విధాత, హైదరాబాద్ : అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిణామాలు బంగారం, వెండి ధరలను కుదిపేస్తున్నాయి. ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్దంతో అనూహ్యంగా పెరిగిపోయిన బంగారం, వెండి ధరలు గంటల వ్యవధిలోనే మళ్లీ భారీగా పతనమయ్యాయి. సోమవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 3,290తగ్గి రూ. 1,69,800కు పడిపోయింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 3,000 తగ్గి రూ. 1,55,650వద్ద కొనసాగుతుంది.
వెండి ధరలు సైతం ఢమాల్
వెండి ధరలు సైతం అమాంతంగా పడిపోయాయి. సోమవారం కిలో వెండి ధర రూ. 10,000తగ్గి రూ. 3,15,000వద్ద కొనసాగుతుంది.
గందరగోళానికి గురి చేస్తున్న ధరలు
గత కొంత కాలంగా ముఖ్యంగా జనవరి 29వరకు ఆల్ టైమ్ రికార్డు ధరలను నమోదు చేసిన బంగారం, ధరలు ఆ తర్వాత హెచ్చతగ్గుల మధ్య కొనసాగుతున్నాయి. అయితే బంగారం ధరలు కొంత పుంజుకున్న దశలో ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్దంతో బంగారం ధరలు అకస్మాత్తుగా పెరిగాయి. పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపడంతో ధరలు పెరుగుతూ వెళ్లాయి. అనూహ్యంగా ఆ మరుసటి రోజు సోమవారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ తగ్గుదల ఇంకా కొనసాగుతుందా లేక మళ్లీ ధరలు పెరుగుతాయా అనే అంశం పసిడి ప్రియులను గందరగోళానికి గురి చేస్తుంది. భారత్ లో శుభకార్యాల సీజన్ కొనసాగుతుండటంతో బంగారం, వెండి ధరలలో కొనసాగుతున్న మార్పులు కొనుగోలుదారులను అయోమయంలో పడేస్తున్నాయి. దీంతో ప్రస్తుతానికి శుభకార్యాలలో అవసరాల మేరకు కొనుగోలును పరిమితం చేస్తున్నారని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
