ఎన్నికల సంఘానికి ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు అందించిన ఎస్‌బీఐ..

  • Publish Date - March 12, 2024 / 02:34 PM IST

  • వివరాలు బటపడితే కార్పొరేట్లకు ఇబ్బంది
  • వారు బాధితులుగా మారుతారు
  • ప్రెసిడెన్షియల్‌ రిఫరెన్స్‌ కోరాలి
  • రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ చీఫ్‌ లేఖ

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి.. ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను ఎస్‌బీఐ మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. ఈ వివరాల బహిర్గతంతో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి రాజకీయంగా ఇబ్బందికర వాతావరణం ఏర్పడే అవకాశం ఉండటంతోనే లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత అందిస్తామని, అందుకు గడువు ఇవ్వాలని ఎస్‌బీఐ కోరిందనే అభిప్రాయాలు ఉన్నాయి. కానీ.. వివరాలను మంగళవారం పనివేళలు ముగిసేలోపు ఎన్నికల కమిషన్‌కు అందించాలని సుప్రీంకోర్టు విస్పష్టంగా పేర్కొనడంతో ఎస్‌బీఐ ఆ వివరాలను అందించక తప్పలేదు. వివరాలను అందించడం సంక్లిష్టమైన అంశంగా పేర్కొన్న ఎస్‌బీఐ.. గడువు పొడిగించేందుకు సుప్రీంకోర్టు ససేమిరా అనడంతో 24 గంటల వ్యవధిలోనే సమర్పించడం విశేషం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ వివరాలను మార్చి 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తన వెబ్‌సైట్‌లో ప్రదర్శించాల్సి ఉన్నది. ఇప్పటి వరకూ ఈ వివరాలు బయటకు పొక్కకుండా అనేక ప్రయత్నాలు జరిగిన నేపథ్యంలో మిగిలిన రోజుల్లో మరిన్ని డ్రామాలు చోటు చేసుకుంటాయా? లేక ఆ వివరాలన్నీ ప్రజలకు చేరుతాయా? అన్నది చూడాల్సి ఉన్నది. అనామక ఎలక్టోరల్‌ బాండ్ల స్కీం రాజ్యాంగానికి వ్యతిరేకమైనదని, సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు ఫిబ్రవరి 15న తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. 2019 ఏప్రిల్‌ 12వ తేదీ నుంచి కొనుగోలు చేసిన ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను 2024, మార్చి ఆరోతేదీ నాటికి సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌కు సమర్పించాలని అదే తీర్పులో ఆదేశించింది.


ప్రెసిడెన్షియల్‌ రిఫరెన్స్‌ కోరాలి

ఎలక్టోరల్‌ బాండ్ల వివరాల వెల్లడికి అప్పుడే బ్రేక్‌ వేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ చీఫ్‌ అదిశ్‌ సీ అగర్వాల రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. వేర్వేరు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చినవారి కార్పొరేట్‌ల పేర్లు బయటపెట్టడం ద్వారా సదరు వ్యక్తులు బాధితులు అవుతారని అగర్వాల తన లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో ముర్ము ప్రెసిడెన్షియల్‌ రిఫరెన్స్‌ కోరాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే ఈ కేసును మరోసారి పూర్తిస్థాయిలో విచారించి, భారత పార్లమెంటు, రాజకీయ పార్టీలు, కార్పొరేట్లు, సాధారణ ప్రజలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.

Latest News