Site icon vidhaatha

భారీ భద్రతా వైఫల్యం.. పార్లమెంటులో చొరబాటుపై ఎంపీల ఆగ్రహం

న్యూఢిల్లీ: లోక్‌సభలోకి ఇద్దరు వ్యక్తుల చొరబాటు ఘటన భారీ భద్రతా వైఫల్యమని పలువురు లోక్‌సభ ఎంపీలు అన్నారు. పార్లమెంటు భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. లోక్‌సభలోకి ఆగంతకులు చొరబడుతుంటే భద్రతా అధికారులు ఏం చేస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీ అధిర్‌ రంజన్‌ చౌదరి ప్రశ్నించారు. 2001లో పార్లమెంటుపై దాడి ఘటనలో చనిపోయిన యోధులకు ఇదే రోజు నివాళులర్పించాం. ఇదే రోజు పార్లమెంటు లోపల మరో దాడి జరిగింది’ అన్నారు.


మనం ఉన్నతస్థాయి భద్రతా వ్యవస్థ నిర్వహణలో వైఫల్యం చెందామని ఇది రుజువు చేస్తున్నా? అని ఆయన ప్రశ్నించారు. ‘ఎంపీలందరూ సాహసంతో వారిద్దరినీ పట్టుకున్నారు. ఇదంతా జరుగుతుంటే భద్రతా సిబ్బంది ఎక్కడున్నారు?’ అని ఆయన ప్రశ్నించారు. ఇది చాలా తీవ్రమైన అంశమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఇది కేవలం లోక్‌సభకో, రాజ్యసభకో పరిమితమైన అంశం కాదని, అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఇద్దరు వ్యక్తులు లోనికి ఎలా ప్రవేశించగలిగారన్నదే ప్రశ్న అని ఆయన అన్నారు. ఇదొక భయానక అనుభవమని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సుదీప్‌ బందోపాధ్యాయ చెప్పారు.


‘చొరబడినవారి లక్ష్యమేంటో, వాళ్లు ఎందుకు చేస్తున్నారో ఎవరికీ అర్థం కాలేదు. ఘటన అనంతరం మేం సభనుంచి బయటకు వచ్చేశాం. కానీ.. ఇది భద్రతా వైఫల్యమే. పొగను వదిలే పరికరాలతో వారు సభలోకి ఎలా రాగలిగారు?’ అని ఆయన ప్రశ్నించారు. ఇది అతిపెద్ద భద్రతా వైఫల్యమని, దీనిపై తగిన విచారణ జరిపించాలని రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ ఎంపీ హనుమాన్‌ బేనివాల్‌ డిమాండ్‌ చేశారు. భద్రతా వైఫల్యానికి బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.

Exit mobile version