అమరావతి : విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మావారి సిరిమానోత్సవం కన్నుల పండువగా ప్రారంభమైంది. సిరిమానుపై ఆశీనులైన పూజారి బంటుపల్లి వెంకటరావు ఉత్సవ ఊరేగింపును కొనసాగించారు. ఊరేగింపును చూసేందుకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. వర్షం కారణంగా సిరిమాను ఊరేగింపుకు తాత్కాలిక ఆటంకం ఏర్పడినప్పటికి..వర్షం తగ్గాక ఉత్సాహంగా కొనసాగింది. చదరగుడి నుంచి విజయనగరం కోట వరకు సిరిమానును ఊరేగించారు. పాలధార, తెల్ల ఏనుగు, జాలరివల, అంజలి రథం ఊరేగింపుగా వెళ్తుండగా.. భక్తుల జయజయ ధ్వానాల నడుమ అమ్మవారి సిరిమాను ముందుకు సాగింది. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు సిరిమానును దర్శించుకున్నారు.
అంతకుముందు పైడి తల్లి అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. పైడి తల్లి ఆలయ పునర్నిర్మాణం కోసం రూ.1.80 కోట్లు మంజూరు చేశాం అని తెలిపారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా ఈ నెల 9న శంకుస్థాపన చేస్తాం అన్నారు.
కూలిన ఉత్సవ వేదిక
అటు సిరిమానోత్సవ ఊరేగింపు చూసేందుకు ఏర్పాటు చేసిన వేదిక కూలడంతో వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. వేదికపైనే ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులు, మంత్రులు ఆనం, అనిత ప్రభృతులు ఉన్నప్పటికి వారంతా ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. అంతకుముందు అమ్మవారి దర్శనం కోసం వచ్చిన బొత్స సత్యనారాయణను ప్రత్యేక దర్శనానికి అనుమతించకపోవడంతో ఆయన సాధారణ క్యూలైన్ లోనే వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘనపైన, ఉత్సవ అవకతవకలపైన ఉత్సవాలు ముగిశాక మాట్లాడుతానని బొత్స తెలిపారు.