Site icon vidhaatha

ఏపీలో మారిపోతున్న జగన్‌ పథకాల పేర్లు.. కొత్త పేర్లివే!

అమరావతి: ప్రభుత్వాలు మారిపోగానే.. పథకాల పేర్లు మారిపోవడం జరుగుతున్న తంతే. గతంలో జగన్‌ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన పేర్లను తొలగించి, వేరే పేర్లు పెట్టగా.. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అదే దారి ఎంచుకున్నది. ఏపీలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో పథకాల పేర్లు కూడా మారిపోతున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం అనేక పథకాలకు ముందు జగన్‌, వైఎస్‌ పేర్లను చేర్చగా.. టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వాటి పేర్లు మార్చాలని ఆదేశాలు జారీ చేసింది. తొలి దశలో సాంఘిక సంక్షేమ శాఖలో పలు పథకాల పేర్లు మారాయి.

ఇందులో ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని ఇకపై పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌ (ఆర్టీఎఫ్‌)గా మారనున్నది. ‘జగనన్న వసతి దీవెన’ పథకం పేరును పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌ (ఎంటీఎఫ్‌)గా మార్చనున్నారు. జగనన్న విదేశీ విద్యాదీవెన (ఎస్సీలకు) పథకాన్ని ఇకపై అంబేద్కర్‌ విదేశీ విద్యానిధి (ఏవోవీఎన్‌)గా మారనున్నది. వైఎస్సార్‌ కల్యాణమస్తు పథకం పేరును చంద్రన్న పెళ్లి కానుకగా మార్చనున్నారు.

వైఎస్సార్‌ విద్యోన్నతి పథకాన్ని ఎన్టీఆర్‌ విద్యోన్నతి పథకంగా మార్పు చేయనున్నారు. జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం పేరును ఇకపై ఇన్సెంటివ్స్‌ ఫర్‌ సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్స్‌గా మార్చనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు సాఫ్ట్‌వేర్‌లలో మార్పులు చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

 

Exit mobile version