటి పందెం ఒప్పందం. అయితే నాయకురాలి నాగమ్మ కోడి పుంజు నల్లమల్లును ఓడించే పుంజు బ్రహ్మనాయుడి దగ్గర లేదు. పోరులో గెలిచేందుకు అవసరమైన శక్తివంతమైన చిట్టిమల్లు పేరుతో పిలిచే పుంజును నల్లగొండ కుందూరు చోడుల రాజధానిగా ఉన్న పానగల్లు పట్టణంలో ఉందని బ్రహ్మన సోదరుడు బాదన్న చెప్తాడు. చిట్టిమల్లును తీసుకురావాలని అనుచరుడు వీరపడాలును పంపిస్తాడు. బ్రహ్మన సైన్యం నాటి రేవు ప్రాంతమైన చిట్యాల (నల్లగొండ జిల్లా) దగ్గర కృష్ణానదిని దాటి, అడ్డుకున్న ఇక్కడి సైనికులను చంపి పానగల్లుకు చేరుకుని చిట్టిమల్లును తీసుకెళ్లినట్లుగా ‘పల్నాటి వీరచరిత్ర’లో రాశారు. క్రీ.శ 11-12 శతాబ్దాల్లో కాకతీయుల సామంతులు కుందూరు చోడుల రాజధానిగా పానగల్ పట్టణం విలసిల్లింది. ఇక్కడ చారిత్రాక పచ్చల, ఛాయ సోమేశ్వరాలయాలు, ఉదయ సముద్రం చెరువు ఆనాటి కుందూరు పాలనా వైభవాన్ని ఇప్పటికి కళ్లముందుంచుతాయి.
నాగమ్మ తంత్రంతో నేలకొరిగిన చిట్టి మల్లు
పల్నాటి కోడి పందాల పోరులో బ్రహ్మనాయుడి తరుపుని బరిలోకి దిగిన చిట్టిమల్లు మొదటి పందెంలో నాగమ్మ పందెం కోడి నల్లమల్లును మట్టికరిపిస్తుంది. రెండో పందెంలో నాగమ్మకే చెందిన రెండో పందెం కోడి ‘సివంగి డేగ’ చేతిలో చిట్టిమల్లు చనిపోతుంది. గురజాల, మాచర్ల మధ్య ఉన్న గోలివాగు ప్రాంతంలో కోడేరుగుట్టల వద్ద ఈ కోడిపందాల పోరు జరిగినట్టుగా చారిత్రక రచనల కథనం. నాగమ్మ రెండో పందెంలో కోడి పుంజును మార్చగా, బ్రహ్మన మాత్రం రెండో పందెంలోనూ చిట్టిమల్లునే బరిలోకి దించడంతో తొలిపోరులో అలిసిన చిట్టిమల్లు రెండో పోరులో ఓడిపోయిందంటారు. అయితే జానపద కథలో మాత్రం నాగమ్మ తన కోడి పుంజు కాళ్లకు కత్తులు కట్టిందని అందుకే చిట్టిమల్లు ఓటమిపాలై చనిపోయిందన్న ప్రచారం వినిపిస్తుంటుంది. నాగమ్మ కపటంతో పందెంలో తన కోడి కాళ్లకు కత్తులు కట్టి పందెంలో గెలిచిందని తెలుసుకున్న మాచర్ల రాజులు ఆగ్రహంతో రగిలిపోవడం..రెండు రాజ్యాల మధ్య చెలరేగిన విబేధాలు అంతిమంగా పల్నాటి యుద్దానికి దారితీశాయి.
బొబ్బిలి యుద్ధానికి కూడా బొబ్బిలి, విజయనగర రాజుల కోడి పందాల రచ్చనే ఆజ్యం పోసిందని చారిత్రాక కథనాలు వినిపిస్తుంటాయి. కోడి పందాల బరిలో తొలుత బొబ్బిలి పుంజులు గెలవడంతో విజయనగరరాజులు అవమానకరంగా భావించారు. ఆఖరి బరిలోనూ బొబ్బిలి రాజుల పుంజే గెలవడంతో ఆగ్రహించిన విజయనగర రాజులు బొబ్బిలి రాజులతో వైరం పెంచుకున్నారని..ఇది చివరకు యుద్ధానికి దారి తీసిందని చారిత్రాక, జానపద కథనాలు వెల్లడిస్తున్నాయి. కోడి పందాల వ్యసనాలు రాజ్యాలనే కూల్చిన చరిత్ర పాఠం నేటి తరానికి ఓ గుణ పాఠంగా చూడాలంటున్నారు చరిత్రకారులు.
ఇవి కూడా చదవండి :
Diabetes | భారత్ పాలిట ఆర్థిక భారంగా మారిన డయాబెటిస్.. ప్రపంచంలోనే రెండో స్థానంలో
Bhogi Festival | రేపే భోగి పండుగ..! భోగి మంటలు ఏ సమయంలో వేయాలంటే..?
