ఇంగ్లండ్ బెండ్ తీస్తున్న టీమిండియా.. రెండో రోజు భార‌త్‌దే పూర్తి ఆధిప‌త్యం…!

  • Publish Date - January 26, 2024 / 11:39 AM IST

భార‌త్-ఇంగ్లాండ్ మ‌ధ్య జ‌రుగుతున్న ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ హైద‌రాబాద్ వేదిక‌గా జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌కి ముందు ఇంగ్లండ్ హాట్ హాట్ కామెంట్స్ చేసింది. కాని తొలి ఇన్నింగ్స్ లో భార‌త్ బౌలింగ్ ముందు బొక్క‌బోర్లా ప‌డింది. ఇంగ్లాండ్ ను 246 పరుగులకే క‌ట్ట‌డి చేసిన భార‌త్ భారీ స్కోర్ దిశ‌గా ముందుకు సాగుతుంది. ఓవ‌ర్ నైట్ స్కోర్ 119 ప‌రుగుల‌తో బ్యాటింగ్ కి దిగిన భార‌త్ రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఏడు వికెట్ల న‌ష్టానికి 421 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం క్రీజులో ర‌వీంద్ర జ‌డేజా(81 నాటౌట్‌), అక్ష‌ర్ ప‌టేల్ (35 నాటౌట్‌) ఉన్నారు. భార‌త్ కి 175 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. ఇంగ్లండ్ తరపున టామ్ హార్డ్లీ 2, జో రూట్ 2, లీచ్, రేహాన్ తలో వికెట్ పడగొట్టారు.

అయితే ఈ రోజు ఆట మొద‌లు పెట్టిన భార‌త్‌కి తొలి ఓవ‌ర్‌లోనే పెద్ద షాక్ త‌గిలింది. రూట్ బౌలింగ్‌లో రిట‌ర్న్ క్యాచ్ ఇచ్చి జైస్వాల్ ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు.రాహుల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చాడు. ఇంగ్లీష్ స్పిన్ త్ర‌యం జాచ్‌లీక్‌, టామ్ హార్ట్లీ, రెహాన్ అహ్మ‌ద్‌ల‌తో పాటు పార్ట్‌టైమ్ స్పిన్న‌ర్ జోరూట్‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొని ప‌రుగులు చేశాడు. శుభ్‌మ‌న్ గిల్‌తో క‌లిసి మూడో వికెట్ కు 36 ప‌రుగులు జోడించాడు. ఇక నాలుగో వికెట్‌కు శ్రేయ‌స్ అయ్య‌ర్ (35)తో క‌లిసి 64 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు.72 బంతుల్లో కేల్ రాహుల్ హాఫ్ సెంచ‌రీని పూర్తి చేయ‌గా, ఓ అరుదైన ఘ‌న‌త‌ను సాధించాడు. స్వ‌దేశంలో టెస్టుల్లో 1000 ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు.

అర్ధ‌శ‌త‌కం త‌రువాత వేగం పెంచిన రాహుల్ టామ్ హార్ట్లీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు య‌త్నించి రెహాన్ అహ్మద్ క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. త‌న ఇన్నింగ్స్ లో 8 బౌండ‌రీలు, 2 సిక్స‌ర్లు బాదాడు. అత‌నికి ఇది 50 టెస్టు. త‌న 50వ టెస్టులో హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. అలాగే, టెస్టుల్లో ఇంగ్లండ్‌పై రాహుల్‌కు ఇది ఐదో 50 ప్లస్ స్కోరు. ఇక మిగ‌తా బ్యాట్స్‌మెన్ విష‌యానికి వ‌స్తే శ్రేయాస్ అయ్య‌ర్(35). భ‌ర‌త్ (41),రోహిత్ శ‌ర్మ‌(24), గిల్‌(23), అశ్విన్(1) ప‌రుగులు చేశారు. రాహుల్, జ‌డేజా, జైస్వాల్ విలువైన ప‌రుగులు చేయ‌డంతో భార‌త్ రెండో రోజు ఆట ముగిసే స‌మయానికి 421 ప‌రుగులు చేసింది. మ‌రి మూడో రోజు ఇంకెన్ని ప‌రుగులు చేస్తారో చూడాలి.

Latest News