పెండింగ్ బిల్స్ రూ.1.35 లక్షల కోట్లు
అడ్డగోలుగా నిధుల మళ్లింపు..ప్రభుత్వ ఆస్తుల తాకట్టు
వైసీపీ దోపీడి విధానాలతో ఏపీకి 76,,795 కోట్ల ఆదాయం తగ్గింది
మొత్తం బాకీలు పెట్టి జగన్ దోచుకెళ్లాడు..భారం కూటమి ప్రభుత్వంపై పడింది
ఆర్థిక శ్వేత పత్రంలో సీఎం చంద్రబాబునాయుడు
విధాత, హైదరాబాద్ : గత వైసీపీ ప్రభుత్వం అవలంభించిన ఆర్థిక దోపిడీ విధానాల వల్ల రాష్ట్రానికి రూ. 76,795 కోట్ల ఆదాయం తగ్గిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేయడంతో పెట్టుబడులు తగ్గిపోయాయని పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమవేశాల చివరి రోజున గత ప్రభుత్వ ఆర్థిక అవకతవలకపై శ్వేతపత్రాన్నివిడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019-24 మధ్య రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిందని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులన సైతం మళ్లించారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్న పెండింగ్ బిల్స్ రూ.1.35 లక్షల కోట్లుగా ఉన్నాయన్నారు.
మొత్తం బాకీలు పెట్టి, దోచుకుని జగన్ రెడ్డి వెళ్ళిపోయాడని, ఈ భారం మొత్తం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పై పడిందని ఆరోపించారు. పంచాయతీలకు వెళ్లాల్సిన నిధులను దారి మళ్లించారని, ప్రభుత్వ ఆస్తులను, విశాఖలో ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టారని విమర్శించారు.డ్వాక్రా మహిళల నిధులను కొట్టేశారన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం రూ.11,762 కోట్లు కేటాయించామని, టీడీపీ అధికారంలో కొనసాగి ఉంటే 2021 నాటికి పోలవరం పూర్తయ్యేదన్నారు. పోలవరం పూర్తయి ఉంటే ఏపీకి రూ. 45 వేల కోట్ల ఆదాయం వచ్చేదని వివరించారు.
కేంద్రం వేసిన ఎక్సఫర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ప్యారలల్‌గా కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని అత్యవసర క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామన్నారు. దీంతో రూ. 990 కోట్లు దీనికోసం ఖర్చే చేయాల్సి వస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. రూ.1667 కోట్లు ఖర్చు చేసి పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేశామని, పట్టిసీమ పూర్తి చేయడం వల్ల రూ.44 వేల కోట్ల ఆదాయం వచ్చిందని, నాకు పేరొస్తుందని అయిదేళ్ల పాటు పట్టిసీమను ఆపరేట్ చేయలేదని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
అమరావతి కొనసాగి ఉంటే 3లక్షల కోట్ల ఆస్తి..7లక్షల ఉద్యోగాలు వచ్చేవి
రాజధాని అమరావతిని కొనసాగించి ఉంటే విశ్వనగరంగా అభివృద్ధి చెందేదని, రూ. 3లక్షల కోట్ల ఆస్తి , 7 లక్షల ఉద్యోగాలు వచ్చేవని బాబు పేర్కొన్నారు. అమరావతిని టీడీపీ చేపట్టిన స్పీడ్‌లో కొనసాగించే ఉంటే ఆర్టీఫిషియల్ ఇంటిలలిజెన్స్ సిటీ గా తయారై ఉండేదని.. కానీ దాన్ని దుర్మార్గులు దెబ్బతీసేలా వ్యవహరించారన్నారు. ఒక్క వివాదం లేకుండా అమరావతికి 30వేల మంది రైతులు 34,400 ఎకరాలు ఇచ్చారని పేర్కొన్నారు. న్యూ ఎపిక్ సెంటర్ గ్రోత్ అమరావతి… ఈ ప్రాజెక్టును చూస్తే కొత్తనగరాలు ఆవశ్యకత ఎంతో ఉందని చంద్రబాబు తెలిపారు. గతంలో హైదరాబాద్ అంటే పాకిస్ధాన్ హైదరాబాదా?.. ఇండియా హైదరాబాదా? అని అడిగేవారని చంద్రబాబు అన్నారు. ఇప్పడు హైదరాబాద్ అంటే ఇండియాలోని హైదరాబాద్ మాత్రమే అని అందరూ గుర్తించారన్నారు.అమరావతికి పూర్వ వైభవం తీసుకొస్తాం.
భారీగా తగ్గిన గ్రోత్ రేటు
ఏపీకి ఆదాయ వనరులు భారీగా తగ్గాయని, వృద్ధిరేటు 13.5 నుంచి 10. 5 శాతానికి పడిపోయిందని వెల్లడించారు. 2014-19 మధ్య తలసరి ఆదాయం 13. 2 శాతం పెరిగిందన్నారు. పరిశ్రమల్లో 7.72లక్షల ఉద్యోగాలు సృష్టించామని, వేగంగా అభివృద్ధి చెందే రాష్ట్రాల్లో రెండో స్థానంలో నిలిచామని, తలసరి ఆదాయం 13.2 శాతానికి తీసుకురాగలిగామని గుర్తు చేశారు. 2 019 ప్రారంభం నుంచి ఇప్పటికి చాలా అధ్వాన్న మైన పరిస్ధితికి వచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. 5.7 శాతం వ్యవసాయ గ్రోత్ రేట్ అయిదేళ్లలో తగ్గిపోయిందన్నారు. సర్వీస్ సెక్టార్ సుమారు 2 శాతం తగ్గిందన్నారు. గ్రోత్ రేట్ 3శాతం తగ్గిపోయిందన్నారు. దీంతో జీఎస్ఓపీ కంట్రిబ్యూషన్ రూ.6.94 లక్షల కోట్లు తగ్గింది.
రాష్ట్రానికి వచ్చే ఆదాయం కూడా 76, 195 కోట్లు తగ్గిపోయింది. పవర్ సెక్టార్ లోనే లక్షా 29 వేల కోట్లు అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి వీరి నిర్వాకం వల్ల వచ్చిందన్నారు.సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీంలు ఉపయోగిచుకోకుండా ఉండడంతో నిధులు నిలిచిపోయాయన్నారు. వరుసగా విద్యుత్తు, ఆర్టీసీ, టాక్స్‌లు, ఇసుక, చెత్తపన్నులు కూడా వేశారన్నారు. 2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్‌ను నిలిపామని సీఎం చంద్రబాబు అన్నారు.
పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించామని.. రూ.18లక్షల కోట్లకు ఎంవోయూలు కుదుర్చుకున్నామని చెప్పారు. రూ.5 లక్షల కోట్లతో పరిశ్రమల పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయని చెప్పారు. రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. తలసరి అప్పు రూ.1.44లక్షలుగా ఉందని చెప్పారు. ఇది టీడీపీ హయాంలో 74,790 ఉండేదన్నారు. రాష్ట్ర అప్పు వైసీపీ పాలనలో డబుల్ అయ్యందని చంద్రబాబు పేర్కొన్నారు.
2014-19 టీడీపీ హయాంలో రాష్ట్రాభివృద్ధి కోసం కొత్త పోర్టులు ప్రారంభించామని వివరించారు. ఏపీకి సుదీర్ఘ తీర ప్రాంతం ఉండడం కలిసి వచ్చే అంశమని అన్నారు. విజయవాడ, రాజమహేంద్రవరం, తిరుపతి, కడప విమానాశ్రయాలు అభివృద్ధి చేశామని, రాష్ట్రంలో 8 లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చామని తెలిపారు. విశాఖ-చెన్నె – బెంగళూరు పారిశామిక కారిడార్లను అభివృద్ధి చేశాం.
అడ్డగోలుగా నిధుల మళ్లింపు.. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు
ఇసుక అక్రమాల ద్వారా రాష్ట్రానికి రూ.7వేల కోట్లు, గనుల దోపిడీ ద్వారా రూ.9,750 కోట్ల నష్టం జరిగిందని చంద్రబాబు వెల్లడించారు. పోలవరం పూర్తయి ఉంటే రూ. 45వేల కోట్ల ఆదాయం వచ్చేదన్నారు. గత ప్రభుత్వం కేంద్ర పదకాలను సరిగా వినియోగించలేదు. స్థానిక సంస్థలకు కేంద్రం కేటాయించిన నిధులను మళ్లించారు. స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు చేశారు. 33 విభాగాల్లో ఉన్న రూ.4,700 కోట్లు మళ్లించారు. స్పెషల్ మార్టిన్ పేరుతో రూ.20,676 కోట్లు ఏపీఎస్ సీఎల్ కు మళ్లించారు.
ఏఆర్‌ఈటీ పెట్టి రూ.14.275 కోట్లు మళ్లించారు. 15 ఏళ్ల ఆదాయం మళ్లీంచేందుకు ఏఆర్‌ఈటీ పెట్టారు విశాఖపట్నంలో ఒక వెయ్యి 942 కోట్ల విలువైన ఆస్తులు తాకట్టు పెట్టారని తెలిపారు. దాదాపు రూ.40వేల కోట్ల విలువైన ఆస్తులను కబ్జా చేశారని, స్థానిక సంస్థల నుంచి రూ.3142 కోట్లు, డిస్కంల నుంచి రూ.266 కోట్లు, ప్రభుత్వ ఉద్యోగుల సేవింగ్స్ రూ.5,243 కోట్లు మళ్లించారని చంద్రబాబు వివరించారు.
అభివృద్ధి చేస్తే తెలంగాణతో సమానంగా పురోగతి
రాష్ట్ర విభజన జరిగినప్పుడు చాలా సమస్యలు వచ్చాయని, గతంలో పించన్లు కూడా రావనే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా గతంలో సంక్షేమానికి బడ్జెట్లో 34 శాతం ఖర్చు చేశామని, రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలు చాలా తక్కువగా ఉన్నాయని, దీంతో ఆదాయం తక్కువ వస్తోందని చంద్రబాబు పేర్కోన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్‌లో ఏపీకి 46 శాతం, తెలంగాణకు 54 శాతం ఆదాయం వచ్చిందని, కంపెనీలు, ఆస్తులు హైదరాబాద్‌లో ఉండిపోయాయన్నారు. పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సమస్యలు పరిష్కారం కాలేదని, సేవల రంగం అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందన్నారు. సేవల రంగం తెలంగాణకు వెళ్లి ఏపీకి వ్యవసాయం వచ్చిందన్నారు. రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉండటం కలిసివచ్చే అంశమని, అభివృద్ధి చేస్తే ఏపీ కూడా తెలంగాణతో సమానంగా ముందుకెళ్తుందన్నారు.
ధైర్యముంటే జగన్ అసెంబ్లీకి రావాలి
అబద్ధాలు పునాదుల మీదే పుట్టిన వైసీపీ పార్టీ అబద్ధాలపైనే బతుకుతుందని చంద్రబాబు విమర్శించారు. ఢిల్లీకి వెళ్లి రాష్ట్రం పరువు తీసేలా ఏపీలో వింధ్వంస రాజకీయాలు సాగుతున్నాయని అబద్ధాలు చెబుతు దొంగ ఏడుపులు ఎందుకని జగన్‌ను ప్రశ్నించారు. ప్రతిపల్లెలో లా అండ్ ఆర్డర్ పై చర్చ పెడదామని, చనిపోయిన వారి 36 మంది పేర్లు ఇవ్వాలంటే ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. ఎవరైనా తప్పు చేస్తే శిక్ష తప్పదని ఎవరినీ వదిలి పెట్టేది లేదని, వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. ధైర్యం ఉంటే జగన్ అసెంబ్లీకి రావాలని, అసెంబ్లీకి రాకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముచ్చుమర్రి ఘటనలో నిందితులను ఇప్పటికే అరెస్టు చేశామన్నారు.