పేదల గుండె చప్పుడు సిద్ధం సభలు

ఏపీలో వైసీపీ 58నెలల పాలనలో పేదల బతుకుల్లో వెలుగులు నింపామని, మీకు మంచి జరిగిందన్న ధైర్యంతోనే సిద్ధం సభలతో మిమ్మల్ని ఓట్లు అడిగేందుకు వచ్చామని...పేదల గుండె చప్పుడుగా సిద్ధం సభలు రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు జన సునామీని తలపించాలని ఏపీ సీఎం వైఎస్‌. జగన్ పేర్కోన్నారు

  • Publish Date - April 24, 2024 / 06:10 PM IST

సిద్ధం యాత్రలు..వైసీపీ జైత్ర యాత్రలు
చంద్రబాబులా మోసపూరిత హామీలివ్వను
జగన్‌కు ఓటేస్తే పథకాలు ముందు
చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపు
కూటమి మోసాలకు చెప్పు చెల్లుమనే తీర్పునివ్వాలి
మేమంతా సిద్ధం బస్సుయాత్ర ముగింపు సభలో సీఎం జగన్‌

విధాత : ఏపీలో వైసీపీ 58నెలల పాలనలో పేదల బతుకుల్లో వెలుగులు నింపామని, మీకు మంచి జరిగిందన్న ధైర్యంతోనే సిద్ధం సభలతో మిమ్మల్ని ఓట్లు అడిగేందుకు వచ్చామని…పేదల గుండె చప్పుడుగా సిద్ధం సభలు రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు జన సునామీని తలపించాలని ఏపీ సీఎం వైఎస్‌. జగన్ పేర్కోన్నారు. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తలపెట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర ముగింపు సభ శ్రీకాకుళం జిల్లా టెక్కలి అక్కవరం వద్ద భారీ ఎత్తున నిర్వహించారు.

ఈ సభలో ప్రసంగించిన సీఎం జగన్ టీడీపీ కూటమిపై నిప్పులు చెరిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి ఇచ్చిన హామీలలో 99శాతం పూర్తి చేశామన్నారు. గ్రామస్వరాజ్యంతో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, సంక్షేమ పథకాలను డోర్ డెలివరిగా అందించన చరిత్ర మా ప్రభుత్వానిదని, విద్య, వైద్య రంగాల్లో గొప్ప మార్పులు తెచ్చామన్నారు. మీ బిడ్డ జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేశామని, పేద, ధనిక వర్గాల పిల్లలు చదువుకోవడంలో వ్యత్యాసాన్ని రూపుమాపమన్నారు.

మే 13న జరిగే ఎన్నికల్లో జగన్ పార్టీకి ఓటేస్తే పథకాలు ముందుకు..చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపు అవుతుందన్నారు. చంద్రబాబులాగా తాను మోసపూరిత హామీలివ్వలేనని, నెరవెర్చలేని హామీలు మ్యానిఫెస్టోలో పెట్టబోనన్నారు. అబద్ధాలు వెన్నుపోట్లలో నేను ఆయనతో పోటీ పడలేనని చెప్పారు. 2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలను ఒక్కటి అమలు చేయలేదని ఆ పార్టీ మ్యానిఫెస్టో అంశాలను సభలో చదివి వినిపించారు. 87వేల కోట్ల రుణమాఫీ, మహిళా సంఘాల రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు వంటి మోసగాడు కావాలా..మీ బిడ్డ జగన్ వంటి నిజాయితీ పరుడు కావాలో తేల్చుకోవాలన్నారు.

చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పని గుర్తుకు రాదన్నారు. టీడీపీ కూటమి మోసాలకు చెంప చెల్లుమనిపించేలా ఎన్నికల తీర్పునివ్వాలని కోరారు. ఒక్క జగన్‌ను ఓడించేందుకు చంద్రబాబుకు మరో రెండు పార్టీలు కావాల్సివచ్చిందన్నారు. అబద్దపుల హామీలిచ్చి దోచుకోవడం దాచుకోవడం పంచుకోవడమే చంద్రబాబు పని అన్నారు. మంచి జరిగిందని భావిస్తే మీ బిడ్డకు మీరే సైనికులై అండగా నిలబడి ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. సిద్ధం సభలకు వచ్చిన జన స్పందన చూస్తే 25ఎంపీ సీట్లు, 175అసెంబ్లీ సీట్లు వైసీపీ గెలుస్తుందన్న నమ్మకం ఉందన్నారు.

Latest News