వెస్టిండీస్​​పై సౌతాఫ్రికా సూపర్​ ‘హిట్’​ : ఊపిరి పీల్చుకున్న భారత్​​

టి20 ప్రపంచకప్​ 2026: దక్షిణాఫ్రికా – వెస్టిండీస్​ మ్యాచ్​లో 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్​పై సౌతాఫ్రికా ఘన విజయం. మార్క్​రమ్ అద్భుత ఇన్నింగ్స్‌తో 177 పరుగుల లక్ష్యాన్ని 16.1 ఓవర్లలోనే ఒకే వికెట్​ కోల్పోయి ఛేదించింది. ఈ ఫలితంతో భారత్‌ తమ సెమీఫైనల్ రేసులో ఆశలను సజీవంగా ఉంచుకోగలిగింది.

South Africa openers Aiden Markram and Quinton de Kock celebrating their partnership during SA vs WI T20 World Cup 2026 Super 8 match at Narendra Modi Stadium

సూపర్ ఎయిట్స్ మ్యాచ్‌లో విండీస్‌పై ఛేదన సందర్భంగా అద్భుత భాగస్వామ్యం నెలకొల్పిన సౌతాఫ్రికా ఓపెనర్లు ఎయిడెన్ మార్క్రామ్, క్వింటన్ డి కాక్ సంబరాలు వ్యక్తం చేస్తూ.

విధాత క్రీడా విభాగం |26 ఫిబ్రవరి 2026 | హైదరాబాద్​:

అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన గ్రూప్-1 కీలక పోరులో దక్షిణాఫ్రికా అదరగొట్టింది. వెస్టిండీస్​పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సెమీఫైనల్ దిశగా దూసుకెళ్లింది. ఈ ఫలితం ప్రొటీస్​ కంటే భారత్‌కు భారీ ఊరటనిచ్చింది.భారత్​ సెమీఫైనల్​ దారి సులభంగా ఉండాలంటే దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్​లో తప్పక గెలవాల్సిఉంది. అదే జరిగింది. ఇక కాసేపట్లో మొదలయ్యే మ్యాచ్​లో ఇండియా జింబాబ్వేను భారీ తేడాతో ఓడిస్తే సెమీస్​కు తలుపులు తెరుచుకుంటాయి.

పడిలేచిన వెస్టిండీస్​

టాస్ గెలిచిన కెప్టెన్ దక్షిణాఫ్రికా కెప్టెన్​ ఎయిడెన్​ మార్క్​రమ్​ బౌలింగ్ ఎంచుకోవడంతో ముందుగా బ్యాటింగ్​కు దిగిన విండీస్​కు ఆరంభం బాగానే దక్కింది. తొలి రెండు ఓవర్లలోనే 29 పరుగులు చేసి దూకుడుగా మొదలుపెట్టినా, వెంటనే గట్టి షాక్​లు తగిలాయి. వెంటవెంటనే వికెట్లు పడిపోయి, స్కోరు కాస్తా 4 వికెట్లకు 43గా మారింది. 10.2 ఓవర్లకు ఏకంగా 7 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది.

ఈ దశలో జేసన్​ హోల్డర్​(49) – రొమారియో షెపర్డ్​ (52*) జంట అద్భుతంగా పోరాడింది. 8వ వికెట్‌కు 89 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి స్కోరుబోర్డు మీద  176 పరుగుల గౌరవప్రదమైన పరుగులకు చేర్చింది. ప్రొటీస్​ బౌలింగ్‌లో ఎంగిడి (3 వికెట్లు), రబాడ (2 వికెట్లు) మెరిపించారు.

ఘనమైన ఛేదన – సౌతాఫ్రికా అలవోక విజయం

177 లక్ష్యంతో దిగిన సౌతాఫ్రికా బ్యాటర్లు ఏ దశలోనూ వెనుకడుగు వేయలేదు. క్వంటన్​ డికాక్​(47) – మార్క్​రమ్ కలిసి 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మార్క్​రమ్ 27 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి మ్యాచ్‌ను పూర్తిగా తమకు అనుకూలంగా మలుచుకున్నాడు. రియాన్​ రికిల్​టన్​ (45*) కూడా కెప్టెన్​కు తోడుగా మంచి సహకారాన్ని అందించి  విజయాన్ని ఖాయం చేశాడు. ఇంకా 23 బంతులు మిగిలి ఉండగానే 177 పరుగులతో లక్ష్యాన్ని ముద్దాడారు. ప్లేయర్​ ఆఫ్ ద మ్యాచ్‌గా మార్క్​రమ్ ఎంపికయ్యాడు.

ఈ విజయం భారత్​కు ఎలా ఊరటనిచ్చింది?

ఈ విజయంతో సౌతాఫ్రికా 4 పాయింట్లతో +2.890 నెట్​రన్​రేట్​తో  సెమీఫైనల్‌కు చేరువైంది. విండీస్ మాత్రం 2 పాయింట్లకే పరిమితమైంది. రన్​రేట్​ కూడా +5.35 నుండి భారీగా తగ్గి +1.79కు చేరింది. ఇప్పుడు భారత్ తన మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే 4 పాయింట్లతో సెమీఫైనల్ అవకాశాన్ని సజీవంగా ఉంచుకోగలదు. ముఖ్యంగా నెట్ రన్‌రేట్‌పై పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి లేకుండా ఉంటుంది.

ఇక ఇప్పుడు జింబాబ్వేతో మ్యాచ్​ భారత్​కు పెనుసవాల్​గా మారింది. సెమీస్​ వైపు చూడాలన్నా, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ మ్యాచ్​లో తప్పకుండా గెలిచితీరాల్సిందే.

టీ20 వరల్డ్ కప్ 2026 – సూపర్ ఎయిట్స్ గ్రూప్-1 పాయింట్ల పట్టిక

స్థానం జట్టు మ్యాచ్‌లు విజయాలు పరాజయాలు పాయింట్లు NRR
1 దక్షిణాఫ్రికా 2 2 0 4 +2.890
2 వెస్టిండీస్ 2 1 1 2 +1.791
3 భారత్ 1 0 1 0 -3.800
4 జింబాబ్వే 1 0 1 0 -5.350

Latest News