డబ్ల్యూటీవోతో ధనిక దేశాలకే మేలు.. భారత్‌ బయటకు రావాలి

ధనిక దేశాల ప్రయోజనాలకు ఉపయోగపడే ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నుండి బయటికి రావాలని రైతు కార్మిక సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

  • Publish Date - February 26, 2024 / 01:39 PM IST

డబ్ల్యూటీవో వచ్చిన దగ్గర నుంచి ధ్వంసమైన పేద దేశాలు

రైతు వ్యతిరేక విధానాలను మోదీ విరమించుకోవాలి

వరంగల్ జిల్లాలో రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ధనిక దేశాల ప్రయోజనాలకు ఉపయోగపడే ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) నుండి బయటికి రావాలని రైతు కార్మిక సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం), కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వరంగల్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు.. 164 దేశాలతో కూడిన డబ్ల్యూటీవోలో ధనిక దేశాలదే ఆధిపత్యమని, వాటి కనుసన్నలలోనే పేద దేశాల ప్రభుత్వాలు నడుచుకుంటున్నాయని విమర్శించారు. డబ్ల్యూటీవో 1995లో ఏర్పడిన నాటి నుండి నేటి వరకు పేద దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయని చెప్పారు. ఇందులో మన దేశం కూడా ఒకటని అన్నారు.


డబ్ల్యూటీవో 13వ శిఖరాగ్ర సమావేశాలు సోమవారం నుంచి 29వ తేదీ వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశంలోని అబుదాబిలో జరగబోతున్నాయని, అందులో భారత ప్రభుత్వ ప్రతినిధులు ధనిక దేశాలకు అనుకూలమైన సంతకాలు చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని కనీస మద్దతు ధర హక్కు చట్టం కోసం రైతులు పోరాడుతుంటే, దాన్ని నిలువరిస్తున్నది ఈ ధనిక దేశాలేనని తెలిపారు. దేశ రైతాంగం పండించిన పంటలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసి, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకు అందించేవని గుర్తు చేశారు. నేడు ఈ వ్యవస్థను రద్దుచేసి, వారి ఖాతాల్లో డబ్బులు వేయాలని చూస్తున్నారని, దీనివల్ల రైతాంగం పండించిన ధాన్యం అమ్మకాలు జరుగక, వారి పరిస్థితి దుర్భరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.


స్వేచ్ఛ వాణిజ్యం పేరున ధనిక దేశాలలో పండించిన ధాన్యం మనదేశంలోకి దిగుమతి అయితే దేశీయ మార్కెట్లు దెబ్బతింటాయని, రైతుల పరిస్థితి అధ్వాన్నంగా మారుతుందని స్పష్టం చేశారు. అందువల్ల కేంద్రం అనుసరించే రైతు వ్యతిరేక విధానాలపై పోరాటాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, రాచర్ల బాలరాజు, వీరగోని శంకరయ్య, కోరబోయిన కుమారస్వామి, ఓదెల రాజయ్య, సుధమల్ల భాస్కర్, కార్మిక సంఘాల నాయకులు నర్రా ప్రతాప్, గన్నారపు రమేష్, ముక్కెర రామస్వామి, గంగుల దయాకర్, పసునూరి రాజు, ఎండి బషీర్, జన్నారం రాజేందర్, ఎండి పాషా, సంగతి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

Latest News