Health Tips | ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్ గడుపుతున్నారు. విశ్రాంతి తీసుకునేందుకు సమయం దొరక్క చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. తద్వారా అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయి. మానసిక ఒత్తిడికి గురయ్యే వారు.. కుంకుమ పువ్వు నీళ్లను తాగితే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ పానీయంతో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందొచ్చని పేర్కొంటున్నారు.
పురాతన కాలం నుంచి కూడా గర్భిణులు కుంకుమ పువ్వును పాలతో కలిపి తీసుకుంటారు. ఇలా కుంకుమ పువ్వుతో కలిపిన పాలను తాగడం వల్ల పుట్టబోయే పిల్లలు మంచి కలర్‌లో పుడుతారని నమ్మకం. కుంకుమ పువ్వును ఔషధాల్లో విరివిగా వినియోగిస్తారు. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మానసిక శ్రేయస్సుని పెంపొందిస్తుంది. అందుకే ప్రతి రోజు కుంకుమ పువ్వును నీటిలో కలుపుకుని తాగితే అనేక ప్రయోజనాలు పొందొచ్చు.
కుంకుమ పువ్వులో నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మెదడు కణాలని ఆరోగ్యంగా ఉంచి పునరుత్పత్తి చేయడంలో సహాయపడుతాయి. మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తాయి. నిరాశ, ఆందోళన వంటి లక్షణాలని తగ్గించడంలో సహాయపడుతుంది.
కుంకుమ పువ్వును నీటితో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడంలోనూ సహాయపడుతోంది. ఉదయం కాఫీ, టీ తాగడానికి బదులుగా కుంకుమ పువ్వు నీటిని తాగితే ఆరోగ్యానికి కూడా మంచిది.
కుంకుమ పువ్వు పానీయం బరువు తగ్గడంలో కూడా సహాయపడుతోంది. చిరుతిండి తినాలనే కోరిక కూడా తగ్గిపోతోంది. శరీరంలో కొవ్వు తగ్గడానికి కూడా కుంకుమపువ్వు సహాయపడుతోంది.
కుంకుమ పువ్వులో యాంటీ ఇన్‌ఫ్లమేటరి లక్షణాలు ఉన్నాయి. గోరు వెచ్చని నీటిలో కుంకుమ పువ్వు వేసుకుని తాగడం వల్ల శరీరంలోని మంటని తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలోని దీర్ఘకాలిక మంట నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
కుంకుమ పువ్వును గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవడం వల్ల రుతుస్రావంలో వచ్చే తిమ్మిరి లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతోంది.
కుంకుమ పువ్వు పానీయానికి ఏం కావాలంటే..?
కుంకుమపువ్వు- 5,6 రేకులు
దాల్చిన చెక్క- ఒక అంగుళం ముక్క
యాలకులు- రెండు
బాదం- 4 లేదా 5
తేనె
తయారీ విధానం
మొదటగా ఓ పాత్ర తీసుకోవాలి. దాంట్లో దాల్చిన చెక్క, కుంకుమ పువ్వు, యాలకులు వేసి నీటిలో ఐదు నిమిషాల పాటు మరిగించాలి. నీరు చల్లారిన తర్వా వాటిని వడకట్టి తేనే కలపాలి. చివరగా బాదం పప్పు పొడిని వేసుకుని తాగాలి. అయితే వేడి నీటిలో తేనే కలపడం వల్ల విషపూరితం అవుతుంది. కాబట్టి పొరపాటున కూడా ఆ పని చేయొద్దు.