విధాత : మందుబాబులకు ఈ మధ్య కరెంటు తీగలు కూడా దాసోహమైపోతున్నాయి. తిరుపతి దగ్గర గురవరాజుపల్లిలో ఓ మందుబాబు వీరంగం ఘటన దీనికి నిదర్శనంగా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. గురవరాజుపల్లిలో శివాని అనే వ్యక్తి మద్యం మత్తులో ఏకంగా 220కేవీ విద్యుత్ టవర్ ఎక్కి హంగామా చేశాడు. విద్యుత్తు వైర్లు పట్టుకుని గాలిలో ఉయ్యాలలూగాడు.
ఇదంతా గమనించిన స్థానికలు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అప్రమత్తమై కరెంట్ కనెక్షన్ కట్ చేయించారు. కరెంటు వైర్లకు వేలాడుతున్న అతడిని రక్షించేందుకు పోలీసులు, స్థానికులు కింద వలను పట్టుకోవడంతో కిందకి దూకాడు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన అతను.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కిందకు దూకే సమయంలో అతడి బరువు..వేగానికి తగ్గట్లుగా వలను పట్టుకోవడంలో విఫలమవ్వడంతోనే అతడు తీవ్రంగా గాయపడ్డాడని..రెస్క్యూ ప్లాన్ వైఫల్యమే అతడి మృతికి కారణమైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.