విధాత:కరోనా సెకండ్ వేవ్ పై చేస్తున్న పోరాటం నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. గడిచిన వందేళ్ళలో ఇదే అతిపెద్ద మహమ్మారి అని వ్యాఖ్యానించారు. ఈ మహమ్మారితో పోరాడేందుకు ఇతర దేశాలు సాయం చేయడానికి ముందుకు వచ్చాయని, ఆక్సిజన్ లోటును తీర్చుకున్నామని, కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎంతో మంది ప్రియమైన వారిని పోగొట్టుకున్నామని అన్నారు. ఇంకా గతంతో పోలిస్తే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెరిగిందని, మిషన్ ఇంధ్రధనుష్ పేరుతో వ్యాక్సిన్ల ఉత్పత్తి బాగా పెరిగిందని, దేశంలో ఉన్న రెండు వ్యాక్సిన్లతో పాటు ఇతర దేశాల వ్యాక్సిన్లకు అనుమతులు ఇచ్చామని, అవసరమైన మందుల ఉత్పత్తులు పెంచడంతో కరోనాపై పోరాటంలో ముందున్నామని, కనిపించని శతృవుతో పోరాటం చేస్తున్నామని వెల్లడించారు.
కరోనాను అంతం చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇస్తామని పేర్కొన్నారు. దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. ప్రపంచంలో వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు చాలా తక్కువ అని.. మనం వ్యాక్సిన్ ఉత్పత్తి చేసుకోకపోతే విదేశాల నుంచి రావడానికి ఏళ్లు పట్టేందని గుర్తు చేశారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్నీ ఉపయోగించి ఆక్సిజన్ కొరత తీర్చుతున్నామని తెలిపారు. దేశంలో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని 10 కోట్లకు మించి పెంచామనీ… అతి తక్కువ సమయంలోనే మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని 10 రేట్లకు మించి పెంచామని అన్నారు. ఇంత భారీ జనాభా ఉన్న దేశంలో వ్యాక్సినేషన్ ఎలా చేస్తారని ప్రపంచం భావించిందని స్వదేశీ సంస్థల ఉత్పత్తితో ప్రపంచానికి మన శక్తి ఏంటో చూపించామని వెల్లడించారు.