ఒక్కటైన ‘గీత–గోవిందం’ : ఘనంగా జరిగిన విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న వివాహం

ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న వివాహం ఘనంగా జరిగింది. తాళి కడుతున్న సమయంలో రష్మిక కన్నీటి క్షణం వైరల్ కాగా, సోషల్ మీడియాలో కొత్త జంట భావోద్వేగ పోస్టులు పంచుకున్నారు.

తాళి కడుతున్న సమయంలో విజయ్ దేవరకొండను భావోద్వేగంగా చూస్తున్న రష్మిక మందన్న

తాళి కడుతున్న వేళ కన్నీటి కళ్లతో విజయ్‌ను చూసిన రష్మిక.. ఆ క్షణమే వైరల్

ఘనంగా విజయ్–రష్మిక వివాహం..

ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో హిందూ సంప్రదాయ ప్రకారం విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న వివాహం జరిగింది. తాళి కడుతున్న సమయంలో రష్మిక కన్నీళ్లు పెట్టుకున్న క్షణం సోషల్ మీడియాలో వైరల్ అయింది. సోషల్ మీడియా పోస్టులతో కొత్త జంట తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించింది.

టాలీవుడ్‌ ప్రేమజంట విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న వివాహం ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరిగింది. ముహుర్త సమయమైన ఉదయం 10.10 గంటలకు హిందూ సంప్రదాయం ప్రకారం విజయ్​, రష్మిక మెడలో మూడుముళ్లు వేసాడు. ఈ వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నట్లు సమీప వర్గాల సమాచారం. గురువారం ఉదయం తెలంగాణ సంప్రదాయం ప్రకారం వీళ్ల వివాహం జరిగిందని తెలిసింది. సాయంత్రం మళ్లీ రష్మిక కుటుంబ పద్ధతైన కొడవ సంప్రదాయంలో మరోసారి పెళ్లి తంతు నిర్వహించనున్నారు.

వివాహ వేదికగా నిలిచిన ఐటీసీ మెమెంటోస్ హోటల్ సంప్రదాయ అలంకరణలతో సిద్దమైంది. పూలతో, గంటలతో, కొబ్బరి బోండాలతో అలంకరించిన కల్యాణ మండపం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణ పెళ్లి పద్ధతిలో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైనట్లు తెలిసింది.

2018లో విడుదలైన గీత గోవిందం సినిమాతో కలిసి నటించిన ఈ జంట, ఆ తర్వాత డియర్ కామ్రేడ్లో కూడా కలిసి కనిపించారు. అప్పటి నుంచి వీరి స్నేహం, సామీప్యతపై వార్తలు వినిపిస్తున్నా, అధికారిక ప్రకటన మాత్రం ఇదే మొదటిసారి.

తాళి కడుతున్న శుభవేళ..  రష్మిక కళ్లల్లో ఆనందబాష్పాలు

పూలమాలలతో నవ్వులు పూయించిన విరోష్ జంట.. ప్రేమే ప్రధాన ఆకర్షణ

పెళ్లి ఫోటోలలో ఒక చిత్రం అందరినీ కదిలించింది. తాళి కడుతున్న సమయంలో రష్మిక కన్నీళ్లు పెట్టుకున్న క్షణం చూసినవారిని ఆకట్టుకుంది. వ్యక్తిగత జీవితంలో ముఖ్యమైన మలుపు కావడంతో ఆమె భావోద్వేగానికి లోనైనట్లు స్పష్టమవుతోంది.

సోషల్ మీడియాలో పంచుకున్న చిత్రాలు, వీడియోలు విస్తృతంగా షేర్ అవుతున్నాయి. అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జంటపై అభిమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారిక మీడియా ప్రకటనల్లో పెళ్లి వివరాలపై పూర్తి సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది.

ప్రీ-వెడ్డింగ్ వేడుకలైన హల్దీ, మెహందీ, సంగీత్ కార్యక్రమాలు కూడా సన్నిహితుల మధ్య జరిగాయని సమాచారం. కుటుంబ సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తూ ఈ వేడుకలు నిర్వహించినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ తల్లి మాధవి కుటుంబ వారసత్వంగా వస్తున్న గాజులను కొత్త కోడలికి బహుమతిగా ఇచ్చిందని తెలిసింది.

సోషల్ మీడియాలో దంపతుల భావోద్వేగ వ్యాక్యాలు..

ముహూర్తం ముందు పూజలో పాల్గొన్న విజయ్.. సంప్రదాయానికి ప్రాధాన్యం

వివాహ అనంతరం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు షేర్ చేశారు. “ఓ రోజు, ఆమె నా పక్కన లేనప్పుడు తెలిసింది. ఉంటే ఆరోజు చాలా బావుండేదని,  ఆమెతో కలిసి తింటే.. భోజనం మరింత కమ్మగా ఉండేదని. ఆమెతో కలిసి చేసే వర్కవుట్స్ మరింత సరదాగా, నొప్పులు లేకుండా ఉండేవి. ఆమెతో ఉంటే చాలు, ఎక్కడ ఉన్నా ఇంట్లో ఉన్నట్టుగా, ప్రశాంతంగా ఉంటుంది.. అందుకే నా ప్రాణస్నేహితురాలినే భార్యగా చేసుకున్నా” అంటూ విజయ్ పేర్కొన్నాడు.

ఇక రష్మిక “నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నేర్పించిన వ్యక్తి, ప్రశాంతంగా ఎలా ఉండాలో నాకు నేర్పించిన మనిషి, పెద్దగా కలలు కనాలని రోజూ చెపుతూ, నేను కనీసం ఊహించనిదాన్ని కూడా సాధించగలనని ఎప్పుడూ నమ్మేలా చేసిన వ్యక్తి.. ఎవ్వరూ లేరనుకుని డ్యాన్స్ చేసినా, నన్ను ఎప్పుడూ ఆపని వాడు, మిత్రులతో ప్రయాణం ఎంత బాగుంటుందో చూపించిన మనిషి..  నిజంగా ఇతని గురించి ఓ పుస్తకం రాసేయొచ్చు. ఒక స్త్రీగా ఎలా ఉండాలని కలలు కన్నానో, నేడు అలా ఉన్నాను. ఇది నీవల్లే సాధ్యమైంది. విజ్జు.. నీ గురించి నాకున్న భావాలను వర్ణించడానికి మాటలు సరిపోవని నేను నీకు చెబుతూనే ఉన్నాను. నా విజయాలు, కష్టాలు, ఆనందం, విచారం, సంతోషం, దుఃఖం అన్నీ నీకు తెలుసు. నీవల్లే ఇవన్నీ అర్థవంతంగా మారాయి.

నీ అర్థాంగిగా మారుతున్నందుకు ఎంతో ఉత్సాహంగా ఉంది. నీ భార్యగా పిలవబడటం సంతోషంగా ఉంది.  ఇది పండుగ సమయం. మనం కలిసి ఓ అత్యుత్తమ జీవితాన్ని గడుపుదాం.. ఐ లవ్ యూ..’ అంటూ తన భావాలను వెల్లడించింది.

ఈ పోస్టులు తక్షణమే వైరల్ కావడంతో సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. కొద్దిమంది ప్రముఖులు మాత్రమే వివాహానికి హాజరైనట్లు సమాచారం. హైదరాబాద్‌లో మార్చి 4న రిసెప్షన్ నిర్వహించే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Latest News