చెరువులో ఈత‌కు వెళ్ల‌గా.. బాలుడి నోట్లోకి దూరిన చేప‌.. చివ‌ర‌కు ఏమైందంటే..?

ఎండాకాలం నేప‌థ్యంలో పిల్ల‌లంద‌రూ బావుల్లో, చెరువుల్లో ఈత‌కు వెళ్తుంటారు. ఈత‌కు వెళ్లిన‌ప్పుడు ప్ర‌మాదాల‌కు గుర‌వుతూనే ఉంటారు. అయితే ఓ చెరువులో ఈత‌కు వెళ్లిన బాలుడి నోట్లోకి అనుహ్యంగా చేప దూరింది.

  • Publish Date - March 30, 2024 / 03:08 AM IST

రాయ్‌పూర్ : ఎండాకాలం నేప‌థ్యంలో పిల్ల‌లంద‌రూ బావుల్లో, చెరువుల్లో ఈత‌కు వెళ్తుంటారు. ఈత‌కు వెళ్లిన‌ప్పుడు ప్ర‌మాదాల‌కు గుర‌వుతూనే ఉంటారు. అయితే ఓ చెరువులో ఈత‌కు వెళ్లిన బాలుడి నోట్లోకి అనుహ్యంగా చేప దూరింది. ఈ ఘ‌ట‌న చ‌త్తీస్‌గ‌ఢ్‌లోని జాంజ్‌గీర్ చంపా జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. జాంజ్‌గీర్ చంపా జిల్లా క‌రుమ‌హు గ్రామానికి చెందిన స‌మీర్ సింగ్ గోడ్(14) అనే బాలుడు త‌న స్నేహితుల‌తో క‌లిసి చెరువులోకి ఈత‌కు వెళ్లాడు. ఇక ఈత కొడుతూ ఒక్క‌సారిగా నీటిలో మునిగాడు. అంత‌లోనే బాలుడి నోట్లోకి చేప దూరింది. దీంతో ఆందోళ‌న‌కు గురైన బాలుడు ఒడ్డుకు చేరుకుని స్నేహితుల‌కు చెప్పాడు.

గ్రామ‌స్తులు ఆ బాలుడి గొంతులో ఇరుక్కున్న చేప‌ను బ‌య‌ట‌కు తీసేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ విఫ‌లమైంది. దీంతో స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ కూడా చేప‌ను తీసేందుకు ప్ర‌య‌త్నిచంగా, విఫ‌ల‌మ‌య్యారు వైద్యులు. ఇక బాలుడి నోట్లో నుంచి ర‌క్తం రావ‌డం ప్రారంభ‌మైంది. శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా మారింది. దీంతో వైద్యులు.. బిలాస్‌పూర్ సిమ్స్ వైద్యుల‌కు స‌మాచారం అందించి అప్ర‌మ‌త్తం చేశారు.

సిమ్స్‌లో బాలుడికి శ‌స్త్ర చికిత్స నిర్వ‌హించారు. బాలుడి గొంతు ద‌గ్గ‌ర రంధ్రం చేశారు. ఆ త‌ర్వాత గొంతులో ఇరుక్కున్న మూడు ఇంచుల చేప‌ను బ‌య‌ట‌కు తీశారు. ప్ర‌స్తుతం బాలుడు ఆరోగ్యంగా ఉన్నాడ‌ని, ఎలాంటి ప్ర‌మాదం లేద‌ని వైద్యులు తేల్చారు.

Latest News