Site icon vidhaatha

భార‌త్ జోరుకి అడ్డుక‌ట్ట వేసిన రూట్..తొలి రోజు విశేషాలేంటంటే..!

ఇంగ్లండ్‌తో భార‌త్ ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడుతుండ‌గా, ఈ రోజు నుండి నాలుగో టెస్ట్ మొద‌లైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌కి భార‌త బౌల‌ర్స్ చుక్కలు చూపించారు. భారత అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ మూడు వికెట్లతో సత్తా చాటడంతో 112 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు కష్టాల్లో పడింది ఇంగ్లండ్‌. ఆ స‌మ‌యంలో స్టార్ బ్యాటర్ జో రూట్ ఎట్టకేలకు బజ్‌బాల్ అప్రోచ్‌కు గుడ్‌బై చెప్పి తన సహజ శైలికి తగ్గట్లు అసలు సిసలు టెస్ట్ బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్‌కి గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు అందించాడు. ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. జో రూట్ తన 31వ టెస్టు సెంచరీని సాధించి నాటౌట్‌గా మిగ‌ల‌గా, ఆలీ రాబిన్సన్ క్రీజులో ఉన్నాడు.

జో రూట్ 106 పరుగులు చేయ‌గా, భారత్‌పై టెస్టులో 10వ సెంచరీని నమోదు చేశాడు. దీంతో టీమిండియాపై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కూడా జో రూట్ ఓ రికార్డ్ నెల‌కొల్పాడు. ఇప్ప‌టి వ‌రకు భార‌త్‌పై అత్య‌ధిక టెస్ట్ సెంచ‌రీలు చేసిన ఘ‌న‌త ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్‌(9 సెంచరీలు) పై ఉంది. దానిని జోరూట్ అధిగ‌మించాడు. అయితే ఈ మ్యాచ్‌లో భార‌త్ బౌల‌ర్స్ మొద‌ట్లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శన చేసార‌ని చెప్పాలి. భారత్ తరపున అరంగేట్రం ఆడుతున్న ఆకాశ్ దీప్ 3 వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ తీశారు.

నాలుగో టెస్ట్‌లోను బజ్‌బాల్ అప్రోచ్‌తో బ్యాటింగ్ చేసిన జాక్ క్రాలీ(42), బెన్ డక్కెట్(11), ఓలి పోప్(0), జానీ బెయిర్ స్టో(38), బెన్ స్టోక్స్(3) దారుణంగా విఫ‌లంగా కాగా, ఇంగ్లండ్‌ని రూట్, ఫోక్స్ ఆదుకున్నారు. ఫోక్స్( 47) ప‌రుగులతో క‌లిసి రూట్ వంద ప‌రుగుల‌కి పైగా భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. ఆరో వికెట్‌కు 113 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్ప‌డంతో ఇంగ్లండ్ మంచి స్కోరు దిశ‌గా ముందుగా సాగుతుంది. ఈ టెస్ట్‌లో భార‌త్ విజ‌యం సాధిస్తే సిరీస్ ద‌క్కిన‌ట్టే. మ‌రి భార‌త్ వ‌రుస విజ‌యాల‌కి ఇంగ్లండ్ అడ్డుక‌ట్ట వేస్తుందా లేకుంటే ఓడి సిరీస్ చేజార్చుకుంటుందో చూడాలి.

Exit mobile version