అమరావతి : ద్రోణి ప్రభావంతో బుధవారం అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తరాంధ్ర,గుంటూరు, బాపట్ల,పల్నాడు,ప్రకాశం, నెల్లూరు,కర్నూలు, నంద్యాల,అనంతపురం, శ్రీసత్యసాయి,కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మంగళవారం సాయంత్రం 5 గంటలకు కాకినాడ(జి) డి.పోలవరంలో 90మిమీ, అనకాపల్లిలో 70.5మిమీ,
విజయనగరం(జి) చీపురుపల్లిలో 66.5మిమీ,కాకినాడ (జి) కోటనందూరులో64.7మిమీ, నెల్లూరు(జి) చినపవానిలో 57మిమీ,అల్లూరి (జి) పైనంపాడు 56. 5మిమీ వర్షపాతం నమోదైందని వెల్లడించింది.
తెలంగాణలోనూ వర్షాలు
తెలంగాణలోనూ ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ అంచనా వేసింది. అక్టోబర్ 10 వరకు వాతావరణం ఇలాగే ఉంటుందని పేర్కొంది. దీంతో పాటూ తెలంగాణలోని పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.