గత సర్కార్‌ ధ‌ర‌ణిలో తిర‌స్క‌రించిన‌ దర‌ఖాస్తులు ఎన్నో తెలిస్తే షాకే!

ధ‌ర‌ణిలో వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు దాదాపు 5 ల‌క్ష‌ల వ‌ర‌కు గ‌త ప్ర‌భుత్వంలో అధికారులు తిరస్కరించారని సమాచారం.

  • Publish Date - March 4, 2024 / 03:00 PM IST

  • ఒక్కో ఊరిలో వంద‌ల‌ స‌మ‌స్య‌లు.. నిద‌ర్శ‌నంగా యాచారం మండ‌లం
  • ఇక్క‌డ‌ పెండింగ్‌లో ఉన్నవి 2550.. ద‌ర‌ఖాస్తు చేయ‌నివి మ‌రో 2 వేలు!
  • వెయ్యి రూపాయలు కట్టలేక కొందరు.. పరిష్కారంపై న‌మ్మ‌కం లేక మరికొందరు
  • స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్న సర్కార్‌.. ఎమ్మార్వో ఆఫీసులకు రైతుల వెల్లువ

విధాత‌: ధ‌ర‌ణి రైతును ద‌గా చేసింది. సులువుగా ప‌రిష్క‌రించాల్సిన టెక్నాల‌జీ కాస్తా.. స‌మ‌స్య‌ల‌ను జ‌టిలంగా మార్చింది. ఉచిత సేవ‌లు ఖ‌రీదైన‌విగా మారాయి. ఎంతో కొంత ఖర్చు చేసైనా సరే పరిష్కరించుకుందామని రైతులు దరఖాస్తులు చేసుకుంటే.. వారికి నమ్మకం కూడా కలిగించలేక పోయింది. మ‌రో వైపు ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో ఏ విధంగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలో కూడా చాలా మందికి తెలియ‌దంటే ఆశ్చ‌ర్యపోవాల్సిన ప‌ని లేదు. అయిప్ప‌టికీ రాష్ట్ర రైతులు స‌మ‌స్య తీవ్ర‌త‌ను గుర్తించి, ప‌రిష్కారం చేసుకోవ‌డం దర‌ఖాస్తు చేసుకుంటే వాటిని అప్ప‌టి స‌ర్కారు ఏకప‌క్షంగా తిర‌స్క‌రించింద‌న్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ధ‌ర‌ణిలో వ‌చ్చిన ద‌ర‌ఖాస్తులు దాదాపు 5 ల‌క్ష‌ల వ‌ర‌కు గ‌త ప్ర‌భుత్వంలో అధికారులు తిర‌స్క‌రించ‌డం గ‌మ‌నార్హం. ఇలా తిర‌స్క‌రించిన ద‌ర‌ఖాస్తుల‌ను ఏ కార‌ణంతో తిర‌స్క‌రించారో కూడా చెప్ప‌క‌పోవ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తున్నది.


అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పార్టీ ఇదే అంశాన్ని ప్ర‌ధానంగా తీసుకున్న‌ది. రేవంత్ రెడ్డి ఆనాడు పీసీసీ అధ్య‌క్షుడి హోదాలో ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతూ.. ధ‌ర‌ణిని బంగాళాఖాతంలో క‌లుపుతాన‌న్నారు. ఆ దిశ‌గా ఇప్ప‌డు కాంగ్రెస్ స‌ర్కారు వ‌డివ‌డిగా అడుగులు వేస్తోంది. ధ‌ర‌ణిపై వేసిన క‌మిటీ అధ్యయనం చేస్తూ ఎప్పటికప్పుడు నివేదిక‌లు ఇస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇచ్చిన నివేదిక‌ల ఆధారంగా కాంగ్రెస్ స‌ర్కారు తాసిల్దార్ల‌కు, ఆర్డీవోల‌కు అధికారాలు కల్పిస్తేనే రైతుల స‌మ‌స్య‌లు పరిష్కారం అవుతాయని గుర్తించి.. ఆ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకున్న‌ది. ఫ‌లితంగా ఎమ్మార్వో కార్యాల‌యంలోనే తాసిల్దార్ త‌మ సమస్యను పరిష్క‌రిస్తార‌నే న‌మ్మ‌కం స‌గ‌టు రైతుకు క‌లుగుతున్నది. దీంతో రైతులు ఎమ్మార్వో కార్యాల‌యాల్లో నిర్వహిస్తున్న స్పెషల్‌ డ్రైవ్‌లకు పోటెత్తుతున్నారు.


ధరణికి ముందు అలా..

ధ‌ర‌ణికి ముందు రైతు త‌న‌కు స‌మ‌స్య వ‌స్తే తెల్ల కాగితంపై రాసుకొని తాసిల్దారుకు ద‌ర‌ఖాస్తు ఇస్తే ఏదో ఒక రోజు ప‌రిష్కారం అయ్యేది. చాలామంది రైతులు వీఆర్వోకే త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనే వాళ్లు.. ఇలా వీఆర్వో, తాసిల్దార్ల‌ను క‌లిస్తే త‌మ స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌న్నన‌మ్మ‌కం గ‌తంలో రైతుల‌కు ఉండేది. క్షేత్రస్థాయికి వీఆర్వోనో, ఆర్ఐనో వెళ్లి ద‌ర‌ఖాస్తు దారుడి భూమిని ప‌రిశీలించి, చుట్టు ప‌క్క‌ల విచారించి నివేదిక ఇస్తే తాసిల్దారు నిర్ధారణ చేసుకొని స‌మ‌స్య ప‌రిష్క‌రించే వారు. ఇలా న‌యాపైస ఖ‌ర్చు లేకుండా అయ్యే ప‌నికి నాడు కేసీఆర్ స‌ర్కారు ఖ‌రీదు క‌ట్టింది. ఒక్క ద‌ర‌ఖాస్తు ఖ‌రీదే వెయ్యి రూపాయాలు. దీంతో స‌న్న‌, చిన్నకారు రైతులు ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి కూడా భ‌యపడే ప‌రిస్థితి కేసీఆర్ పాల‌న‌లో ఏర్ప‌డింది. అయినా ధైర్యం చేసి రూ.1000 క‌ట్టి ద‌ర‌ఖాస్తు చేసినా ప‌రిష్కారం కాక‌పోగా రిజెక్ట్ అని మెసేజ్ వ‌చ్చేది. ద‌ర‌ఖాస్తు ఎందుకు రిజెక్ట్ అయిందో కూడా చెప్పే నాధుడు లేని ప‌రిస్థితి. వీఆర్వో లేడు.. తాసిల్దార్ తనకు తెలియ‌దు.. క‌లెక్ట‌ర్‌ను అడుగు అంటాడు! దీంతో రైతు ప‌రిస్థితి దిక్కులేని వాడి చందంగా తయారైంది. ఇలా కేసీఆర్ పాల‌న‌లో రాష్ట్రంలోని 32 జిల్లాలో దాదాపు 5 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు తిర‌స్క‌ర‌ణ‌కు గురైన‌ట్లు ధ‌ర‌ణి క‌మిటీ సభ్యులు చెబుతున్నారు.


పెండింగ్‌లో 2.45 లక్షల దరఖాస్తులు

ధ‌ర‌ణిలో తిర‌స్క‌ర‌ణ‌కు గురైన‌వి కాకుండా పెండింగ్‌లో 2.45 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులు ఉన్నాయి. క‌నీసం వీటినైనా ప‌రిష్క‌రించాల‌న్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ అధికారుల‌తో స్పెష‌ల్ డ్రైవ్ చేయిస్తున్నారు. మ‌రో వైపు ఆ ద‌ర‌ఖాస్తుల‌ను క్షేత్రస్థాయిలో ప‌రిష్కారం అయ్యే విధంగా తాసిల్దార్ల‌కు అధికారాలు కేటాయించారు. దీంతో ద‌రఖాస్తుదారులు తాసిల్దార్ కార్యాల‌యాకు పోటెత్తుతున్నారు. సోమ‌వారం ధ‌ర‌ణి క‌మిటీ స‌భ్యులు మాజీ ఎమ్మెల్యే కోదండ‌రెడ్డి, భూమి సునీల్‌ల‌తో క‌లిసి విధాత ప్ర‌తినిధి యాచారం మండల కార్యాల‌యాన్ని ప‌రిశీలించ‌గా త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని రైతులు పెద్ద ఎత్తున రావడం కనిపించింది. తాసిల్దార్‌ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొన్నారు. ధ‌ర‌ణి క‌మిటీ స‌భ్యుల‌కు రైతులు త‌మ స‌మ‌స్య‌లు వివ‌రించారు.


యాచారం మండంలో ప్ర‌తి గ్రామంలో 100కు పైగా భూమి స‌మ‌స్య‌లున్నాయని వారు తెలిపారు. ఈ మండలంలోని 21 గ్రామాల‌లో 2550 పెండింగ్ ద‌ర‌ఖాస్తులున్నాయి. ఇవి కాకుండా మ‌రో రెండు వేల స‌మ‌స్య‌లు ఉన్న‌ట్లు చెబుతున్నారు. అనేక మంది వేయి రూపాయ‌లు చెల్లించి ద‌ర‌ఖాస్తు చేసినా.. రిజెక్ట్‌ అని మెసేజ్ వ‌స్తుంద‌ని ద‌ర‌ఖాస్తు చేయ‌లేద‌ని చెపుతున్నారు. మ‌రోవైపు కుంట భూమికి కూడా వేయి రూపాయ‌లుపెట్టి ద‌ర‌ఖాస్తు చేయ‌లేక ఊర‌కే ఉన్నామ‌ని అంటున్నారు. ప్ర‌భుత్వం స్పెష‌ల్ డ్రైవ్ పెట్ట‌డంతో త‌మ స‌మ‌స్య‌లు కూడా ప‌రిష్క‌రించాల‌ని ద‌ర‌ఖాస్తు చేయ‌ని రైతులు కూడా వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం పెండింగ్ స‌మ‌స్య‌లే అని అధికారులు చెపుతుండ‌డంతో మీ-సేవ కేంద్రానికి వెళ్లి ధ‌ర‌ణిలో దర‌ఖాస్తు చేసుకుంటున్నారు. అయితే రైతులు నేరుగా తాసిల్దార్లు త‌మ ద‌ర‌ఖాస్తులు తీసుకునే విధంగా అధికారుల‌కు ఆదేశాలు ఇవ్వాల‌ని అంటున్నారు. దేశంలోనే ఎక్క‌డా లేనివిధంగా భూమి ద‌ర‌ఖాస్తుల‌కు రుసుము తీసుకోవ‌డంపై ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. రేవంత్ స‌ర్కారు ద‌ర‌ఖాస్తు రుసుము భారం త‌ప్పించాల‌ని కోరుతున్నారు.

Latest News