Site icon vidhaatha

Hero Srikanth: హీరో శ్రీకాంత్ కి ప్రైవేట్ పూజలు..పండితుడిపై సస్పెన్షన్ వేటు!

విధాత, హైదరాబాద్ : ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయ వేద పండితుడిపై సస్పెన్షన్ వేటు పడింది. సినీ నటుడు శ్రీకాంత్‌ కుటుంబానికి ప్రైవేటుగా నవగ్రహ శాంతి పూజలు నిర్వహించిన వ్యవహారంపై శ్రీకాళహస్తి ఆలయ అర్చకుడిని ఆలయ అధికారులు సస్పెండ్ చేశారు. శ్రీకాళహస్తి పట్టణం సన్నిధి వీధిలోని రాఘవేంద్ర స్వామి మఠంలో ఈనెల 29న హీరో శ్రీకాంత్ కుటుంబం నవగ్రహ శాంతి పూజలు చేయించుకున్నారు. హీరో శ్రీకాంత్ ఊహా దంపతులతో పాటు కుమారుడు, కుమార్తెలు పూజలలో పాల్గొన్నారు. ముక్కంటి ఆలయంలో పనిచేసే కొందరు అర్చకులు, వేద పండితులు శ్రీకాంత్‌కు ప్రైవేటుగా పూజలు నిర్వహించారు.

ఈ వ్యవహారం వివాదస్పదమైంది. దేవాలయ నిబంధనలు అర్చకులు ఉల్లంఘించారని భావించిన ఆలయ అధికారులు వివాదానికి కారణమైన అర్చకుడిని సస్పెండ్ చేశారు. శ్రీకాళహస్తి ఆలయం ఒక పవిత్ర క్షేత్రం, ఇక్కడ నిర్వహించే పూజలు ఆలయ నియమావళికి లోబడి జరగాలి. అర్చకులు లేదా వేద పండితులు ఆలయం వెలుపల ప్రైవేటుగా పూజలు నిర్వహించడం ఆమోదయోగ్యం కాదు. ఈ విషయంలో ఎటువంటి రాజీ లేకుండా చర్యలు తీసుకుంటాం,” అని అధికారులు స్పష్టం చేశారు.

సినీ సెలబ్రేటీలతో పాటు ప్రముఖ క్రికెటర్లు, దిగ్గజ వ్యాపారులు శ్రీకాళహస్తిలో తరుచు శాంతి పూజలు, దోష నివారణ పూజలు జరిపిస్తుంటారు. ఇందుకోసం వారికి దేవాలయం పరిధిలోనే ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే ఆలయ నిబంధనల మేరకు ప్రైవేటుగా, ఆలయం వెలుపల పూజలకు నిషిద్దం. హీరో శ్రీకాంత్ కుటుంబం ప్రవేటుగా శాంతి పూజలు నిర్వహించినప్పటికి వారు అర్చకుల సూచన మేరకు అందుకు అంగీకరించినట్లుగా తెలుస్తుంది.

శ్రీకాళహస్తి ఆలయం, రాహు-కేతు సర్ప దోష నివారణ పూజలకు ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రం. ఈ ఆలయంలో నిర్వహించే పూజలు నిర్దిష్ట నియమ నిబంధనలకు లోబడి ఆలయ ప్రాంగణంలోనే జరగాలని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. శ్రీకాంత్ కుటుంబానికి రాఘవేంద్ర స్వామి మఠంలో ప్రైవేటుగా పూజలు నిర్వహించడం ఆలయ నియమాలకు విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే, ఆలయ అధికారులు విచారణ జరిపి, సంబంధిత వేద పండితుడిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

Exit mobile version