Site icon vidhaatha

MLA quota MLC election: ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం

MLA quota MLC election: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏకగ్రీవంగా ముగిశాయి. నామినేషన్ల ఉపసంహరణ నాటికి తెలంగాణలోని 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఐదుగురు, ఏపీలోని 5ఎమ్మెల్సీ స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు మాత్రమే బరిలో ఉండటంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఆయా స్థానాల ఎన్నికలు ఏకగ్రీవమైనట్లుగా ప్రకటించారు.

తెలంగాణలో కాంగ్రెస్ నుంచి అద్ధంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్, విజయశాంతి, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ, సీపీఐ మధ్య గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కుదిరిన అవగాహన మేరకు ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని సీపీఐకి కేటాయించారు. ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సభ్యులకు రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి దృవీకరణ పత్రాలు అందించారు.

ఇక ఏపీలో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీలుగా టీడీపీ నుంచి బీటీ నాయుడు, బీద రవిచంద్ర, కావలి గ్రీష్మ, జనసేన నుంచి నాగబాబు, బీజేపీ నుంచి సోము వీర్రాజులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

29తో ముగియ్యనున్న వారి ఎమ్మెల్సీ పదవీ కాలం
తెలంగాణలో ఎమ్మెల్సీలు మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌, శేరి సుభాష్‌ రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్‌ హసన్‌ పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఇందులో బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఎగ్గె మల్లేశం గత ఏడాదే కాంగ్రెస్‌లో చేరారు. మీర్జా రియాజుల్‌ హాసన్‌ మజ్లిస్‌ నేత కాగా, మిగిలిన ముగ్గురు బీఆర్‌ఎస్‌ నేతలు.  అటు ఏపీలో జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, అశోక్‌బాబు, యనమల రామకృష్ణుడుల పదవీకాలం ఈ నెల 29తో ముగియనుంది. దీంతో తెలంగాణలో ఐదు, ఏపీలో ఐదు స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.

Exit mobile version