EPFO | ఈపీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌..! పెళ్లి, చదువులు, గృహవసరాలకు ఆటో క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌

EPFO | చందాదారులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) శుభవార్త చెప్పింది. ఆటో క్లెయిమ్‌ సెటిల్మెంట్‌ను వివాహం, ఉన్నత విద్య, ఇండ్ల కొనుగోలు తదితర అవసరాలకు సైతం విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికార ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగుల క్లెయిమ్స్‌ కోసం సులభమైన పద్ధతిని తీసుకువచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈపీఎఫ్‌ఓ వెల్లడించింది.

  • Publish Date - May 15, 2024 / 11:30 AM IST

EPFO | చందాదారులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) శుభవార్త చెప్పింది. ఆటో క్లెయిమ్‌ సెటిల్మెంట్‌ను వివాహం, ఉన్నత విద్య, ఇండ్ల కొనుగోలు తదితర అవసరాలకు సైతం విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికార ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగుల క్లెయిమ్స్‌ కోసం సులభమైన పద్ధతిని తీసుకువచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈపీఎఫ్‌ఓ వెల్లడించింది. ఈ నిర్ణయంతో లక్షల మంది సభ్యులకు ప్రయోజనం చేకూరనున్నది. గతంలో ఆటో క్లెయిమ్‌ సెటిల్మెంట్‌ కేవలం ఆరోగ్య సమస్యలు ఉన్న సమయంలో మాత్రమే అడ్వాన్స్‌ తీసుకునే అవకాశం ఉండేది.

తాజాగా పెళ్లిళ్లు, ఉన్నత విద్యా, గృహ ఖర్చుల కోసం అడ్వాన్స్‌ తీసుకునేందుకు వీలు కల్పించింది. కోట్లాది మంది సభ్యుల జీవనాన్ని సులభతరం చేయడానికి ఆటోమేటిక్‌గా సెటిల్‌మెంట్‌ను ప్రారంభించామని.. విభిన్న ఆర్థిక అవసరాలను తీర్చే ఉద్దేశంతో సేవలను మరింత మెరుగుపరుస్తున్నట్లు ఈపీఎఫ్‌వో పేర్కొంది. ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ 2020 ఏప్రిల్‌లో ప్రారంభమైంది. ఐటీ వ్యవస్థ ద్వారా క్లెయిమ్ రెక్వెస్ట్‌లు ఆటోమేటిక్‌ మానవ ప్రమేయం లేకుండా ప్రాసెస్‌ అవుతాయి. ఈ విధానంలో క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్‌కు చాలా తక్కువ సమయం పడుతుంది.

సాధారణంగా పది రోజుల వరకు పట్టే అవకాశం ఉండగా.. ఆటోమేటిక్‌ విధానంలో కేవలం మూడునాలుగురోజుల్లోనే పూర్తయ్యే అవకాశం ఉంది. ఆటో సెటిల్మెంట్ ద్వారా ఇంతకు ముందు కేవలం రూ.50వేల పరిమితి మాత్రమే ఉండేది. ఇటీవల దీన్ని రూ.లక్షకు పెంచిన విషయం తెలిసిందే. ఆరోగ్య సమస్యలు, పెళ్లిళ్లు, చదువులు, గృహ అవసరాలకు కోసం ఇకపై రూ.లక్ష తీసుకునేందుకు ఈపీఎఫ్‌వో వీలు కల్పించింది.

ఉద్యోగ భవిష్య నిధిలో 27.24కోట్ల మంది ఖాతాదారులనున్నారు. ప్రస్తుత సంవత్సరంలో 2.25కోట్ల మంది సభ్యులు ఈ సదుపాయాన్ని పొందనున్నారని అంచనా. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్‌వో సుమారు 4.45కోట్ల క్లెయిమ్స్‌ను సెటిల్‌ చేసింది. ఇందులో 60శాతం (2.84కోట్ల) కంటే ఎక్కువ క్లెయిమ్స్‌ అడ్వాన్స్‌డ్‌ క్లెయిమ్స్‌ కావడం విశేషం. సెటిల్‌ అయిన మొత్తం అడ్వాన్స్‌ క్లెయిమ్స్‌లో దాదాపు 89.52లక్షల క్లెయిమ్స్‌లో ఆటోమేటిక్‌ విధానంలో పరిష్కరించింది.

Latest News