Site icon vidhaatha

‘ధ‌ర‌ణి’ తెచ్చిన తంటా: TRS ఎంపీటీసీ ఆత్మహత్యాయత్నం

విధాత: గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారం కోసం నిత్యం ఎక్కడో చోట నిరసన సెగలు రేగుతున్నాయి. ధరణి రాకతో ఈ సమస్యలు మరింత జఠిలమవుతుండగా సామాన్యుల ఆశక్తత కబ్జాదారులకు అలుసుగా మారి భూ రికార్డుల తారుమారుతో పేదలు, దళితులు, గిరిజనుల భూములు అన్యాక్రాంతమైపోతున్నాయి.

తాజాగా పెదవూర మండలం చలకుర్తి శివారులోని కుంకుడు చెట్టు తండా గిరిజనుల భూములను శాగం ఈశ్వరమ్మ అనే వ్యక్తి కబ్జా చేసిందని ఆరోపిస్తూ బాధిత గిరిజన రైతులు గురువారం సాగర్ నల్గొండ రహదారిపై రాస్తారోకోతో నిరసన వ్యక్తం చేశారు. 42 ఎకరాల భూమిని సర్వే చేసి తమ భూములు తమకు ఇప్పించాలని డిమాండ్ చేశారు.

మరోవైపు సూర్యాపేట జిల్లా తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఏకంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన చివ్వెంల ఎంపీటీసీ ధరావత్ బుచ్చమ్మ కుటుంబ సభ్యులు కబ్జాకు గురైన తమ భూమిని తమకు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ పురుగుల మందు తాగి పెట్రోల్ పోసుకొని తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నంతో నిరసన తెలిపారు.

ధరావత్ హరి పేరుతో ఉన్న భూమిని రఫీ అనే వ్యక్తి ఆక్రమించి తమను ఇబ్బందుల పాలు చేశాడని, న్యాయం చేయాలని తహశీల్దార్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. దీంతో చేసేదేం లేక ఆవేద‌నతో ఆత్మహత్యా య‌త్నంతో నిరసన తెలిపారు. ఈ ఘ‌ట‌న గ్రామాల్లో భూ సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయో నిదర్శనంగా నిలిచింది.

Exit mobile version