విధాత హైదరాబాద్(విధాత) సెప్టెంబర్ 21:
IMD warning for Telangana | ఇటీవల కురిసిన భారీ వర్షాల నుండి ప్రజలు కోలుకుంటుండగానే, తెలంగాణకు మరోసారి వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సెప్టెంబర్ 22, 23 తేదీల్లో రాష్ట్రంలోని పది జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టంచేసింది. మిగతా జిల్లాల్లో మాత్రం వడగండ్లు, ఈదురుగాలులు, మెరుపులు, అక్కడక్కడా చెదురుముదురు జల్లులు చోటుచేసుకునే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
వాతావరణ పరిస్థితులు మరింతగా వేగంగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో వచ్చే 24 గంటల్లో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని న్యూఢిల్లీ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అప్పపీడనం సెప్టెంబర్ 26వ తేదీ కల్లా వాయుగుండంగా మారి, పశ్చిమ వాయువ్య దిశగా కదలబోతుందని అంచనా. దీని ప్రభావంతో మధ్య, దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణలో, సెప్టెంబర్ 26 , 27 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది.
వాతావరణ మార్పులపై నిరంతర నిఘా పెడుతున్న ‘Hyderabad Rain’ వంటి స్వతంత్ర వాతావరణ విశ్లేషకులు కూడా ఇవే హెచ్చరికలు జారీ చేశారు. కొత్తగా ఏర్పడే వాతావరణ తీవ్రత పెరిగితే తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యే ప్రమాదం ఉందని వారు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రజలు గత వర్షాల ప్రభావం నుంచి కోలుకుంటుండగా, కొత్తగా వచ్చే ఈ వర్షాలు మళ్లీ ఇబ్బందులు పెంచే అవకాశం ఉంది. రైతులు, నగర ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.