బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కు వ్యతిరేకంగా నియోజకవర్గ వాసులు పెద్ధ ఎత్తున హైదరాబాద్ కు తరలివచ్చి తమ నిరసన తెలిపారు. కాంగ్రెస్ నేత నర్సారెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో గజ్వేల్ వాసులు, కాంగ్రెస్ శ్రేణులు సిద్ధిపేట నుంచి పాదయాత్రగా హైదరాబాద్ చేరుకున్నారు. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. అసెంబ్లీకి రాని, నియోజవర్గం ప్రజలకు అందుబాటులో లేని కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని వినతి పత్రం అందించారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, వివిధ మండలాలకు చెందిన ప్రజలు పెద్ధ సంఖ్యలో తరలిరావడం అందరిని విస్మయానికి గురి చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన అనంతరం వారంతా రాజ్ భవన్ కు బయలుదేరారు. కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్ కు వినతి పత్రం సమర్పించారు. ఇటీవల బీజేపీ ఆధ్వర్యంలో గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంపు ఆఫీస్ కు టూ లెట్ బోర్డు తగిలించి.. వాంటెడ్ గజ్వేల్ ఎమ్మెల్యే..అంటూ తమ నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. మొత్తం మీద కేసీఆర్ కు వ్యతిరేకంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేపట్టిన కార్యక్రమాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.