విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాజ్ భవన్ కు.. పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. గవర్నర్ రాజ్ భవన్ లో ఉండగానే బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు రాజ్ భవన్ లో తనిఖీలు చేపట్టారు. అటు పాతబస్తీ సిటీ సివిల్ కోర్టులో బాంబు పెట్టినట్లుగా బెదిరింపు మెయిల్ రావడంతో కోర్టు సిబ్బంది అప్రమత్తమయ్యారు. చీఫ్ మెజిస్ట్రేట్ కోర్టు కార్యకలాపాలు మూసివేసి తనిఖీలకు అనుమతించారు. దీంతో పోలీసులు డాగ్‌స్వ్కాడ్, బాంబు స్వ్కాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. కోర్టులో ఉన్న న్యాయవాదులను, ప్రజలను బయటకు పంపించారు. కోర్టులో, జడ్జి క్వార్టర్స్ లో, జడ్జి చాంబర్, జింఖానా క్లబ్ లలో నాలుగుచోట్ల నాలుగు ఆర్డీఎక్స్ బాంబులు, ఐఈడీలు పెట్టినట్లు బెదింపు మెయిల్ లో పేర్కొన్నారు.
కోర్టులో పేలుడు జరిగిన తర్వాత 23 నిమిషాల్లో జింఖానా క్లబ్ పేలిపోతుందని హెచ్చరించారు. అబీదా అబ్దుల్లా పేరుతో ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆపరేషన్ సిందూర్ తర్వాతా దేశంలో ఈ తరహా బాంబు బెదిరింపులు అధికమయ్యాయి. అయితే సిటీ సివిల్ కోర్టులో తనిఖీల అనంతరం చివరకు బాంబు బెదిరింపు ఉత్తదేనని తేలినట్లుగా సమాచారం.