అమరావతి : వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదాను తిరస్కరిస్తూ ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీసుకొచ్చిన రూలింగ్‌ను సవాల్ చేస్తూ మాజీ సీఎం, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఆక్టోబర్ 4వ తేదీకి వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, స్పీకర్ కార్యదర్శి, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌తోపాటు శాసనవ్యవహారాల కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.
స్పీకర్ రూలింగ్ వెనుక రాజకీయ వైరం, పక్షపాతం ఉన్నాయని.. ఇది స్పీకర్ ఒక్కరి నిర్ణయమే కాదు.. అధికార పార్టీ సమిష్టి నిర్ణయమని జగన్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందే నిర్ణయించుకున్నారని… శాసన వ్యవహారాల మంత్రి కూడా మీడియాతో ఇదే చెప్పారనని..స్పీకర్ చేసిన రూలింగ్ నిష్పాక్షికంగా, తటస్థంగా లేదని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత గురించి రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని..అలాగే చట్టంలో కూడా స్పష్టమైన నిర్వచనం ఉందని… సీట్ల ఆధారంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఎక్కడా లేదని.. అయినా కూడా చట్టంలోని లేని పరిమితిని స్పీకర్ తన రూలింగ్‌లో నిర్దేశించారని తెలిపారు. స్పీకర్ రూలింగ్‌ను ఆంధ్రప్రదేశ్ జీత భత్యాలు, పెన్షన్లు, అనర్హతల తొలగింపు చట్టానికి విరుద్ధంగా ప్రకటించాలని..వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం.. తనకు ప్రతిపక్ష నేత హోదా ప్రకటించేలా స్పీకర్‌ను ఆదేశించాలని జగన్ తన పిటిషన్ లో అభ్యర్థించారు.