విధాత : దేశ వ్యాప్తంగా చంద్రగ్రహణం మంగళవారం మధ్యహ్నం 03:21 నుంచి సాయంత్రం 6:47వరకు పాక్షికంగాకొనసాగనుంది. ప్రకృతి నూతన వసంత శోభను సంతరించుకున్న వేళ.. హోలీ రోజున ఈసారి చంద్రగ్రహణం సంభవిస్తుండటం గమనార్హం.
గ్రహణ వేళలు…
గ్రహణం ప్రారంభం కాలం మధ్యాహ్నం 3:21నుంచి, గ్రహణ మధ్యకాలం : సా. 05:04 నుంచి, తెలుగు రాష్ట్రాలలో చంద్రోదయం: సా. 06:22లకు, గ్రహణ మోక్షం (విడుపు) : సా. 06:47గా పండితులు వెల్లడించారు. గ్రహణ అంత్యం (పూర్తి) : రా. 07:53గా తెలిపారు. గ్రహణ దర్శన సమయం తెలుగు రాష్ట్రాలలో సుమారు 25 నిమిషాల పాటు పాక్షికంగా కనిపించే అవకాశం ఉందని వెల్లడించారు. గ్రహణ కాలంలో చేసే జపం,హోమం అనంతమైన ఫలితాన్నిస్తాయని, మధ్యాహ్నం 3:20 గంటలకు పట్టు స్నానం, సాయంత్రం 6:47 గంటలకు విడపు స్నానం ఆచరించడం తప్పనిసరి అని, విష్ణు సహస్రనామ పారాయణం లేదా గాయత్రీ మంత్ర జపం చేయడం వల్ల విశేష పుణ్యం లభిస్తుందని తెలిపారు.
ఈ రాశుల వారిపై గ్రహణ ప్రభావం
సింహ రాశి, కన్య రాశి, మకర రాశి, వృషభ రాశీ వారిపై గ్రహణ ప్రభావం ఉండవచ్చని..ఆ రాశుల వారు గ్రహణ పీడా పరిహార శ్లోకాలు పఠించడం శ్రేయస్కరం అని పండితులు తెలిపారు.
అన్ని ఆలయాలు మూసివేత…అక్కడ మాత్రం తెరిచే ఉంటాయి!
దేశ వ్యాప్తంగా తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయం సహా శైవ, వైష్ణవ, అమ్మవారి ఆలయాలన్ని గ్రహణ సమయంలో మూసివేస్తారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 7.30 వరకు ఆలయం మూసివేస్తారు. అనంతరం ఆలయాల శుద్ది, సంప్రోక్షణ, అభిషేకాలు, పుణ్యహావచకాల నిర్వహణ అనంతరం ఆలయాలను తెరుస్తారు.
గ్రహణం వేళ.. తెరిచే ఉండే ఆలయాలు ఇవే..!
గ్రహణ సమయంలో తెరిచే ఉండే ఆలయాలలో ప్రధానంగా శ్రీకాళహస్తి, ఆరుణాచలం ఆలయాలు ఉన్నాయి. శ్రీకాళహస్తిలో పంచభూత లింగాల్లో ఒకటైన వాయులింగగా ఇక్కత మహాశివుడు స్వయంభూగా వెలిశాడు. ఇక్కడ వాయులింగేశ్వరుడు 27 నక్షత్రాలను కవచంగా ధరించి ఉంటాడు. గ్రహాలను శాసించే స్వామికి గ్రహణం దోషం అంటదని..అందుకే శ్రీకాళహస్తి ఆలయంలో గ్రహణం సమయంలో రాహు కేతు పూజలు, శ్రీజ్ఞాన ప్రసునాంబిక దేవి సమేత శ్రీకాళహస్తీశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు ఘనంగా జరుగుతాయి. ఈ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే గ్రహదోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
స్వయంభూ అరుణచలేశ్వర ఆలయం కూడా గ్రహణ సమయంలో తెరిచి ఉంటుంది. ఇక్కడ కొండనే శివస్వరూపంగా, అగ్నిలింగంగా భావించే ప్రదేశం అరుణాచలం. నిత్యం భక్తులతో విలసిల్లే అరుణాచలం పౌర్ణమి వేళ మరింత రద్దీగా ఉంటుంది. అందుకే గ్రహణం రోజు కూడా అరుణాచలం ఆలయాన్ని మూసివేయరు.
అలాగే ఉజ్జయినిలో కొలువైన మహాకాళేశ్వరుడు ఆలయం కూడా తెరిచే ఉంటుంది. కాలానికి అతీతుడైన స్వయంభూ మహాకాళుడికి గ్రహణ ప్రభావం ఉండదన్న నమ్మకంతో జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఈ క్షేత్రంలో గ్రహణం సమయంలోనూ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఉత్తరాఖండ్ లో ఉన్న కల్పేశ్వర్ ఆలయాన్ని కూడా గ్రహణం సమయంలో మూసివేయరు. ఢిల్లీలో ఉండే కల్కాజీ ఆలయంలో కొలువైన కల్కా దేవిని కాలచక్రానికే అధిపతిగా పూజిస్తారు. గ్రహాలు, నక్షత్రాలు ఆమె కనుసన్నల్లోనే కదులుతాయని అందుకే గ్రహణ ప్రభావం ఈ ఆలయంపై ఉండదని చెబుతారు.
కేరళలోని తిరువార్పు శ్రీకృష్ణ ఆలయం, రాజస్థాన్ రాష్ట్రం బికనీర్ లో ఉన్న లక్ష్మీనాథ్ ఆలయం కూడా గ్రహణం సమయంలో మూతపడదు. గయలోని విష్ణుపాద ఆలయం, పశ్చిమ గోదావరిలోని ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయం కూడా గ్రహణ సమయంలో తెరిచే ఉంటాయి.
