Site icon vidhaatha

హ‌నుమాన్‌ను సింధూరంతోనే ఎందుకు పూజిస్తారు..? ఆ క‌థేంటో తెలుసా..?

హిందువులు అత్యంత భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో హ‌నుమంతుడిని పూజిస్తారు. మంగ‌ళ‌వారం వ‌చ్చిందంటే చాలు తెల్ల‌వారుజామునే మేల్కొని, అభ్యంగ స్నానం చేస్తారు. ఆ త‌ర్వాత ప‌రిశుభ్ర‌మైన వ‌స్త్రాలు ధ‌రించి, ఆంజ‌నేయుడి ఆల‌యాల్లో వాలిపోతారు. హ‌నుమంతుడికి సింధూరం, త‌మ‌ల‌పాకుల‌తో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తారు. అస‌లు ఆంజ‌నేయుడికి సింధూరం రంగునే ఎందుకు పూసి పూజిస్తారు..? మ‌రి ఆ రంగుకు, హ‌నుమంతుడికి మ‌ధ్య ఉన్న బంధ‌మేంటో తెలుసుకుందాం..

హ‌నుమంతుడి విగ్ర‌హం ఎక్క‌డున్నా.. అది సింధూరం(ఆరెంజ్ క‌ల‌ర్) రంగుంలో ద‌ర్శ‌న‌మిస్తోంది. అయితే ఆంజ‌నేయుడి ఈ రంగులో ఉండ‌డం వెనుక పురాణాల్లో ఒక క‌థ ప్ర‌చారంలో ఉంది. రామాయ‌ణం ప్ర‌కారం.. ఒక రోజు వాయు పుత్రుడు సీత‌మ్మ ఉన్న చోటుకు వెళ్తాడు. ఆ స‌మ‌యంలో సీతాదేవి త‌న నుదిటి మీద సింధూరం పెట్టుకుని ఉంటుంది. వెంట‌నే ఆంజ‌నేయుడు.. అమ్మా.. ఏంటి ఆ పొడి..? అని ప్ర‌శ్నిస్తాడు.

వాయుపుత్రుడి ప్ర‌శ్న‌కు సీతాదేవి ఇలా స‌మాధానం ఇస్తుంది. హ‌నుమా.. ఇది సింధూరం. ఇది శ్రీరాముడిని సంతోష‌ప‌రుస్తుంది. అంతేకాకుండా ఆయ‌న‌కు సంప‌న్న‌మైన‌, దీర్ఘాయువును ప్ర‌సాదిస్తుంది.. స‌క‌ల ఐశ్వ‌ర్యాలు కూడా క‌లిగిస్తుంద‌ని ఆంజ‌నేయుడితో సీతాదేవి చెబుతుంది. అందుకే.. తాను పాపిట సింధూరం పెట్టుకుంటాన‌ని చెబుతుంది. ఈ మాటలు విన్న హనుమంతుడు వెంటనే అక్కడి నుంచి అదృశ్యమవుతాడు. ఆ తర్వాత హనుమంతుడు తన శరీరమంతా పూర్తిగా ఎర్రటి సింధూరం రాసుకుని తిరిగి వస్తాడు. శరీరంతో పాటు దుస్తులు, జుట్టును కూడా సింధూరం రంగుతో నింపుకుంటాడు వాయుపుత్రుడు! అది రాలిపోకుండా ఉండేందుకు నువ్వుల నూనె ఉప‌యోగిస్తాడు హ‌నుమంతుడు.

ఇక సింధూరంతోనే ఆంజ‌నేయుడు రాముడి వ‌ద్ద వాలిపోతాడు. ఒంటి నిండా సింధూరం పూసుకున్న వాయుపుత్రుడిని చూసి శ్రీరాముడు ఆశ్చ‌ర్య‌పోతాడు. ఏంటి ఇది అని అడ‌గ్గా.. సీతాదేవి తన నుదిటిన రోజూ సింధూరాన్ని పెట్టుకోవ‌డం వల్ల మీకు(రాముడు) సంతోషం కలుగుతుందని, ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇస్తుందని చెప్పారు. ఒక్క చిటికెడు సింధూరమే మీకు సంతోషాన్నిస్తే.. నేను ఒళ్ళంతా సింధూరం అలంకరించుకుంటే ఇంకా మరింత ఆనందం కలుగుతుంది కదా.. అందుకే రాసుకున్నాను” అని చెబుతాడు.

అప్పుడు హనుమంతుని మాటలకు సంతోషించిన రాముడు.. ఆయన భక్తులకు ఒక వరమిచ్చాడట. ఎవరైతే హనుమంతునికి పూర్తి సింధూరాన్ని పూసి పూజిస్తారో.. వారికి సంతోషకరమైన దీర్ఘాయువుతోపాటు.. కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పాడట. ఈ కారణంగానే హనుమంతుడి ఆలయాలు సింధూరంతో కళకళలాడుతుంటాయని చెబుతున్నారు పండితులు.

Exit mobile version