- అదనపు ఫీజులు వసూలు నిజమే
- 15 లక్షల జరిమానా విధింపు
- 26 కోట్ల అదనపు ఫీజులను విద్యార్థులకు చెల్లించాలి
- గుర్తింపు రద్దుకు ప్రభుత్వానికి సిఫార్సు?
- రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్ ఆదేశాలు
తిరుపతిలోని ప్రముఖ విద్యాసంస్థ మోహన్ బాబు యూనివర్సిటీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్ భారీ జరిమానా విధించింది. గత మూడేళ్లుగా విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేసినట్లు వచ్చిన ఫిర్యాదులపై కమిషన్ విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేల్చింది. దీంతో యూనివర్సిటీపై రూ.15 లక్షల జరిమానా విధించడంతో పాటు, విద్యార్థుల నుంచి వసూలు చేసిన రూ.26 కోట్ల రూపాయలను 15 రోజుల్లో తిరిగి చెల్లించాలనే ఆదేశాలు జారీ చేసింది.
అక్రమంగా అడ్డగోలు ఫీజు వసూళ్లు
విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వచ్చిన పలు ఫిర్యాదుల ఆధారంగా ఉన్నత విద్యా కమిషన్ ప్రత్యేక విచారణ చేపట్టింది. 2021–2024 మధ్యకాలంలో యూనివర్సిటీ రుసుముల పద్ధతి అనుమతించిన పరిమితిని మించి ఉందని నివేదికలో పేర్కొంది. ఆర్థిక లావాదేవీల పత్రాలు, బ్యాంక్ రికార్డులు పరిశీలించగా, అనుమతించని పద్ధతిలో 26 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ఆధారాలు లభించాయి.
ఈ నేపథ్యంలో మోహన్ బాబు యూనివర్సిటీకి జరిమానా విధించడమే కాకుండా, అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని 15 రోజుల్లో తిరిగి చెల్లించాలనే కఠిన ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే సంస్థ గుర్తింపును రద్దు చేయాలని కూడా ఏపీ ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు సమాచారం. అయితే యూనివర్సిటీ జరిమానా 15 లక్షలను ఇప్పటికే ప్రభుత్వానికి చెల్లించినట్లు తెలిసింది.
ఇటీవల ఈ యూనివర్సిటీపై విద్యార్థి సంఘాలు కూడా పలు సార్లు ఆందోళనలు చేపట్టాయి. అధిక ఫీజుల వసూళ్లపై ఏఐసీటీఈకు ఫిర్యాదులు వెళ్లాయి. స్థానిక మీడియా, విద్యార్థుల తల్లిదండ్రులు తమ సమస్యలను పెద్దయెత్తున సోషల్ మీడియాలో కూడా లేవనెత్తారు. ఈ వివాదం తీవ్ర స్థాయికి చేరుకున్న సమయంలో మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చగా మారాయి.
“నా తండ్రి మోహన్ బాబు గారు ఎల్లప్పుడూ ఉన్నత విలువలను నమ్మి విద్యాసంస్థలను స్థాపించారు. కానీ ఇప్పుడు ఆ సంస్థలపై వస్తున్న ఆరోపణలు దురదృష్టకరం. విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన నేను ఉంటాను. ఎవరికైనా ఫిర్యాదులు ఉంటే నేరుగా నాకు పంపండి, నేను వాటిని మా నాన్న దృష్టికి తీసుకెళ్తాను” అని మనోజ్ అప్పట్లో ప్రకటించారు. ఆయన వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అయ్యాయి.
వివాదాల కేంద్రం – మోహన్బాబు యూనివర్సిటీ
ఇప్పుడు ఉన్నత విద్యా కమిషన్ తీర్పు వెలువడడంతో మోహన్ బాబు యూనివర్సిటీ మళ్లీ వివాదాల కేంద్రంగా మారింది. యూనివర్సిటీ మేనేజ్మెంట్ ఇప్పటికే జరిమానా చెల్లించినప్పటికీ, విద్యార్థులకు డబ్బులు తిరిగి చెల్లించే ప్రక్రియ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికర అంశంగా మారింది. ఒక్క ఫీజు విషయమే కాకుండా మేనేజ్మెంట్పై విద్యార్థులను వేధించడం లాంటి ఇతరత్రా ఆరోపణలు కూడా ఉన్నాయి. దీని సోదర విద్యాసంస్థ శ్రీవిద్యా నికేతన్ మీద లెక్కలేనన్ని తీవ్రస్థాయి ఆరోపణలున్నాయి.
మరోవైపు ఈ నిర్ణయం విద్యాసంస్థల ఫీజు నియంత్రణ వ్యవస్థపై పెద్ద చర్చకు దారి తీసింది. విద్యార్థుల హక్కులను కాపాడడంలో ఉన్నత విద్యా కమిషన్ కఠిన వైఖరి తీసుకోవడాన్ని విద్యార్థి సంఘాలు స్వాగతించాయి. రాష్ట్రంలోని ఇతర ప్రైవేట్ యూనివర్సిటీలకు ఇది ఒక హెచ్చరికగా నిలవబోతోందని పలువురు విద్యావేత్తలు పేర్కొన్నారు.
ప్రస్తుతం మోహన్ బాబు యూనివర్సిటీ ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం న్యాయం జరిగిందని భావిస్తున్నారు. ఈ ఆదేశాల ప్రకారం యూనివర్సిటీ 15 రోజుల గడువులోగా రూ.26 కోట్లు చెల్లించాల్సి ఉంది. లేనిపక్షంలో తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు కమిషన్ స్పష్టం చేసింది.