విధాత, అమరావతి : కంటికి పాపాలా కాపాడాల్సిన ఓ తండ్రి తన మైనర్ బాలికను తెగనమ్ముకున్నాడు. మైలవరం మండం గణపవరం గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బెల్లంకొండ నాగరాజు తన స్నేహితుడైన ఏరువ జమలారెడ్డితో కలిసి తిరుగుతూ మద్యానికి బానిసయ్యారు. కాగా, జమలారెడ్డి మద్యానికి బానిసై భార్యకు విడాకులిచ్చాడు. నాగరాజును బావమర్ది అని సంబోధిస్తూ ఇద్దరూ జల్సాలు చేసేవారు.
అయితే, నాగరాజు తన మైనర్ కూతురుని జమలారెడ్డికి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి పలు దఫాలుగా డబ్బులు తీసుకున్నాడు. సుమారు రూ.20 లక్షల వరకు దండుకుని కారుతో పాటు తదితరాలు కొనుకుని ఎంజాయ్ చేశాడు. చెప్పినట్లుగానే జమలారెడ్డికి నాగరాజు తన 15ఏళ్ల కూతురుని ఇచ్చి వివాహం జరిపించాడు. అయితే, ఆ బాలిక కాపురానికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటుంది. ఈ క్రమంలో మరోసారి నాగరాజు తనకు డబ్బులు కావాలని జమలారెడ్డిని అడిగారు. ఇందుకు అతను కూమార్తెను కాపురానికి తీసుకొస్తేనే డబ్బులు ఇస్తానని స్పష్టం చేశాడు.
దీంతో జమలారెడ్డి ఇంటి వద్ద నాగరాజు బలవంతంగా తన కూతురిని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. జమలారెడ్డి ఆ బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితురాలు చుట్టుపక్కల ఉన్నవాళ్ల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. మైనర్ కంప్లైంట్ తో తండ్రి నాగరాజు, జమలారెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు పోక్సో కేసు నమోదు చేశారు. వాళ్లిద్దరిని రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
