Diabetes | భారత్‌ పాలిట ఆర్థిక భారంగా మారిన డయాబెటిస్‌.. ప్రపంచంలోనే రెండో స్థానంలో

భారత్‌లో మధుమేహం భయంకర స్థాయికి చేరింది. డయాబెటిస్ కారణంగా దేశంపై 11.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక భారం పడుతోందని తాజా అధ్యయనం వెల్లడించింది.

మధుమేహం (Diabetes) ఒకటి..! భారత్‌లో కూడా ఈ సమస్య తీవ్రస్థాయిలోనే ఉంది. మధుమేహ బాధితులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. ఇది భారత్‌ పాలిట ఆర్థిక భారంగా మారుతోందని (economic burden) తాజా అధ్యయనంలో వెల్లడైంది.

ఆ అధ్యయనం ప్రకారం.. మధుమేహం కారణంగా అధిక ఆర్థిక భారం పడుతోన్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉంది. ప్రపంచంలోని మొత్తం మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో నాలుగోవంతు మంది భారత్‌లోనే ఉండటం ఈ తీవ్రతకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. దీనివల్ల భారత్‌పై 11.4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక భారం పడుతోంది. ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ అప్లైడ్‌ సిస్టమ్స్‌ ఎనాలసిస్‌, ఆస్ట్రియాలోని వియన్నా యూనివర్సిటీ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ బిజినెస్‌ పరిశోధకులు.. 2020 నుంచి 2050 వరకు ప్రపంచవ్యాప్తంగా 204 దేశాలపై మధుమేహం వల్ల పడే ఆర్థిక ప్రభావాన్ని లెక్కించి ఆ వివరాలను వెల్లడించారు.

ప్రపంచంలో మధుమేహం కారణంగా అత్యధికంగా ఆర్థిక భారాన్ని మోస్తున్న దేశాల జాబితాలో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. మధుమేహం కారణంగా అమెరికా 16.5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక భారాన్ని భరిస్తున్నది. యూఎస్‌, భారత్‌ తర్వాత 11 ట్రిలియన్‌ డాలర్లతో చైనా మూడో స్థానంలో ఉన్నది. కుటుంబ సభ్యులు తీసుకునే సంరక్షణను మినహాయించి డయాబెటిస్‌ కోసం ఏటా ప్రపంచవ్యాప్తంగా 10 ట్రిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తుండగా ఇది ప్రపంచ వార్షిక దేశీయ స్థూల ఉత్పత్తిలో 0.2 శాతంగా ఉన్నట్లు నేచర్‌ మెడిసిన్‌ జర్నల్‌లో ప్రచురించిన నివేదిక పేర్కొన్నది.

మధుమేహం వల్ల దేశాల జీడీపీలో 1.7 శాతం మేర అనధికార సంరక్షణ వ్యయం రూపంలో వృథా అవుతోందని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా క్యాన్సర్, అల్జీమర్స్ వంటి ప్రాణాంతక వ్యాధుల కంటే మధుమేహం వల్లే ఆర్థిక వ్యవస్థకు ఎక్కువ నష్టం వాటిల్లుతోందని వారు హెచ్చరిస్తున్నారు. మధుమేహం కారణంగా పని ఉత్పాదకత తగ్గడం, వైద్యం కోసం భారీగా ఖర్చు చేయాల్సి రావడం ప్రజల ఆదాయాన్ని గణనీయంగా తగ్గిస్తోంది.

ప్రతీ ఆరుగురిలో ఒకరికి..
అత్యంత సాధార‌ణ‌మైన వ్యాధుల్లో డ‌యాబెటిస్ కూడా ఒక‌టి. నేడు ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మందిని భ‌య‌పెడుతున్న జ‌బ్బు ఇది. ఈ వ్యాధి బారిన ప‌డే వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోందనే చెప్పాలి. ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల్లో కూడా ఈ వ్యాధి బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లో ప్రతి ఆరుగురిలో ఒకరు మధుమేహ ఈ వ్యాధితో (Diabetes) బాధ పడుతున్నారు. మధుమేహంతో బాధపడే వారికి ఆకస్మిక గుండెపోటుతో మరణించే ముప్పు ఎక్కువగా ఉంటుందని ఓ అధ్యయనం వెల్లడించింది.

మారిన జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లు, జ‌న్యుప‌ర‌మైన కార‌ణాల వ‌ల్ల ఈ వ్యాధికి గుర‌వుతున్నారు. ఎక్కువగా కూర్చొని పని చేయడం, పంచదార, ఉప్పు ఉన్న ప్రాసెస్‌ చేసిన ఆహారం ఎక్కువగా తినడం, పని ఒత్తిడి వల్ల యువతరం డయాబెటిస్‌ బారిన పడుతున్నట్టు ఓ సర్వేలో గుర్తించారు. డ‌యాబెటిస్ మొత్తం శ‌రీర ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

టైప్‌-1, టైప్‌-2 ఏదైనా రెండింటి వ‌ల్ల ర‌క్తంలో ఉన్న షుగ‌ర్ స్థాయిలు పెరుగుతాయి. అయితే ఈ రెండింటికీ ట్రీట్‌మెంట్లు కొద్దిగా వేరేగా ఉంటాయి. టైప్‌-1 కు ఇంజెక్షన్లు ఇస్తే, టైప్‌-2కు టాబ్లెట్లు ఇస్తారు. ఈ క్రమంలో ఏ త‌ర‌హా షుగ‌ర్ వ్యాధి వ‌చ్చినా దానికి వైద్యులు ఇచ్చే మందుల‌తోపాటు ప‌లు సూచ‌న‌లు పాటిస్తే దాంతో షుగ‌ర్ గ‌ణ‌నీయంగా అదుపులోకి వ‌స్తుంది.

ఇవి కూడా చదవండి :

Cow vs Leopard Fight : చిరుతతో పోరాడి గెలిచిన ఆవు.. షాకింగ్‌ వీడియో
Hrithik Roshan | మాజీ భార్య, ప్రస్తుత ప్రియురాలు ఒకే ఫ్రేమ్‌లో .. హృతిక్ బర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ మాములుగా లేవుగా..!

Latest News