Errabelli Dayaker Rao | ఎర్రబెల్లి దయాకర్ రావు.. ఈ పేరు అందరికీ సుపరిచితమే. దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గంలో పసిపిల్లాడి నుంచి ముసలి వాళ్ల వరకు ఆయనకు ఫాలోయింగ్ ఉంటుంది. చిన్నా, పెద్దా, కులం, మతం అనే భావన లేకుండా అందర్నీ కలుపుకుపోతుంటారు. ఎమ్మెల్యే అనే ఫీలింగ్ లేకుండా.. కూలీలతో కలిసి మమేకమై పోతుంటారు. వరినాట్లు వేస్తుంటారు. కూలీల చద్దిమూట తిని ఐ యామ్ మాస్ లీడర్ అని నిరూపించుకుంటుంటారు ఎర్రబెల్లి దయాకర్ రావు. అంతేకాదు.. తన మద్దతుదారుల్లో ఎవరూ చనిపోయినా.. వారి పాడె మోసి అభిమానాన్ని చాటుకుంటారు. అలా అందరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ఎర్రబెల్లి.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రముఖ రాజకీయ నాయకుల్లో ఎర్రబెల్లి ఒకరు. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులు కూడా. ప్రస్తుతం పాలకుర్తి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న దయాకర్ రావు ఇప్పటి వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. దయాకర్ రావు టీడీపీ తరపున ఐదుసార్లు, ఒకసారి టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఏడోసారి పోటీలో ఉన్నారు. గతంలో ఒకసారి ఎంపీగా కూడా గెలుపొందారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ఏడోసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారా..? యతిరాజారావు రికార్డు బ్రేక్ చేయబోతున్నారా..? అని పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు.
ఎర్రబెల్లి దయాకర్ రావు రాజకీయ నేపథ్యం..
ఎర్రబెల్లి తన రాజకీయ ప్రస్థానాన్ని 1982లో ప్రారంభించారు. తెలుగు దేశం పార్టీలో చేరిన ఆయన 1987లో కల్లెడ సొసైటీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై వరంగల్ డీసీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1994 సాధారణ ఎన్నికల్లో తొలిసారి వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999, 2004లో వరుసగా వర్ధన్నపేట శాసనసభ్యులుగా విజయం సాధించారు. 2008లో వరంగల్ పార్లమెంట్‌కు జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా వర్ధన్నపేట ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానంగా మారింది. అప్పటి వరకు ఉన్న చెన్నూరు నియోజకవర్గం పాలకుర్తిగా అవతరించింది. 2009 సాధారణ ఎన్నికల్లో దయాకర్ రావు పాలకుర్తి నుంచి పోటీ చేసి నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో 5వ సారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం, 2016లో ఫిబ్రవరి 25న టీఆర్‌ఎస్‌లో చేరారు. 2018లో పాలకుర్తి నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి 53,062 ఓట్ల భారీ మెజార్టీతో 6వ సారి ఎమ్మెల్యేగా గెలిచి డబుల్ హ్యాట్రిక్ కైవసం చేసుకున్నారు. 2019 ఫిబ్రవరి 19న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన రాజకీయ జీవితంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టడం బీఆర్ఎస్ గవర్నమెంట్‌లోనే తొలిసారి. గతంలో టీడీపీలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ మంత్రి పదవి వరించలేదు.
చెన్నూరు నియోజకవర్గం చరిత్ర ఇదే..
పాలకుర్తి నియోజకవర్గం గతంలో చెన్నూరు పేరుతో ఉండేది. 1957లో చెన్నూరు నియోజకర్గం ఏర్పడింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా చెన్నూరు రద్దయి.. పాలకుర్తి నియోజకవర్గంగా అవతరించింది. ఇక చెన్నూరు నియోజకవర్గానికి 12 సార్లు ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్, కాంగ్రెస్(ఐ) అభ్యర్థులు ఐదుసార్లు గెలుపొందగా, టీడీపీ నాలుగుసార్లు, సోషలిస్ట్, పీడీఎఫ్, ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక్కోసారి విజయం సాధించారు. 1957 ఎన్నికల్లో పీడీఎఫ్ నుంచి కే వెంకటకృష్ణ ప్రసాద్.. కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ యతిరాజారావుపై గెలుపొందారు. 1962లో సోషలిస్టు పార్టీ నుంచి యతిరాజారావు.. కాంగ్రెస్ అభ్యర్థి ఎం వెంకట్రామయ్యపై విజయం సాధించారు. 1967లో ఎన్. విమలాదేవి(కాంగ్రెస్), 1972లో కే మధుసూదన్ రెడ్డి(ఇండిపెండెంట్), 1975లో యతిరాజారావు(ఉప ఎన్నికలో ఏకగ్రీవం) గెలుపొందారు. ఇక 1978 నుంచి 1994 వరకు వరుసగా ఐదుసార్లు యతిరాజారావు ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వచ్చారు. 1999లో టీడీపీ నుంచి ఎన్ సుధాకర్ రావు, 2004లో దుగ్యాల శ్రీనివాస్ రావు(కాంగ్రెస్) గెలుపొందారు. 2009లో చెన్నూరు పాలకుర్తిగా మారిన తర్వాత.. 2009, 2014, 2018 ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు విజయం సాధిస్తూ వచ్చారు. వర్ధన్నపేట నుంచి మూడుసార్లు, పాలకుర్తి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయాన్ని అందిపుచ్చుకున్న ఎర్రబెల్లి ఏడోసారి అసెంబ్లీకి పోటీ పడుతున్నారు. గతంలో చెన్నూరు నుంచి ఏడుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన యతిరాజారావు రికార్డును ఇప్పుడు ఎర్రబెల్లి రికార్డు చేయబోతున్నారా..? అనే విషయం తేలాలంటే డిసెంబర్ 3వ తేదీ వరకు ఊపిరి బిగపట్టాల్సిందే.